Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

29, ఆగస్టు 2011, సోమవారం

తెలుగు - వెలుగు

[ పింగళి మోహిని ]


కం|| తెలుగునగల సాహిత్యపు
       విలువెరిగి పఠింపవలయు వేవేల కృతుల్
       సులువైనది, మృదువైనది
       తెలుగున మాట్లాడుకొనుడు ధీవరులారా!

కం|| అధికారభాష తెలుగును
       అధికారులు, భుధులు, జనులు వ్యవహారములో
       విధిగా పాటించినచో
       సుధలొలికెడి తెలుగు భాష శొభిల్లుకదా!

సీ|| నన్నపార్యునిచేతి నాణ్యంపు శిల్పమై
                ప్రభవించినది తెల్గు భారతమున
     వాగ్గేయకారుడై పదకవితలనల్లి
               అమరుడైనాడు నాడన్నమయ్య
     ఉభయభాషాప్రౌఢి నుప్పొంగురాయలు
              తెలుగు వల్లభునిగ తెలుపుకొనియె
      సంఘసంస్కరణకై సాహిత్యమందించి
             తెలుగులో గురజాడ తేజరిల్లె
గీ|| ఎందరెందరొ మాన్యులు యేర్చికూర్చి
     తీర్చిదిద్దినమేలైన తెలుగు భాష
     చదువ సంగీతమగును నజంత భాష
     తేనె లొలికెడి కమ్మని తెలుగు భాష!

|| వేమన పద్యపంక్తులకు ప్రేరణనొందిన సీ.పి.బ్రౌను, యా
     సీమను నున్నపండితుల చెంతనుచేరి తెలుంగునేర్చి, భా
     షామణిహారమా! యనగజాలు నిఘంటువు కూర్చి యిచ్చి నా
     డా మహితాత్ము స్వీయమహదాశయ మిమ్మహి వ్యాప్తిచెందగన్

గీ|| విశ్వవిద్యాలయమ్ములు విబుధజనులు
    తెలుగు ప్రాచీనభాషగా తేల్చి చెప్పి
    పూని ప్రకటింపచేసిరి పుష్టినొంద
    తెలుగు సంస్కృతీ విభవమ్ము దీప్తిగాంచ.

గీ|| రాణకెక్కిన చరితంపు ప్రజల భాష
     భాషలందున లెస్సైన ప్రాచ్యభాష
     తెలుగు ప్రాచీనతను గురుతించెగాన
     కీర్తిగాంచదె భారతకేంద్రప్రభుత. 



తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా అశేష తెలుగు మిత్రులకు శుభాభినందనలు.

2 కామెంట్‌లు:

హనుమంత రావు చెప్పారు...

పద్యాలలో మిమ్మల్ని అభినందిద్దామన్న పద్యమల్లగరాదు
తెలుగు భాషాభిమానము పద పదమున గుంభనము
లలిత లలిత పదముల మనమునకు హత్తుకునె
అభినందమందారమాల ఇదె మీకు పింగళి వంశకుసుమమా

పింగళి మోహిని చెప్పారు...

ధన్యవాదాలు హనుమంతరావు గారూ! మీ అభిమానానికి కృతజ్ఞతలు.