( శశిధర్ పింగళి )
(80వ దశకంలో శ్రీ మల్లాది, యండమూరి గార్ల కథలు, సీరియల్స్, నవలలు విరివిగా వచ్చే రోజుల్లో.. అవి చదివి వ్రాసినది. అయితే యెక్కడికీ పంపలేదు అసలు పంపాలనే ఆలోచనే రాలేదప్పట్లొ. బ్లాగ్ మొదలు పెట్టాక పాత ఖజానాలు వెతుకుతుంటే బయల్పడిందిది. మీతో పంచుకోవాలని ఇప్పుడిక్కడ పెడుతున్నా..చదివి అభిప్రాయాలు తెల్పండి.)
"అమ్మగారూ! తమరికోసం ఎవరో బాబుగారు వచ్చారండి" అంటూ రామయ్య వినయంగా చేతులు కట్టుకుని చెప్పి వెళ్ళి పోయాడు.
అఁ.. అంటూ తను చదువుతున్న మల్లాది పుస్తకంలోంచి తల త్రిప్పి, ఒక్క క్షణం ఆలోచించింది వచ్చింది యెవరై వుంటారా అని. తను అప్పటివరకూ చదువుకుని బాగా అలసిపోయింది. అందుకే రిలీఫ్ కోసం నిన్న తన ఫ్రండునుండి తీసుకున్న నవల తీసింది చదువుదామని. సాధారణంగా తను బాగా అలసి పోయినప్పుడు మాత్రమే మల్లాది నవలలు చదువుతుంది. అందులోని సునిసిత హాస్యం, ఆ శిల్పం తనకెంతో రెలీఫ్ నిస్తాయి.
మేడమీద తనగదిలో డబుల్ కాట్ పై పడుకుని చదువుకునేది కాస్తా ఒక్కసారి వెల్లికిలా తిరిగి గుండెల మీద తెరచిన పుస్తకాన్ని పెట్టుకుని రెండు నిముషాలు ఆలోచించింది "వచ్చింది ఎవరై వుంటారా అని". తన చిన్న బుర్రకి ఎవరూ తట్టక పోవడంతో "చూద్దాం" అని పుస్తకాన్ని పక్కనపెట్టి లేచింది సన్నగా వళ్ళు విరుచుకుంటూ.
లేచి బాల్కనీ లోకివచ్చి క్రింద సోఫాలో ఒక ప్రక్కకి ఒదిగి కూర్చున్న వ్యక్తిని చూసింది వెనుకనుండి. ఎవరబ్బా! ఎవరో కొత్త వ్యక్తిలా వున్నాడే అనుకుంది. క్రింద సొఫాలో కూర్చుని ఇల్లంతా కలయచూస్తూ వినక్కి తిరిగిన అతన్ని చూసింది. ఒక్కసారిగా అశ్చర్యం, సంభ్రమం మిళితమై విస్ఫారిత నేత్రాలతో చూసింది "కలా నిజమా" అనుకుంటూ.
ఆనందంతో వుక్కిరిబిక్కిరై కుడిచేతిపిడికిలిని ఎడమచేతిలో బిగించి గుండెలదగ్గరగా పెట్టుకుని తల కొంచెం కుడిభుజానికి దగ్గరగా త్రిప్పి కళ్ళు మూసుకుని "హుర్రే" అంటూ అరవాలనుకుంది. కానీ తనకెప్పుడూ అలా అరచిన అనుభవం లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
అలా బల్కనీ రైలింగ్స్ మీంచి ఒక్క దూకు దూకి అతనికి ఎదురుగా వద్దామనుకుంది. లేకపోతే అడుగుకి ఒక ఐదారు మెట్లు చొప్పున దిగి వద్దామనుకుంది. ఇంకా ఎన్నో అనుకుంది. కానీ యే ఒక్కటీ చేయలేదు. మెల్లగా హుందాగా మెట్ల రైలింగ్స్ ని పట్టుకుని ఒక్కొక్క మెట్టూ దిగుతూ వచ్చింది.
ఆమె కనిపించింది మొదలూ అతను రెప్పవేయడం కూడా మర్చిపోయి అలాగే చూస్తుండిపోయాడు విభ్రాంతిగా.
ఎదురుగా వచ్చి చేతులు జోడించి "హలో! నమస్తే, వాటే సర్ ప్రైజ్" అంది నవ్వుతూ.
ఆ పలకరింపుతో ఈలోకంలోకి వచ్చిన అతను ప్రతినమస్కారం చేసాడు అప్రయత్నంగా. తనని పలకరించినప్పుడు ఆమె కళ్ళలో మెరిసిన జ్యోత్స్నలనీ, నవ్వుతున్నప్పుడు పడ్డ ఆ బుగ్గల మీది సొట్టలనీ గమనించడం మాత్రం మర్చిపోలేదతను.
"రండి..కూర్చోండి" అంటూ చేతితో సొఫాని చూపించి అతను కూర్చున్నాక తనూ ఎదురుగా వున్న సొఫా చైర్ లో కూర్చుంది.
"ఏమిటి ఇలా అకాల వర్షంలా"
"అవును ఇప్పుడు వచ్చేవన్నీ అకాల వర్షాలేగా"
"ఇక్కడ యూనివర్సిటీలో పనుండి వచ్చాను. ఎప్పటి నుండో రావాలని ప్రయత్నం. కానీ ఏం చేయను? ఎప్పటికప్పుడు ఏవో పనులూ, వీలు కాని పరిస్తితులూను. ఇక తప్పనిసరై ఇప్పుడు వచ్చాను. వచ్చే ముందు "ఇంటిమేషన్" యిద్దామనుకున్నను, కానీ సడెన్ గా వెళ్ళి సర్ ప్రైజ్ చేద్దామనిపించి చివరి నిముషంలో విరమించుకున్నాను. "డిస్ట్రబ్ చేసానా? సారీ" అన్నాడతను.
ఎడమకాలిపై కుడికాలు వేసుకుని దానిపై తన రెండు మోచేతులూ ఆన్చి ఆ రెండు పిడికిళ్ళూ గడ్డం క్రింద పెట్టుకుని అతను చెప్పెది వింటున్న ఆమె లేదన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది సన్నగా నవ్వుతూ.
"మిమ్మల్ని చూస్తున్నందుకు, రియల్లీ ఐ యామ్ వెరీ హాపీ. ఇప్పటిదాకా చదువుకుని, కాస్త రిలీఫ్ కోసం ఎదో నవల తీసుకొని చదువుతున్నాను".
"రామయ్య వచ్చి ఎవరో వచ్చారు మీకోసం అంటే, ఎవరో లొకల్ ఫ్రెండు అయివుంటారనుకున్నాను. మిమ్మల్ని చూసి ఎంత ఆశ్చర్యపోయానో తెలుసా?" అంది అసలే విశాలమయిన కళ్ళని మరింత విశాలం చేస్తూ.
"ఊఁ.." అన్నట్లుగా చూసాడతను కనుబొమ్మలు పైకి ఎగరవేస్తూ.
"ఓ..సారీ, మిమ్మల్ని అలానే కూర్చోపెట్టేసాను, రామయ్యా రెండు కూల్ డ్రింక్స్ పట్టుకురా" అంటూ యింట్లోకి ఓక కేక వేసింది.
అతను కంగారుగా "నో..నో ఫర్మాలిటీస్, ప్లీజ్" అన్నాడు.
"నో..ఇట్స్ నాటె ఫార్మాలిటీ, ఇట్స్ మై ప్లెజర్, యు ఆర్ మై గెస్ట్ ఇట్స్ మై డ్యూటీ టు సెర్వ్ యు".
"యూ..; అంటూ యేదో చెప్పబోయి అప్పటికే ట్రేలో కూల్ డ్రింక్స్ తో ప్రత్యక్షమయిన రామయ్యని చూసి ఆగిపోయాడు. ట్రేలోని డ్రింక్స్ ని తనే తీసుకుని అతనికి అందించి, యింకొకటి తను తీసుకుని చెప్పింది మెల్లగా.
"ప్లీజ్..హావిట్"
అతను తీసుకుని సిప్ చేసాక, తనూ కొంచెం సిప్ చేసి అంది "ఊఁ.. ఇప్పుడు చెప్పండి ఏమిటి విశేషాలు మాయిల్లు ట్రేస్ అవుట్ చేయడంలో యేమైనా రిస్క్ ఫీలయ్యారా?"
"నో..నో అలాంటిదేమీలేదు. అభిమానులని కలుసుకోవాలనుకున్నప్పుడు రిస్క్ ఏమిటి చెప్పండి? నిజానికి చాలా ఈజీగా కనుక్కోగలిగాను. ఈ సందులోకి రాగానే ఎవరో కాలేజీ కుర్రాడనుకుంటాను సైకిలుపై వెళుతున్నాడు. అతన్ని ఆపి మీ పేరు, కాలేజీ చెప్పి ఎక్కడ ఇల్లు అని అడిగాను. అతను వెంటనే మీ ఇల్లు చూపించి సైకిలుపై పారిపోయాడు భయంగా. అప్పడనుకున్నాను మీరు నిజంగానే "వీవ" అయివుంటారని".
(రేపు ఇంకొంచెం ..)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి