Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

22, ఆగస్టు 2011, సోమవారం

అతిథి 2

శశిధర్ పింగళి )
                   -  2  -
"వీవ" ఆశ్చర్యంగా చూసిందామె ఎమిటన్నట్లు.

"ఏమీ లేదు, మీరు వీర వనిత కదా, ఎప్పుడొ అతగాడు మీ టీజింగుకి బలి అయ్యుంటాడు అందుకే అంతలా బెదిరిపోయాడు పాపం".

"యూ సిల్లీ" అంటూ కొద్దిగా సిగ్గుపడిందామె ఆ కాంప్లిమెంట్ కి. చైర్ లో వెనక్కివాలి కుడిచేతి బొటనవేలి గోరుని ఎడమచేతి వుంగరంవేలు గోరులోనికి పోనిచ్చి చిటపటలాడిస్తూ, మెల్లగా వెనక్కి వాలి కూర్చుంది.

"నా వుత్తరం అందిందనుకుంటాను. మా చంద్రకూడా వ్రాసింది అందులో. నిజానికి మీ జాబు కోసం ఎదురుచూస్తున్నాం. మీరే వచ్చారు."

"అదిందండి. వెంటనే రిప్లైకూడా యిద్దామనుకున్నాను. ఎటూ ప్రయాణం ఉందికదా అని ఆగాను. అయినా మీ చంద్ర ఉత్తరం చదవటానికే టైం సరిపోలేదు. ఎలాగూ వస్తున్నాను కదా ఆమె చేతనే చదివించి అర్థం చెప్పించు కుందామని కూడా తెచ్చాను."

"ఇది వరలో వుత్తరాల్లో ఒక జోక్ వ్రాసినట్లు గుర్తు, గుర్తుందా?"

"ఏమిటి" అన్నట్లు చిన్నగా తల పంకించింది ఆమె.

"అదేనండి ఒక తెలుగు మాష్టారికి ఇంటి నుండి భార్య ఉత్తరం వ్రాస్తే, అదేమిటో అర్థంకాక పరీక్ష పేపర్లా దిద్ది మార్కులు వేసి పదిసార్లు యింపోజిషన్ వ్రాయమని తిరిగి పంపాడట, పాపం పిచ్చి పంతులు. నా అనుమానం బహుశః ఆ ఉత్తరం ఇదేనేమోనని."

విషయం అర్థమయిన ఆమె, తన స్నేహితురాలిని అంటున్నందుకు కోపంగాచూసింది. అప్పటికే ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి రోషంతో.

"నో...నో...డోంట్ బి సీరియస్, ఐ సెడ్ ఇట్ జస్ట్ ఫర్ ఏ జోక్, ప్లీజ్" అన్నాడతను కంగారుగా.

అంతలోనే తమాయించుకుని, అతని కంగారుని చూసి తీయగా నవ్వింది.

[ చిన్నడౌట్ నవ్వు తీయగా వుండటమేమిటండీ వీడి ముఖం. అదేమన్నా కాకినాడ కాజానా? బందరు లడ్డూనా? అదేమంటే అదంతే. కావాలంటే చూసుకోండి ఇంతకంటే అసందర్భంగా వర్ణించారు మన కవులూ, రచయితలూ, నీ కస్సలు కళాత్మక దృష్టి లేదని బుకాయిస్తాడు మా వెధవ. సర్లెండి మనకెందుకు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ]

"అఁ.. అదీ అలానవ్వాలి హాయిగా" అంటూ అతనూ శృతికలిపాడు.

"అసలు మా ఫ్రండు ఏమంటాడో తెలుసా? కమ్మటి జోక్ విన్నప్పుడు హాయిగా నవ్వుకోలేనివాళ్ళు జీవితంలో ఎంతకలిమి వున్నా సుఖపడలేరట. హాయిగా నవ్వుకోవడం, తీయగా మట్లాడటం మనిషికి దేవుడిచ్చినవరాలట. నిజమేకదండి. అదే కదా జంతువులకీ మనకి తేడా." అన్నాడతను.

అవున్నట్లుగా చూసిందామె.

"మీ పరీక్షలు అయిదవ తేదీనుంచేనటగా, ఉదయం న్యూస్ లో విన్నాను. ఎలా సాగుతోంది మీ ప్రిపరేషన్. కెన్ యు హోప్ ఫర్ ది ఫష్ట్ క్లాస్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. ఇటీజ్ ఒన్ ఆఫ్ యువర్ టర్నింగ్ పాయింట్స్, యామ్ ఐ కరెక్ట్?"

ఎంతో సిన్సియర్ గా, ఆత్మీయంగా అతడు చెప్పే మాటలని ఎలా కాదనగలదు తను. అందుకే అంగీకరిస్తున్నట్లుగా మౌనంగా తలవంచుకుని కూర్చుంది.

మళ్ళీ తనే మొదలు పెట్టింది.

"అవునండీ, నిజమే " నేనూ ఎంతశ్రద్ధతో చదువుతాను. ఉన్నట్లుండి ధ్యాస ఎక్కడికో వెళ్ళి పోతుంది. అలా పరధ్యానంలో ఎంతసేపు వుంటానో తెలీదు. ఏవేవో ఆలోచనలు, ఊహలు. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆకాశంనుండి ఊడిపడినట్లుగా ఈ లోకంలోకి వస్తాను. నన్ను చూసి నేనే నవ్వుకుంటాను. అంతే దాంతో చదువుకుందామన్న మూడ్ కాస్తా అవుట్."

"ఏమిటో మీ ఉత్తరం వచ్చినప్పుడు మాత్రం ఎంతో రిలీఫ్ ఫీలవుతాను. చూడండి ఎంత తమాషాగా జరిగిందో మన పరిచయం. యిన్నాళ్ళు కలం స్నేహితులుగా ఎంత స్నేహాన్ని పెంచుకున్నామో, ఒకరికి ఒకరం పరిచయం లేకున్నా " సరదాగా ఆట పట్టించుకోడాలూ, మీరు వ్రాసే చిలిపి జోకులూ, అప్పుడప్పుడు ఆలస్యానికి వేసే మందలింపులూ, ఎంతో ఆత్మీయంగా మీరిచ్చే సలహాలూ, చేసే హెచ్చరికలూ " ఓహ్.. రియల్లీ ఐ యామ్ వెరీ ప్రౌడ్ టు హవ్ ఎ ఫ్రెండ్ లైక్ యు. అయినా మీరీ మధ్య యిదివరలా రెగ్యులర్ గా రిప్లైస్ ఇవ్వడంలేదు. ఉత్తరాల బరువు కూడా చాలా తగ్గి పోయింది. మొదట్లో మా పోస్ట్ మాన్లు ముగ్గురు మారిపోయారు గూని వచ్చి మొదటి ఆరునెలలకే. ఇప్పుడు ఆరునెలలగా ఒక్కడే హాపీగా తిరిగేస్తున్నాడు చూడండి" అంటూ అలిగినట్లు బుంగమూతి పెట్టి చూసింది.

ఆమె మాటలలోని ఆత్మీయతకి స్నేహభావానికి కదలిపోయింది అతని మనసు.

"రియల్లీ, ఐ యామ్ వెరీ సారీ. కానీ ఉద్దేశ్యపూర్వకంగా మాత్రం డిలే చేయలేదు. ఇతర పనులలో పడి తీరిక లేక, తీరిక దొరికిన కొద్ది సమయంలోనూ కంగారుగా వ్రాయటం ఇష్టం లేక మాత్రమే ఆలస్యంజరుగుతోంది. మీకు తెలుసుగా ఉత్తరాలు వ్రాయటంపై నాకున్న అభిప్రాయం. ఈవిషయమే చాలాసార్లు మీకు వ్రాసినట్లు కూడా గుర్తు." అన్నాడతను సంజాయిషీగా.

తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దమే నాట్యంచేసింది వారిమధ్య. ముందుగా అతనే తేరుకున్నాడు. తనుండేది కొద్దిసేపే. ఆ కొద్దిసమయమూ ఇలా మౌనరాగాలు పాడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తాపూర్తవుతుంది. అందుకే తనే అన్నాడు

"ఎలా ఉన్నారు మీ అల్లరిత్రయం. అల్లరేమైనా తగ్గిందా లేక అంతేనా? అన్నట్లు మీ చంద్రకి ఆరోగ్యం సరిలేదన్నారు ఇప్పుడెలా ఉన్నారు. పాపం ఆవిడేమో అభిమానంతో లెటర్ వ్రాస్తే నేనేమో క్రూషియల్ గా జోక్స్ వేసి నవ్వుకుంటున్నాను. దయచేసి ఆమెకి చెప్పకండి ఈమాటలు. నొచ్చుకుంటారు. ఇప్పుడె నామీద కోపంపోయిందా అంటూ వ్రాసరు. నా కెందుకండీ ఆమెపై కోపం. ఏదో సరదాగా స్పోర్టివ్ గా వుంటుందని టీజ్ చేస్తూ ఉత్తరం వ్రాసాను. అంతే. ఏమీ అనుకోవద్దని చెప్పండి ఆమెకు. ఆమె నాధైర్యాన్ని సవాలుచేస్తూ ఫొటో పంపమని వ్రాసారు. చూసారా నేనే ప్రత్యక్షమయ్యాను. కానీ, ఆవిడని చూసే అదృష్టం లేదనుకుంటాను" అన్నడు.

మౌనంగా అరచేతిలోని గీతలను చూసుకుంటూ వింటున్న ఆమె ఏదో చెప్పబోతున్నట్లుగా తలెత్తింది. ఇంతలో బజర్ మ్రోగిన శబ్దం. ఇద్దరూ ఆ మ్రోగిన వైపుకి చూసారు.

                                                                                                                            ( మిగిలింది రేపు )


కామెంట్‌లు లేవు: