[శశిధర్ పింగళి ]
ఎప్పటినుంచో ఓ కోరిక
కోరికగానే మిగిలిపోతోంది..
ఆశలతీరానికి దగ్గరగా వుంటూ
అలసత్వానికి బలైపోతొంది..
లేలేతపాదాలతో నువ్వు
నడిచొస్తుంటే చూడాలనీ...
కనీ కనిపించకుండా
నువు దాగుడుమూతలాడుతుంటే
చూసి నవ్వుకోవాలనీ...
చేతులుసాచి గుండెలనిండా
నిన్ను హత్తుకోవాలనీ...
చిన్ని ఆశ!
నువ్వొస్తావనే
మునివాకిలినిముగ్గుల్తో అలంకరించా
అర్ధరాత్రికూడా దాటకుండానే…
అంతరంగపుటరుగులమీద
రంగవల్లులేసుకున్నాను - అక్కడ
నీతో కూర్చొని కబుర్లు చెప్పాలని
ఆశ పడ్డా!
రాత్రంతా నీ తలపుల జడిలో పడి
తడిసి ముద్దవుతూ వుంటే
ఓ వెచ్చని ఒడి
మెల్లగా నన్ను తనలోకి లాక్కుంది
పొద్దున్నే -
నీవంపిన కబురు నన్ను జేరే లోగా
ఎవరో బరువైన బద్దకాన్ని – నా
రెప్పలపై పెట్టి వెళ్ళిపోయారు..
వదిలించుకుని లేచేసరికి నువ్వేమో
అందనంత యెత్తుకెదిగిపోయావ్..
ఇప్పటికీ – నువ్వు వస్తుంటే
చూడాలన్న - ఆ
కోరిక అలాగే వుండిపోయింది.
అయితేనేంలే, అప్పటిదాకా
తోడుతెచ్చుకున్న ఆశ తో
ఎదురుచూస్తూ వుంటా
ఆ రేపటి కోసం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి