స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

24, సెప్టెంబర్ 2015, గురువారం

ఏరీతి మాబోంట్లు జేరగలరు ?

శశిధర్ పింగళి ]

ఎగిరేటి పక్షిపై తిరిగేటి నీ దరికి
          ఏరీతి మాబోంట్లు జేరగలరు ?

బుసకొట్టు పామెక్కి బోజ్జుండు నీ దరికి
          ఏరీతి మాబోంట్లు జేరగలరు ?

అలల సంద్రపుటింట అలరారు మీయింటి
          కేరీతి మాబోంట్లు జేరగలరు ?

అవతార ములపేర ఎవరింట నుందువో
          ఏరీతి మాబోంట్ల కెరుక గలుగు ?

కనుక, కరుణించి మాబోంట్ల కష్ట మెరిగి
ఆర్తి జేసిన ప్రార్థనలాలకించి
కరిని గాచిన కరముతో గాచి మమ్ము
చీరి నీచరణ పద్మాల జేర్చుకొమ్ము!

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

ముక్కంటి యేరీతి ముద్దులాడు ?

శశిధర్ పింగళి ]

తనమేన సగమైన తరుణి పార్వతితోడ
    ముక్కంటి యేరీతి ముద్దులాడు ?
తలపైన కొలువున్న నెలత గంగమతోడ
   శూలపా ణేరీతి జూఁపుగలుపు ? 
గజవక్తృ కేరీతి గౌరమ్మ ప్రేమతో
    కోరి తినిపించునో గోరుముద్ద ?
ఆరు మొగముల వాని నాదరమ్మున బిల్చి
    లాలించి యేరీతి పాలు కుడుపు ? 

 వెండికొండన మీయింట వింతశోభ
చూడ మనసయ్యె నొకసారి జూఁపవయ్య
నీదు ప్రమధుల మూకలో నాదరించి
కరుణ జూఁడుము మ్రొక్కెదన్ కరము లెత్తి!

30, జూన్ 2015, మంగళవారం

నేనూ బ్రహ్మనే !

[ శశిధర్ పింగళి ]
అనంతానంత విశ్వంలో
అణుమాత్రంగావున్న నేను కూడా
బ్రహ్మనే!?
ఎందుకంటే
పుట్టినదగ్గర నుంచీ
పరివారం కోసమైతేనేమి
ప్రపంచం కోసమైతేనేమి
ప్రతిక్షణం - నన్ను నేను
క్రొత్తగా సృష్టించుకుంటూనే వున్నా...మరి !?

 = = = 

21, జూన్ 2015, ఆదివారం

మన్నిస్తావుకదూ.. నాన్నా!

[ శశిధర్ పింగళి ]

నీ మోకాళ్ళపై - నే
బొర్లా పడుకుని  బోసినవ్వులు
నవ్వుతూ ఊయలలూగే - ఆ
అపురూప క్షణాలు -  
పడుతూ లేస్తూ అడుగులేస్తూ
నిన్ను చేరుకున్న వేళ - నీ
కళ్ళల్లొ మెరిసే ఆ అనంద క్షణాలు -
నా  బంగరు భవితవ్యానికి
నీ కళ్ళతొ కలలు కంటూ
ఎదురు చూసే ఆ నిరీక్షణాలూ
అవిశ్రాంతంగా శ్రమిస్తూ కూడా
అర్ధ రాత్రిదాకా తోడుండే  నీ
అనురాగ వీక్షణాలు
నా కోసం త్యాగం చేసిన వెన్ని క్షణాలో
నాకోసం వీపున మోసిన వెన్ని వ్రణాలో
ఏ త్యాగమయమూర్తుల ప్రక్కనో నీకు
పీఠమేసి నిలబెడుతున్నాయి -
వేలుపట్టి నిలబెట్టిన రొజులే కాదు
వేలుకట్టి చదివించిన రొజులూ గుర్తే !
యెందుకు నాన్నా యివన్నీ అంటే
అమాయకంగా నవ్వే ఆ నవ్వూ -
అంతర్లీనంగా ప్రవహించే ప్రేమేమో
కళ్ళల్లొకి చిమ్మి చిన్నగా మెరుస్తుంది గానీ
మౌనం గీత దాటని మాట
కోరని వరాలిన్ని యిచ్చినా  యింకా- ఓ
కోరిక వుంది నాన్నా! తీరుస్తావా?
త్యాగాన్ని నీ వద్దే వుంచుకుని
ప్రేమానురాగాల్ని పంచి యిచ్చేసావ్
ఇప్పుడా త్యాగం కూడా నా కిచ్చేయవూ
రేపు - నాకు పనికొస్తుందన్న స్వార్థం కాదు
నాన్నా.. ఇక పై నీకా అవసరం లేదందుకే 
అడుగుతున్నా - ఇస్తావుకదూ .. మన్నిస్తావుకదూ!
                   ***

పిత్రుదినోత్సవ శుభాకాంక్షలు... 


29, మే 2015, శుక్రవారం

"పరమాత్మ నిలయం"

పరమాత్మ నిలయం

సిలికాన్ ఆంధ్ర - సుజన రంజని మే 2015 సంచికలో ప్రచురింపబడ్డ కథ. ఈ క్రింది లింకులో...
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2015/katha2.html

[శశిధర్ పింగళి]

సమయం ఉదయం 10.30 గంటలు మునిసిపల్ ఆఫీస్ అప్పుడప్పుడే చిక్కబడుతోంది హడవుడిగా వచ్చే సిబ్బంది తోనూ, ముందుగానే వచ్చికూర్చున్న సందర్శకులతోనూ.
పదిన్నర కావొస్తున్నా సీటుకు చేరుకోని సిబ్బందిని చూసి, మనసులోనే "వీరెప్పుడు మారుతారురా భగవంతుడా" అనుకుంటూ ఒకరిద్దరు సందర్శకులు మౌనంగానే తమ అసహనాన్ని ముఖంలో వ్యక్తపరుస్తున్నారు.
మునిసిపల్ ఆఫీస్ మొదటి అంతస్తులో కిటికి ప్రక్క సీటులో కూర్చున్న ఓ యువకుడు మాత్రం ముళ్ళమీద కూర్చున్నట్లు అసహనంగా అటూ ఇటూ కదులుతూ మాటిమాటికీ కిటికీ లోంచి తొంగిచూస్తున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన ఆఫీస్ ప్యూన్ ని చూసి
"ఇదిగో వీర్రాజూ ఇటురా" అంటూ పిలిచాడు. వీర్రాజు వస్తూనే "సార్, ఇంకా ఏ విషయం తెలీలేదండి, ఈ రోజుకూడా దుకాణం తీయలేదు, మీరో అరగంట పర్మిషన్ ఇస్తే ప్రక్క వీధిలో వాళ్ళ అబ్బాయి షాప్ కి వెళ్ళి వాకబు చేసి వస్తా" అన్నాడు వినయాన్ని నటిస్తూ.

9, మే 2015, శనివారం

అమ్మ-అమృత వాహిని

[శశిధర్ పింగళి]

యుగాల ముందునుంచీ  కూడా
ఒక జీవనదీ ప్రవాహం
నిర్విరామంగా ప్రవహిస్తూనే వుంది
అలల క్రింది నుంచీ అంతర్వాహిని లా
మాయని ప్రేమేదో రహిస్తూనే వుంది
దిగంతాల సాక్షిగా

18, ఏప్రిల్ 2015, శనివారం

లవ్వించుక కొసరువెట్టి….

[శశిధర్ పింగళి]

పచ్చని కాపురమంటే
నచ్చిన చీరొకటి తెచ్చు నడవడి కాదోయ్
మెచ్చిన చీరకు మల్లే
వెచ్చగ తాచుట్టుకొనెడు విభుడే ఘనుడౌ...1

తెచ్చిన చీరలొ సతితా
మచ్చిక గాదరి కిజేరి మాధుర్యముతో
వెచ్చని కౌగిలి లో సొగ
సిచ్చిన మరి పుచ్చుకొనుటె సెహబాసు సుమీ! ...2

31, మార్చి 2015, మంగళవారం

గడుగ్గాయిలు (చిన్నకథ)


[శశిధర్ పింగళి]
ఏమిటే అమ్మాయ్ అలా కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నావ్.. రా! యిలా వచ్చి కూర్చో..
ఏదీ ఈ పుస్తకం కాస్త చదివి పెట్టు.
పో అమ్మమ్మా! అది నాకు అర్థం కాదు.
అర్థం కాకపోవడమేమిటే, చదువుకున్న పిల్లవేగా 
కాస్త మనసుపెట్టి చదివితే అదే అర్థమవుతుంది.. ఏదీ చదువు
ఆ మనసు దగ్గరలేకనే ఇలా తిరుగుతున్నా
అఁ.. ఏమైందే నీ మనసుకి
ఏంటో.. అమ్మమ్మా! తుంటరిగా తెగ అల్లరి చేస్తుంటే కాస్త చూసి పెట్టమని ఒక అబ్బాయికిచ్చాను..
అఁ.. అయితే..

30, మార్చి 2015, సోమవారం

సుదీర్ఘమైన వసంతాలు నా కక్కరలేదు...

[పింగళి శశిధర్]

విశ్వవ్యాపితమైన నీ
విరాడ్రూపాన్ని
దర్శించే శక్తి
ఈ చర్మ చక్షువులకు
లేవు...
దానికి ఆధార భూతమైన
నీ సుందర పద్మ సదృశమైన
పాదాలు చాలు..

26, మార్చి 2015, గురువారం

సాంత్వన

[శశిధర్ పింగళి]
చూరుకు వెలాడే దీపంలా
వాలిన కనురెప్పల కింద ఆ చూపులు
వంటరిగా వెలగలేక వెలుగుతున్నాయి
రెక్కలు విప్పిన రాబందుల్లా
ఆలొచనలు ఆకాశంలొ
గిరికీలు కొడుతున్నాయి

20, మార్చి 2015, శుక్రవారం

ఉగాది పాట !   [సేకరణ: శశిధర్ పింగళి]
చల్లగా వచ్చింది - సంవత్సరాది
కొల్లగా తెచ్చింది - క్రొత్త వింతలను
గండుకోయిల పాట - కమ్మనీ పాట

19, ఫిబ్రవరి 2015, గురువారం

చలమోర్వశీయం (ఊర్వశి-చలం సంవాదం)

(శశిధర్ పింగళి)

తెలుగు సాహితీలోకంలో చలం, తరాలు మారినప్పటికీ  పరిచయం అక్కరలేని రచయిత. పేరు కీర్తి మాటలెలావున్నా తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పటికీ అవి చదువరులని ఆరాటపెట్టే గ్రంధాలే. వాటిని చదివిన వాళ్ళకంటే చదవని వాళ్ళే ఎక్కువ విమర్శిస్తారనే అపప్రధకూడా వుంది. పోనీ చదివిన వాళ్ళు చెపుతారా అంటే వాళ్ళూ మాట్లాడరు. నామట్టుకు నాకు అన్నీ కాకపోయినా కొన్ని చదివి ఎలా అర్ధంచేసుకోవాలో తెలీక జుట్టుపీక్కున్నవాణ్ణే. ఆ విలక్షణశైలి, ఎంచుకున్న ఇతివృత్తం చదువరుల్ని వెంటాడుతాయనేదిమాత్రం నిజం. అలా వెంటాడిన కొన్ని ఆలోచనలే ఈ క్రింది రచనకు స్పూర్తి. (ముఖ్యంగా ఈ క్రింది రచనాశైలి... చలంగారి పురూరవ... రేడియోనాటకాన్ని మనసులోపెట్టుకుని చదవమని మనవి. ఒకవేళ ఇంతకుముందు ఆ రేడియో నాటిక వినకపోతే.. ఇక్కడ  వినండి)
***                    ***                         ***

ఒక నాటి సాయంకాలంలో నందనవనంలో ఒక మూలగా వంటరిగా, శూన్యంలొకి చూస్తూ ఏదొ అన్వేషిస్తున్నట్లుగా, ఏదొ పోగొట్టుకున్నట్లుగా  కూర్చున్న చలంగారి దగ్గరకు వస్తుంది ఊర్వశి.......

31, జనవరి 2015, శనివారం

"విష్ లిష్ట్"

శశిధర్ పింగళి 
----------------
ఉదయం వ్రాసుకునే"విష్ లిష్ట్" 
చాలా అందంగా, సుదీర్ఘంగా, ఉత్సాహంగా
వుంటుంది..
కానీ -
సాయంత్రం చేసుకునే సమీక్షలే
సంక్లిష్టంగా, సంక్షిప్తంగా, నిర్లిప్తంగా
వుంటాయి..


19, జనవరి 2015, సోమవారం

నా కిప్పటికీ గుర్తే !

శశిధర్ పింగళి

నా కిప్పటికీ గుర్తే - ఆనాడు
తడబడుతూ .. తలొంచుకుని
మెట్టినింట పాదం మోపిన - క్షణం –
బిడియంతో - బెరుకు బెరుగ్గా
చూసిన – చూపులూ –
ఈ చిన్ని హృదయానికి – రాణిని
చేస్తానని ఇచ్చిన మాటా –
అన్నీ గుర్తే –
కానీ చిత్రంగా

9, జనవరి 2015, శుక్రవారం

చలి మంత్రం!

[శశిధర్ పింగళి]
------------------
ఒకప్పుడు వేయించిన
విత్తనాల్లా విడివిడిగా వున్నవాళ్ళు కూడా
ఇప్పుడు పాకంలోపడ్డ పప్పుగింజల్లా
అతుక్కుపోతున్నారు...
మనుషుల్ని దగ్గరచేసే
మంత్రమేదో – తనకే తెలిసినట్లు
చలి చెలరేగిపో తోంది !!

7, జనవరి 2015, బుధవారం

నిన్ను దర్శించాలంటే

[శశిధర్ పింగళి]

తీరంవెంబడి
ఎంతనడిచినా - ఇంకా
తీరని కోరికేదో
బలంగా వినిపిస్తూనే వుంది!
ఇప్పుడిప్పుడే
అర్దమవుతోంది - నువు
సముద్రాన్ని చీల్చుకుని వస్తుంటే
కర్తవ్యం బోధపడుతోంది
నిన్ను దర్శించాలంటే
తీరికలేకుండా నడవటం కాదు
నిలకడగా నిలబడి
నిశ్చలంగా చూస్తే చాలని!!


2, జనవరి 2015, శుక్రవారం

మరో ఉదయం !!

[శశిధర్ పింగళి]
-----------------------
భూమ్యాకాశాల మధ్య
పరుగెత్తీ, పరుగెత్తీ
అలసిపోయాను -
అనుభవాల గొంగడిలో
అనుభూతులను యేరుకుంటూ
రాత్రంతా
నిద్దురలేకుండానే గడిచిపోయింది -
ఎవరో తలుపు తడుతున్నారు...
మళ్ళీ నన్ను
తనవెంట తీసుకుపోవటానికి
మరో ఉదయం వచ్చినట్లుంది !!
------------------