[శశిధర్ పింగళి]
రెండు వేర్వేరు తోటల్లో పెరిగిన మొక్కల్ని
ఒకచోట అంటుకట్టారు
అంటుకున్న బలమేమిటో కానీ
ఏ జవం ఏ జీవంలోకి పరావర్తనం చెందిందో
చెప్పలేనంతగా – ఎదిగిన
క్షణమొక పత్రంగా చిగురిస్తూ - పచ్చగా ఎదుగుతోంది
హరిత పత్రాల హర్షాతిరేకాల మధ్య నిశ్శబ్దంగా
మొగ్గతొడిగి నిర్మలంగా విచ్చుకుంటున్న
పూల కొత్తశొభతో మురిసిపోతోందా చెట్టు
కాలంపోసే నీళ్ళో కలలు కనే కళ్ళో కానీ
రోజురోజుకూ వూనుకుంటున్న వేళ్ళు
బిగుసుకుంటున్న బంధం
కొమ్మలపై వాలే కొంటె కోయిలలూ, చిట్టి చిలుకలే కాదు
అలసిపోయి నీడచేరిన వృద్ధప్రాణులూ వున్నాయి
అప్పుడప్పుడు అతిథులుగా
వచ్చిపోయే బాటసారులు సరే సరి
అందరికీ ఒకే నీడ అదే ఆదరణ అదే ఆప్యాయత
కల్పవృక్షంకొమ్మలా – అమ్మలా
ప్రేమను పంచే పారిజాత పరిమళం
నాదేశం నందనవనమంతా
సుభిక్షమై శోభిల్లుతోంది – ఈ
పారిజాత వృక్షాలతోనే మరి
చెదురు మదురుగా వీస్తున్న
పడమర గాలికి
రాలిపడేవి
జీవం కోల్పోయిన కొన్నిమృతపత్రాలే
ఆస్థానంలో మళ్ళీ నవ జవాలతో
నూత్న పల్లవాలు పుడుతూనే వున్నై
నాతోట యెప్పుడూ పూర్ణ గర్భిణిలా
నిండుగా నవ్వుతూనే వుంటుంది
నిజానికి ఈ గాలి మోసుకెళ్ళే
సుగంధాల సౌరు
సొక్కి
మత్తెక్కిన యెన్నో పడమర ప్రాణాలు
ఇక్కడ మొలకెత్తాలనుకుంటున్నాయి
ఇక్కడి మొక్కలతో అంటు కట్టాలనుకుంటున్నాయి
అదీ ఈ నేలకున్న బలం – ఈ గాలికున్న బంధం
--- --- ---
4 కామెంట్లు:
చాలా బాగుంది
Thank you Venu garu
Thank you Venu garu
Thank you Venu garu
కామెంట్‌ను పోస్ట్ చేయండి