[శశిధర్ పింగళి]
పాతవాసనల్ని పూర్తిగా
తుడిచేసి - వంటికి
వర్తమానపు రంగులద్ది
పొందిగ్గా పొత్తిళ్ళలో పెట్టి
అమ్మ పక్కలో పెట్టింది ఆయా!
సరిగ్గా - అప్పుడే
సంఘర్షణ మొదలయ్యింది - నాలొ
గతాన్ని మర్చిపోలేక - వర్తమానంలో
ఇమడలేక చేసే నా ఆక్రందనలు
చుట్టూ వున్న వాళ్ళ ముఖాల్ని
చేటంతచేసాయి ?!
రోదనలోని వేదనని
గుర్తించడం మానేసి
పాలబుగ్గని నోటికందించి
లోకం చేసే - యేమార్చే
ప్రయత్నం !
శైశవం నుంచి - బాల్యంలోకీ
బాల్యం నుంచీ - యవ్వనంలోకీ
యవ్వనంనుంచీ - వృద్ధాప్యంలోకీ
సాగే ప్రతిప్రయాణంలోనూ
నన్ను విడువకుండా
నావెంటే వచ్చిన నేస్తం - ఈ
సంఘర్షణే
మధ్య మధ్యలో అందివచ్చిన
తాయిలాలన్నీ- తాత్కాలికమే
కానీ నా
సంఘర్షణ మాత్రం
నిరంతరం – నిర్విరామం
నిలువెత్తు నిజం ..
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి