Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

24, మార్చి 2012, శనివారం

ఋతుగానం

         (పింగళి మోహిని)

   అలసి సొలసిన అరుణ కిరణుడు
   పశ్చిమాద్రికి పయనమయ్యెను
   అతని లేమికి వంతనొందిన
   దిక్కులన్నీ ఎర్రబారెను
   పద్మ బంధుని అరుణకాంతులు
   సరసులన్నిట ప్రతిఫలించెను
   సన్నజాజులు
   మల్లెమొగ్గలు
   మలయపవనుని మందహాసము
   చూచి కలువలు నాట్యమాడెను
   పచ్చపైరులు పాటపాడెను
   కడుపునిండుగ గడ్డిమేసిన
   తల్లియావులు మందయానము
   జేయుచుండగ - లేగదూడలు
   చెంగు ఛెంగున గంతులేయుచు
   తల్లి కెదురుగ పరువులెత్తెను
   కొమ్మ కొమ్మన కోయిలమ్మలు
   పంచమములో పాడసాగెను
   చైత్రరధమున ఋతువసంతుని
   రాక జగతిని సేదతీర్చెను
   యేటికేడుగ సంతసమ్మిల పోటులెత్తగ
   స్వాగతమ్ములు పల్కుచుండిరి
   నందనమ్మను వత్సరానికి
   తెలుగు వారల సంవత్సరాదికి !!!

*** ఉగాది శుభాకాంక్షలతో ***

2 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

అందమైన కవితతో నందనానికి స్వాగతం. బావుందండీ..మీకూ మీ కుటుంబసభ్యులకూ ఉగాది శుభాకాంక్షలు.

పింగళి మోహిని చెప్పారు...

థాంక్యూ....జ్యోతిర్మయిగారూ.