Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

25, మార్చి 2012, ఆదివారం

అనందనందనం

రచన: పింగళి వేంకట శ్రీనివాస రావు (శ్రీకాశ్యప), 040-23838408, 8179140596
              కార్యదర్శి, చైతన్యభారతి సాహిత్య సాంస్కృతిక పరిషత్

(చైతన్యభారతి సాహిత్య సాంస్కృతిక పరిషత్, మోతీనగర్, హైదరాబాదు నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనము ది.25.03.2012 నాడు చదవబడినది.)

నగ్న మునులట్లు కన్పట్టి నయములేని
వృక్షవనితల నెమ్మేన వింతవింత
చివురుజొంపాల వలువలు సిద్ధపరచి
మాన సంరక్షణముచేయు మహితఋతువు.

     శిశిరమును త్రోసిరాజిల్లు చేవగాడు
     కాలపురుషుని తొలుదొల్త కడుపుపంట
     తుంట విలుకాని నెయ్యంపు కంటివెలుగు
     సరస సౌమిత్రి వచ్చె వసంతుడిలకు.

ఆది ఋతురాజు వైభవమవని చాట
కోరి సహకార పల్లవకోమలములు
మెక్కి రెచ్చిన కంఠాన మించిపాడె
కొమ్మ కొమ్మను జేరి పుంస్కోకిలమ్ము.

     శ్రీలు కెంగేలధరియించి కాలవిభుడు
     చైత్ర రధమెక్కి ముదమార జైత్రయాత్ర
     సకలహితగామి సఖుడు వసంతుతోడ
     నందనుండయి వెడలె విన్నాణమొదవ.



స్వాగతమో సమాగత సువత్సర కాల కుమారయంచు, నీ
యాగమనమ్ము కోరి హృదయమ్మును కోవెలరీతి జేసి, పు
న్నాగవరాళిలో వర సునాదవినోద సరాగ రంజికా
రాగమునూది పల్కె మది రంజిల కోయిల గున్నమావిపై.

అరుదుగ వచ్చితీవు నిలనర్వది వత్సరముల్ గతించె, నీ
దరిశన భాగ్యమబ్బకను, ధన్యులమైతిమి నీదురాకచే
మురిపెముతోడ నీ మృదుల పుణ్యకరమ్మున నాశిషావళుల్
ధరపయి గ్రుమ్మరించి మముధార్మిక వృత్తిని యేలు నందనా!


కాలమనంగ దైవతము కాలము గాయపు నౌషధంబగున్
కాల మనంతవాహిని సుఖంబును కష్టములారుపాళ్ళుగా
మేలగు షడ్రసోభరిత మేలిరసాయనమందజేయు నో
కాలస్వరూప నందన సఖా! దయచేయుము నీకు మ్రొక్కెదన్.

ఋతుషట్కంబులనేల వచ్చిన మహోత్కృష్ట ప్రభారాశి! నీ
యతులైశ్వర్య కృపాకటాక్షముల నత్యంత ప్రమోదమ్ముతో
క్షితిసంవాసుల మీద జూపి గొనుమా! కీర్తి ప్రశంశోన్నతుల్
గతగాయంబులు మాన్పగా తగినదీ కాలంబు శ్రీ నందనా!

మానవతా ప్రవాహముగ మానిసి నిత్యము తోటివారికిన్
మానిత రీతి సాయపడు మంజుల మానస భవ్యనందనో
ద్యాన వనాంతరమ్ముల సుధారస పూరిత దివ్యపుష్ప సం
ధానము గూర్చుమోయి నిరతమ్మును నందన! తోటమాలివై.

నందన చందనోత్కర సునందన కాల కుమార నందనా
వందనమయ్య నీకు సురవందిత క్షాత్రముమీర మేదినీ
స్యందనవాసివై కుటిల చర్య నియంతవు నౌచు ధర్మ సం
స్పందన బాదుగొల్పి పరిపాలన చేయుము నీదు బిడ్డలన్.

శ్రీమంతంబయి పండుగాక! పృధివిన్ స్నేహార్ద్రతా భావముల్
సామంతంబయి నిండుగాక! సుమనోసామ్రాజ్యముల్; పాలితుల్
సీమంతంబగుగాక! సృష్టి; సమతా శ్రీసస్యకేదారమై
హేమంతంబగుగాక! నందన శుభశ్రీ నామ కాలమ్మిలన్.

" సర్వేజనాః సుఖినో భవంతు .. సమస్త సన్మంగళాని సంతు "


కామెంట్‌లు లేవు: