Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

23, జులై 2011, శనివారం

మార్పు

[ శశిధర్ పింగళి ]
( ఈ కథే మొన్న జులై 3 ఆదివారం వార్త బుక్ లో వచ్చిందండోయ్.... )


"పాత పేపర్లు కొంటాం..", "పాత పేపర్లు కొంటాం.." దూరంగా వీధిలోంచి కేక వినిపిస్తోంది.
చేతిలో కాఫీ కప్పుతో అప్పుడే గదిలోనికి ప్రవేశిస్తూ

"ఏమండీ పిలవమంటారా" అంటూ కొంటెగా చూసింది కమల.

రోషంతో నాకళ్ళు పెద్దవి చేస్తూ "కంచూ" అంటూ అరిచాను పళ్ళు బిగపట్టి.

"నేనేం కంచు ను కాను. కనకాన్నే. లక్షణంగా కనక మహా లక్ష్మి అని పేరుపెట్టారు మావాళ్ళు. పూర్తిపేరు పిలిచే ఓపిక లేకపోతే కనకం అని పిలవండి. కాదనుకుంటే కమల అని పిలవండి. అంతేగాని ఇలా కంచు, గించు అంటే పలికేదిలేదు. మాట్లాడేది లేదు." అంది కోపాన్ని నటిస్తూ.

లేదులేవోయ్, నువ్వు మాట్లాడితే కంచుగంట మ్రోగినట్లు ఠంగ్ మంటుందనీ" అన్నాను.

అయినా పెళ్ళి చూపుల్లో నీ పేరడిగితే యమాస్టైల్ గా ’కమల’ అని చెప్పావ్. తీరా శుభలేఖల్లో చూస్తే ’కనక మహా లక్ష్మి’ అని వేయించారు. అది చూసి పెళ్ళికూతురు మారిపోయిందేమో నని తెగ కంగారుపడిపోయాం తెలుసా అన్నాను.

"అవును మరి, గొప్ప్పగా చదువుకున్నారు కదా ఆ మాత్రం అర్థం చేసుకులేరా అనుకున్నాం. ఇంతలా బెదిరిపోతారని మాకేం తెలుసు" అంది నవ్వుతూ.

"అబ్బబ్బ.. వెధవ కరెంటు పొద్దున్నే పోయిచచ్చింది. టెలిఫోన్ లైను కట్ అయి వారం అయింది. పిచ్చెక్కి పోతోంది" అంది విసుగ్గా.

"ఏమోనోయ్! నాకుమాత్రం చాలా ప్రశాంతంగా వుంది ఈవాళ. లేకపోతే నువ్వు ఇంతసేపు నాదగ్గర వుండేదానివా చెప్పు" అన్నాను.

"అఁ.. ఇప్పుడు మాత్రం ఇక్కడే కూర్చుంటా.. నాకు వేరే పనేంవుంది మరి" అంటూ లేచి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి
"అమ్మాయి దగ్గరనుంచి వారం నుండి ఫోనూలేదూ పాడూ లేదూ. ఎంతకంగారుగా వుందో నాకు. కంప్లయింట్ యిచ్చినా ఫలితం లేదు" అంటూ వెళ్ళిపోయింది.

కరెంటు, టెలిఫోను,ఇంటర్నెట్, కంప్యూటర్ - టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందింది. వీటిలో క్షణకాలం వేటికి అంతరాయం కల్గినా అసహనంగా ఫీలవుతాం. కాలం ఆగిపోయినంతగా బాధపడతాం.

ఇవి ఏవీ లేనిరోజుల్లో కూడా ఎంత తీయగా.. ఆత్మీయంగా మా భావాలు పంచుకునే వాళ్ళం ఉత్తరాల ద్వారా అనుకుంటూ తెరచి వున్న నా ఖజానా లోని ఉత్తరాల కట్టలకేసి చూసాను.

నా చదువు పూర్తయి నేను హైదరాబాదు వచ్చింది మొదలు మొన్న మొన్నటిదాకా వ్రాసుకున్న యెన్నో విషయాలు, పంచుకున్న యెన్నో ఙ్ఞాపకాలు. వాహ్! ఎన్ని విషయాలు వున్నాయి ఇందులో.

ఈ ఖజానా తెరిచిన ప్రతిసారీ నేను గతం తాలూకు ఙ్ఞాపకాల్లో కూరుకుపోవడం, మా ఆవిడ వచ్చి పైకి లాగటం మామూలే. 

"మీరిలాగే ఉత్తరాలు ముందేసుకుని నన్నూ, ఇంటినీ మర్చిపోతుంటారుగానీ, ఎప్పుడో వీటిని పాతపేపర్ల వాడికి ఇచ్చేస్తాను" అంటూ బెదిరిస్తూ వుంటుంది మా ఆవిడ.

నిజానికి ఈ వుత్తరాల పెట్టెకి ఖజానా అని పేరుపెట్టింది కూడా తనే. ఎంతచక్కని పేరు!

మెల్లగా ఒక్కక్క వుత్తరం తీసుకుని పైపైన చదువుతూ పోతున్నా. అలనాటి చిలిపి పనులు తలుచుకుంటూ స్నేహితులు వ్రాసినవి కొన్నైతే, ఆత్మీయతని పంచుకుంటూ అక్కానేనూ వ్రాసుకున్నవి కొన్ని. ఉత్తరం కోసం ఎదురుచూస్తూ కొన్నాళ్ళూ, ఆ వుత్తరం వచ్చాక చదివి తిరిగి జవాబు ఎలావ్రాయాలా అని ఆలోచిస్తూ కొన్నాళ్ళూ.. కాలం యెలా గడచి పోయేదో. ఇంటికి దూరంగా వున్నామనే భావనే వచ్చేదికాదు. కేవలం యోగక్షేమాలకోసమే కాకుండా ఎన్ని విషయాలు పంచుకునేవాళ్ళం. మంచి పుస్తకం చదివినా, మంచి సినిమా చూసినా వెంటనే ఉత్తరం వ్రాయాల్సిందే.. ఆనందాన్ని పంచుకోవాల్సిందే. ఎంత ఆనందాన్ని, ఆత్మీయతనీ మోసుకుని వచ్చేవో ఆ వుత్తరాలు. ఉత్తరం అంటే చాకలి పద్దు లాగో,స్కూల్లో అటెండెన్స్ వేసినట్లో వుండకూడదనేది మా యిద్దరి అభిప్రాయం. కొత్తగా వుద్యోగంలో చేరినప్పుడు ఎలా నడుచుకోవాలో చెప్తూ నాన్న వ్రాసిన వుత్తరం, తర్వాత సమస్యలు యెదురైనప్పుడు ధైర్యం చెబుతూ, తన అనుభవాన్ని జోడించి సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తూ వ్రాసిన వుత్తరాలు ఇప్పటికీ కొత్తగానే వుంటాయి చదువుతుంటే.

ఖాళీ దొరికినప్పుడల్లా, ఈ ఉత్తరాలు చూపిస్తూ మా అమ్మాయికి చెప్పేవాణ్ణి, అందులో వున్న అందమైన అనుభూతిని వివరిస్తూ, తననీ ప్రోత్సహించే వాడిని స్నేహితులకో, చుట్టాలకో ఉత్తరాలు వ్రాయమని.

"పో..డాడీ! ఇది టెక్నాలజీ యుగం. ఒక ఫోన్ కాల్, ఒక ఎస్. ఎమ్. ఎస్, ఒక ఈమెయిల్ తో క్షణంలో అయిపోయే పనికి గంటలతరబడి వ్రాయడం, రోజుల తరబడి ఎదురుచూడడం, అంతా మాతో కానిపని" అంటూ త్రోసిపుచ్చేది.

అల్లా ఒక్కొక్క ఉత్తరంలోని ఙ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ, పెట్టె అడుగునుండి ఒక వుత్తరాన్ని తీసాను.  అది పెళ్ళి అయిన కొత్తలో మా ఆవిడ వ్రాసింది.

"ఇదుగోనోయ్.. నీ వత్తులు లేని వుత్తరం యెంత భద్రంగా వుందో చూడు" అన్నాను అద్దం ముందు నిలబడి తలదువ్వు కుంటున్న మా ఆవిడకేసి చూస్తూ.

అద్దంలోంచే నన్ను చూస్తూ "వెవ్వెవ్వె" అంటూ వెక్కిరించింది.

"ఇంగ్లీష్ మీడియం వాళ్ళ తెలుగు అల్లాగే వుంటుంది."
అయినా పెళ్ళయిన కొత్తలో మీరెప్పుడు వస్తారా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని యెదురు చూస్తూ వ్రాసిన ఉత్తరం అది. అందుకే ఉత్తరంలో వత్తులు మిస్సయాయి."

"ఇక దుకాణం కట్టేసి లేవండి భోంచేద్దాం" అంటూ వెళ్ళిపోయింది.

                                           *** *** **

భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుంటూ వుండగా ఎవరో తలుపు తట్టిన శబ్దం.
వచ్చింది కొరియర్ అతను. సంతకం పెట్టి కవరు తీసుకున్నాను.

కవరు తెరిచి కాగితాలు బయటకు తీసాను. మా అమ్మాయి వ్రాసిన ఉత్తరం.

ఈ మధ్యనే కొత్తగా వుద్యోగంలో చేరింది బెంగుళూరులో. ఆఫీసు విషయాలు, కొలీగ్స్ విషయాలు వ్రాసింది. వారాంతంలో తను స్నేహితులతో కలసి చూసిన ప్రదేశాలు, పంచుకున్న ఆనందాల గురించి ఎంతో సంతోషంగా వ్రాసింది. చివరగా వ్రాసిన ఈ పేరా మాత్రం పైకి చదవకుండా వుండలేక పోతున్నా.. వినండి

"పైన వ్రాసిన విషయాలు, మీకు వివరిస్తూ వ్రాస్తున్నప్పుడు నేను వాటిని ప్రత్యక్షంగా చూసినప్పటికంటే ఎక్కువ ఆనందం పొందాను. అనుభూతులను పంచుకోవడంలో ఇంత ఆనందం వుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను డాడీ! మీరంటూ వుంటారుకదా ఉత్తరం లోని ప్రతి అక్షరం ఆత్మీయతని నింపుకుని పుడుతుందని. నిజమే కదా!"

"అందుకే ఇకనుండి రెండు నెలలకొక ఉత్తరమయినా వ్రాస్తానని ప్రామిస్ చేస్తున్నాను డాడీ!"

ఉత్తరాన్ని పూర్తి చేసి మా ఆవిడకిస్తూ తృప్తిగా చూసాను.
                                                                       * * *

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

beautiful

phani, etv-2

Jaabilliraave చెప్పారు...

Thank you, phani garu!