Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

29, జులై 2011, శుక్రవారం

గురుతుల్యులు సరసకవి "కవిశిరోమణి" ఆచార్య రావికంటి వసునందన్ గారి 60వ జన్మదిన మహోత్సవ శుభవేళ సరస సాహిత్య సమయస్ఫూర్తి తో సమర్పించు ప్రశంసా పద్య షట్కము.

[రచన:  పింగళి మోహిని ]

రసనిష్యందము  భావగర్భితమునై రమ్యార్థ కల్ప ప్రసా
ద సమారాధ్యము శేముషీకలిత చందస్సుందరోపేతమై
లసదోదాత్త చమత్కృతుల్ ప్రతిపదాలంకారికా జ్యోత్స్న పెం
పెసలారంగ రచించితే నవకవీ విద్వత్ప్రభా భారవీ!

ప్రాచీనాధునికాంధ్ర సత్కవుల ధారాసుద్ధి పాండిత్యమున్
ఔచిత్యాంచిత దృశ్యవర్ణనలు సద్యస్ఫూర్తివంతమ్ముగా
వాచోవీచి మహోర్మికాభరిత శార్వాణీ యశోవైభవం
బాచార్యోత్తమ మీదు సత్కృతులలో ఆవిష్కృతంబయ్యెడిన్.

కరుణరసప్రధానముగ కైక సుపుత్రుని* గాథ కావ్యమై
వరలగ తీర్చి దిద్దితిరి ప్రౌఢసమాస సుబంధురమ్ముగా
విరిసిన పూల తోటవలె పేశల మంజు మనోఙ్ఞశైలితో
సరసవచో విలాస మృదు చాలనమెల్లెడ పల్లవించెడిన్.

వసునందాఖ్యులు సవ్యసాచి యన గీర్వాణాంధ్ర కావ్యమ్ములన్
రసమాకందము బోలు మాధురులు సర్వాంగీణమై గ్రాలగా
అసమానోజ్వల తావకీన కవితా వ్యావృత్తి నల్దిక్కులన్
ప్రసరింపన్ వలె శారదార్చన కళా భాస్వంత సత్కీర్తియై.

శ్రీ వసునందన కృపచే
కావించుచు రచన దివ్య కావ్యాలను పుం
భావ సరస్వతి రూపున
జీవించుము పదిపదేండ్లు శ్రీవసునందా!

పోతనార్యుని భక్తిభావాతిశయము
ఙ్ఞానవైరాగ్య దీప్తులు క్రమ్ముకొనగ
సహజ పండిత కవివర్య! జన్మదిన మ
హోత్సవానందవేళ జయోస్తు మీకు.


*కైక సుపుత్రుని -  కైక కుమారుడు భరతుడు. 
రామాయణపాత్ర చిత్రణలని భరతుణ్ణి ప్రధానంగా చేసి "భారతం" పేర కావ్యంగా వ్రాసారు 
ఆచార్య వసునందన్ గారు. 

కామెంట్‌లు లేవు: