Pages
స్వాగతం
కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!
==========================================================================================================
6, ఆగస్టు 2016, శనివారం
ఉంగరమ్మునిచ్చి ఊరడించినదేమొ!?
15, జులై 2016, శుక్రవారం
మాయింట్లోనూ ఓ ఆషాఢం!!!?
(శశిధర్ పింగళి)
సత్యంబుగ వధువరులకు
నిత్యంబొక యుగముకాదె నీ యాషాఢము
లో, త్యాగం కాదది దాం
పత్యానికి పెద్దలిడిన పత్యంబదియే !
ఆషాఢం పేరుచెప్పగానే (కొత్త) అల్లుడి గుండె గుభేల్ మంటుంది తెలుగువారిళ్ళలో. కోరితెచ్చుకున్న పెళ్ళాన్ని కర్కశంగా తీసుకుపోయే మామని చూస్తుంటే మండుకొస్తుంది ఆల్లుడికి. ఒక నెలేకదా అని మామగారూ, ముప్పైరోజులా అని అల్లుడూ గిల్లుకుంటూ వుంటారు. ఆ ముప్పైరోజులే ముప్పై సంవత్సరాలుగా గడిపిన గతాన్ని తల్చుకుని నవ్వుకుంటాడు మామగారు. ఆ ముప్పై రోజుల్ని గంటల్లోకీ, నిమిషాల్లోకీ, సెకండ్లలోకీ విడగొట్టుకుని గుండె బేజారై తలపట్టుకు కూర్చుంటాడు అల్లుడు. తనకీ అంతబాధావున్నా కనపడనీయకుండా, తండ్రి సంతోషంలోనూ, భర్త బాధలోనూ వారికి తనపైవున్న ప్రేమను వెతుక్కునే ప్రయత్నంలో వుంటుంది కూతురు. అల్లుడికైతే ఆషాఢాన్ని కనిపెట్టిన వాడి కాళ్ళు విరిచేయాలన్నంత కోపం వస్తూవుంటుంది.
అతని చేత బలవంతంగా ’బై’ చెప్పించు కుని వెళ్ళిపోతుంది భార్య.
ఆ క్షణంనుంచి కాలం కుంటటం ప్రారంభిస్తుంది.
ఆరోజునుంచి పూటగడవటమే కష్టమౌతుంది. క్షణమొక యుగంగా గడుస్తుంది.
"శాస్త్రిగారూ ఆషాఢమాసం ఎన్ని సంవత్సరాలండీ" అంటూ ఆరా మొదలుపెడతాడు. "ఒక సంవత్సరమే బాబూ" అని ఆయన సమాధానం. గడవని కాలాన్ని గణించి గట్టెక్కాలని అతగాడి ఆరాటం. తొలి సంవత్సరమేలే ననేది ఆయన తాత్పర్యం.
***
అసలు ఆషాఢానికీ విరహానికీ అనాదిగా వస్తున్న అవినాభావ సంబంధం ప్రత్యెకంగా చెప్పనవసరంలేదు. ఎందుకంటే కాళిదాసు వ్రాసిన మేఘసందేశం ఆషాఢమాస వర్ణనతోనే ప్రారంభమౌతుంది. ఒకానొక యక్షుడు శాపగ్రస్తుడై భార్యకు దూరంగా వుండవలసిరావటం, తా ననుభవించే విరహ బాధను ఓ మేఘుడిద్వారా భార్యకు కబురుపంపటం చాలా మనోహరంగా వుంటుంది. ఏ వ్యక్తికైనా సంయోగం ఎంత సంతోషాన్నిస్తుందో వియోగం అంతే బాధాకరమన్న విషయం సార్వజనీనమే.
ఆసలు దేని విలువైనా అదిలేనప్పుడే తెలుస్తుందన్నది కూడా అంతే నగ్న సత్యం. మనిషిలోని నిరంతర చింతనాశీలత్వంవల్ల బాధ మరింత ప్రబలమౌతుంది. మిగతా సృష్టినుండి మానవుణ్ణి వేరుఛేసేది ఈ ఆలోచనే కదా. ఆలోచించటం, ఆరాటపడటం, అనుభవించడం, అనుభూతుల్ని నెమరువేసుకోవటం వంటి చిత్తజనితమైన వుద్వేగాల్ని అందంగా వ్యక్తీకరించడం మనిషి యొక్క ప్రత్యేకత.
తెలుగు వారికి ఆషాఢం ఒక పండుగ. తెలుగు పండుగలు మొదలయ్యేది ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశితోనే. అదే తొలి ఏకాదశి. కూతురుకి పెండ్లిచేసి అత్తవారింటికి పంపిన తల్లిదండ్రులకు ఈ నెల నిజంగా పండుగే. అయితే నూత్న వధూవరులకు మాత్రం పైన చెప్పిన యక్షుడి శాపకాలంలాంటి ఒక గడ్డుకాలమే. సాధారణంగా మనకి మాఘమాసం పెళ్ళిళ్ళకు అనుకూలమైన కాలం.ఈ కాలంలో పెళ్ళై కొత్తజీవితాన్ని ప్రారంభించిన నూత్న దంపతులకు కష్టకాలమే మరి. కొందరికి వైశాఖంలోనో, జ్యేష్టంలోనో పెళ్ళవుతుంది. వాళ్ళ పారాణి తడి తపన ఆరకముందే ఆషాఢం వచ్చిపడుతుంది . ఎంతకష్టంమో ఆలోచించండి. ఆసలీ ఆచారంవెనుక యేదోసాంకేతికమైన, భౌగోళికమైన వివరణలిస్తారుకానీ నామట్టుకు నాకు ఒకరి విలువ ఒకరికి తెలియడంకోసమే యేర్పాటుచేసారనిపిస్తుంది. ఎందుకంటే ఈకొద్దికాలంలోనే ఒకరినొకరు అర్ధంచేసుకొని, మానసికంగా దగ్గరై ఒకరకమైన బంధాన్ని, అనుబంధాన్ని యేర్పరుచుకొని వుంటారు. కొన్ని విషయాలలొ ఒకరిపై ఒకరు ఆధారపడిపోవడమూ కద్దు. ఈ యెడబాటు ఆ వెలితిని ప్రస్పుటం చేసుంది. తద్వారా ఇద్దరూకూడా విచక్షణాశీలురై మెలగుతూ బంధాన్ని మరింత గట్టిగా పెనవేసుకోవతానికి దోహదంచేసుంది. అందుకేనేమో ఆరుద్రగారొక పాటలో "ఎంత యెంత యెడమైతే అంతతీపి కలయిక" అన్నది.
ఇక ఈ యెడబాటు, విరహము చూసేవాడికి వినోదమూ, అనుభవించేవాడికి విషాదమూను. సమక్షంలో వున్నప్పుడు ఆలోచనలకు తావులేదు. వియోగంలో వున్నప్పుడే ఆలోచనలు ఆరాట పెడుతూ దహించి వేస్తుంటాయి. దీనికి తోడు కాలమూ కక్షకట్టినట్లు కదలకుండా మొండికేస్తుంది.
మన పెద్దలు అత్తా-కోడలు, అత్తా-అల్లుడు ఒక గడప దాటకూడదు అంటూ కొంచెం నర్మగర్భంగా చెప్పారుకానీ ఇందులో అత్తగారికేపాపమూ తెలీదు. నిజానికి ఒక గడప దాటకూడనిది భార్యభర్తలే. అంటే ఒక గదిలోకివెళ్ళకూడదనిఅర్థం. దీన్ని అర్థం చేసుకోకుండా అత్తగార్ని యాత్రలకు పంపించో, మాకత్తగారే లేదనో, మేమిద్దరం వేరేవుంటున్నంగా మాకు వర్తించదనో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
యెడబాటుని ఒక్క నెల రోజులు ఓపికబట్టలేనివాళ్ళు, రేపు పురిటికో పబ్బానికో పెళ్ళాం పుట్టింట్లోనూ, మొగుడు అత్తింట్లోనూ ఏ మూదునెలలో, ఆరునెలలో వుండవలసి వస్తే యెలా? "పయనమైతినన్న పతిమాట విన్నంత పడతి యుంగరంబు కడియమాయె" అంటూ ఓ కవి చమత్కరించాడట. బెంగపెట్టుకోవడాలూ బక్కచిక్కిపోవటాలూ ఒకప్పటి మాట. ఇప్పుడీ అధునికయుగంలో, అందివచ్చిన సాంకేతిక ఙ్ఞానంతో కాలాన్ని, దూరాన్ని కూడా జయించేస్తున్నాం. మేఘసండేశం ఒకప్పడు భావుకత, కవి కల్పితం. నేడది నిజం ప్రత్యక్షానుభవం. మనం పంపే సంక్షిప్త సందేశాలను చేరవేసేది మేఘుడే. (అంతర్జాలం పేరుతో క్లౌడ్ టెక్నాలజీ అదేగా)
"అన్నీ మన వేదాలలోనే వున్నాయిష" అంటూనో "పెద్ద వాళ్ళేంచెప్పినా అంతా మన మంచికే" అనుకుంటూనో గడిపేయటం ఉత్తమం. ఈ నెలరోజులు తరువాతి సుదీర్ఘ వైవాహిక జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా వుంటుంది. ఈ నెల్లాళ్ళూ భర్తలకొచ్చే అలకలూ, వేసే వేషాలూ గుర్తుంచుకొని, తర్వాత్తరువాత సమయాకూలంగా వీటిని ఉటంకిస్తూ భార్యలు పండించే హాస్యానికీ కొదువుండదు.
అంచేత ఈ నెల్లాళ్ళూ తామేదో త్యాగంచేసేసామన్న భ్రమవీడి, ఇది మీ దాంపత్యానికి ఒక పత్యంగా భావించండి. ఆపై ఆనందం ఆరోగ్యం అంతా మీదే.
నిత్యంబొక యుగముకాదె నీ యాషాఢము
లో, త్యాగం కాదది దాం
పత్యానికి పెద్దలిడిన పత్యంబదియే !
23, ఏప్రిల్ 2016, శనివారం
కలల నెలబాలు నుదరాన తలచుకొనుచు
24, సెప్టెంబర్ 2015, గురువారం
ఏరీతి మాబోంట్లు జేరగలరు ?
[ శశిధర్ పింగళి ]
ఎగిరేటి పక్షిపై సాగేటి నీ దరికి
ఏరీతి మాబోంట్లు జేరగలరు ?
ఎగిరేటి పక్షిపై సాగేటి నీ దరికి
ఏరీతి మాబోంట్లు జేరగలరు ?
బుసకొట్టు పామెక్కి బోజ్జుండు నీ దరికి
ఏరీతి
మాబోంట్లు జేరగలరు ?
అలల సంద్రపుటింట అలరారు మీయింటి
కేరీతి
మాబోంట్లు జేరగలరు ?
అవతార ములపేర ఎవరింట నుందువో
ఏరీతి
మాబోంట్ల కెరుక గలుగు ?
కనుక, కరుణించి మాబోంట్ల కష్ట మెరిగి
ఆర్తి జేసిన ప్రార్థనలాలకించి
కరిని గాచిన కరముతో గాచి మమ్ము
చీరి నీచరణ పద్మాల జేర్చుకొమ్ము!
Labels:
కొంటె ప్రశ్నలు,
పద్య కవితలు,
శశిధర్ పింగళి
13, సెప్టెంబర్ 2015, ఆదివారం
ముక్కంటి యేరీతి ముద్దులాడు ?
[ శశిధర్ పింగళి ]
తనమేన సగమైన
తరుణి పార్వతితోడ
ముక్కంటి యేరీతి
ముద్దులాడు ?
తలపైన కొలువున్న
నెలత గంగమతోడ
శూలపా ణేరీతి జూఁపుగలుపు ?
గజవక్తృ కేరీతి గౌరమ్మ ప్రేమతో
కోరి తినిపించునో గోరుముద్ద ?ఆరు మొగముల వాని నాదరమ్మున బిల్చి
లాలించి యేరీతి
పాలు కుడుపు ?
వెండికొండన
మీయింట వింతశోభ
చూడ
మనసయ్యె నొకసారి జూఁపవయ్య
నీదు
ప్రమధుల మూకలో నాదరించి
కరుణ జూఁడుము మ్రొక్కెదన్ కరము లెత్తి!30, జూన్ 2015, మంగళవారం
నేనూ బ్రహ్మనే !
[ శశిధర్ పింగళి ]
అనంతానంత విశ్వంలో
అణుమాత్రంగావున్న నేను కూడా
బ్రహ్మనే!?
ఎందుకంటే
పుట్టినదగ్గర నుంచీ
పరివారం కోసమైతేనేమి
ప్రపంచం కోసమైతేనేమి
ప్రతిక్షణం - నన్ను నేను
క్రొత్తగా సృష్టించుకుంటూనే వున్నా...మరి !?
= = =
21, జూన్ 2015, ఆదివారం
మన్నిస్తావుకదూ.. నాన్నా!
[ శశిధర్ పింగళి ]
నీ మోకాళ్ళపై - నే
బొర్లా పడుకుని
బోసినవ్వులు
నవ్వుతూ ఊయలలూగే - ఆ
అపురూప క్షణాలు -
పడుతూ లేస్తూ అడుగులేస్తూ
నిన్ను చేరుకున్న వేళ - నీ
కళ్ళల్లొ మెరిసే ఆ అనంద క్షణాలు -
నా బంగరు
భవితవ్యానికి
నీ కళ్ళతొ కలలు కంటూ
ఎదురు చూసే ఆ నిరీక్షణాలూ
అవిశ్రాంతంగా శ్రమిస్తూ కూడా
అర్ధ రాత్రిదాకా తోడుండే
నీ
అనురాగ వీక్షణాలు
నా కోసం త్యాగం చేసిన వెన్ని క్షణాలో
నాకోసం వీపున మోసిన వెన్ని వ్రణాలో
ఏ త్యాగమయమూర్తుల ప్రక్కనో నీకు
పీఠమేసి నిలబెడుతున్నాయి -
వేలుపట్టి నిలబెట్టిన రొజులే కాదు
వేలుకట్టి చదివించిన రొజులూ గుర్తే !
యెందుకు నాన్నా యివన్నీ అంటే
అమాయకంగా నవ్వే ఆ నవ్వూ -
అంతర్లీనంగా ప్రవహించే ప్రేమేమో
కళ్ళల్లొకి చిమ్మి చిన్నగా మెరుస్తుంది గానీ
మౌనం గీత దాటని మాట
కోరని వరాలిన్ని యిచ్చినా
యింకా- ఓ
కోరిక వుంది నాన్నా! తీరుస్తావా?
త్యాగాన్ని నీ వద్దే వుంచుకుని
ప్రేమానురాగాల్ని పంచి యిచ్చేసావ్
ఇప్పుడా త్యాగం కూడా నా కిచ్చేయవూ
రేపు - నాకు పనికొస్తుందన్న స్వార్థం కాదు
నాన్నా.. ఇక పై నీకా అవసరం లేదందుకే
అడుగుతున్నా
- ఇస్తావుకదూ .. మన్నిస్తావుకదూ!
***
పిత్రుదినోత్సవ శుభాకాంక్షలు...
29, మే 2015, శుక్రవారం
"పరమాత్మ నిలయం"
పరమాత్మ నిలయం
సిలికాన్ ఆంధ్ర - సుజన రంజని మే 2015 సంచికలో ప్రచురింపబడ్డ కథ. ఈ క్రింది లింకులో...
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2015/katha2.html
సిలికాన్ ఆంధ్ర - సుజన రంజని మే 2015 సంచికలో ప్రచురింపబడ్డ కథ. ఈ క్రింది లింకులో...
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2015/katha2.html
[శశిధర్ పింగళి]
సమయం ఉదయం 10.30 గంటలు మునిసిపల్ ఆఫీస్ అప్పుడప్పుడే చిక్కబడుతోంది
హడవుడిగా వచ్చే సిబ్బంది తోనూ, ముందుగానే వచ్చికూర్చున్న సందర్శకులతోనూ.
పదిన్నర కావొస్తున్నా సీటుకు చేరుకోని సిబ్బందిని చూసి, మనసులోనే
"వీరెప్పుడు మారుతారురా భగవంతుడా" అనుకుంటూ
ఒకరిద్దరు సందర్శకులు మౌనంగానే తమ అసహనాన్ని ముఖంలో వ్యక్తపరుస్తున్నారు.
మునిసిపల్ ఆఫీస్ మొదటి అంతస్తులో కిటికి ప్రక్క సీటులో కూర్చున్న ఓ యువకుడు
మాత్రం ముళ్ళమీద కూర్చున్నట్లు అసహనంగా అటూ ఇటూ కదులుతూ మాటిమాటికీ కిటికీ లోంచి తొంగిచూస్తున్నాడు. ఇంతలో అటుగా
వచ్చిన ఆఫీస్ ప్యూన్ ని చూసి
"ఇదిగో వీర్రాజూ ఇటురా" అంటూ పిలిచాడు. వీర్రాజు వస్తూనే "సార్, ఇంకా ఏ విషయం తెలీలేదండి, ఈ రోజుకూడా దుకాణం తీయలేదు, మీరో అరగంట పర్మిషన్ ఇస్తే
ప్రక్క వీధిలో వాళ్ళ అబ్బాయి షాప్ కి వెళ్ళి వాకబు చేసి వస్తా" అన్నాడు వినయాన్ని నటిస్తూ.
9, మే 2015, శనివారం
అమ్మ-అమృత వాహిని
[శశిధర్ పింగళి]
యుగాల ముందునుంచీ కూడా
ఒక జీవనదీ ప్రవాహం
నిర్విరామంగా ప్రవహిస్తూనే వుంది
అలల క్రింది నుంచీ అంతర్వాహిని లా
మాయని ప్రేమేదో రహిస్తూనే వుంది
దిగంతాల సాక్షిగా
యుగాల ముందునుంచీ కూడా
ఒక జీవనదీ ప్రవాహం
నిర్విరామంగా ప్రవహిస్తూనే వుంది
అలల క్రింది నుంచీ అంతర్వాహిని లా
మాయని ప్రేమేదో రహిస్తూనే వుంది
దిగంతాల సాక్షిగా
18, ఏప్రిల్ 2015, శనివారం
లవ్వించుక కొసరువెట్టి….
[శశిధర్ పింగళి]
పచ్చని కాపురమంటే
నచ్చిన చీరొకటి తెచ్చు నడవడి కాదోయ్
మెచ్చిన చీరకు మల్లే
వెచ్చగ తాచుట్టుకొనెడు విభుడే ఘనుడౌ...1
తెచ్చిన చీరలొ సతితా
మచ్చిక గాదరి కిజేరి మాధుర్యముతో
వెచ్చని కౌగిలి లో సొగ
సిచ్చిన మరి పుచ్చుకొనుటె సెహబాసు సుమీ!
...2
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

