Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

6, మే 2012, ఆదివారం

ఆశామోహం( దీర్ఘ వచన కవిత )

(శశిధర్ పింగళి)

అప్పట్లో 80 ప్రాంతంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ప్రతి పండుగలకు, జాతీయ దినాలకూ రేడియోలలో సాహిత్య కార్యక్రమాలు యేర్పాటుచేయడం పరిపాటిగా వుండేది.
ఆక్రమంలోనే ఒకసారి ఆగష్టు 15 స్వాతంత్ర్యదినాన్ని పురస్కరించుకొని ఒక సాహితీకార్యక్రమాన్ని బందరులో యేర్పటుచేసి దానిని రికార్డుచేసి ఆకాశవాణిలో ప్రసారం చేసారు. ఆ నాటి ఆ ప్రత్యక్ష కార్యక్రమంలో ప్రేక్షకుడిగా పాల్గొని యెందరో మహానుభావులను దర్శించుకొనే భాగ్యం అబ్బింది. వారిలో శ్రీ సి.నా.రె, ఆరుద్ర, ఇంద్రకంటి శ్రీకాంతశర్మ, ధారా రామనాధ శాస్త్రి, మొదలైన వారు పాల్గొన్నారు. సినిమా కవులుగా సి.నా.రె, ఆరుద్రల పట్ల ప్రత్యేక అభిమానం వుండేది. వీరంతా ఒక్కక్కరూ తమ తమ కవితలను చదువుతున్న క్రమంలో ఆరుద్ర గారు వచ్చి .. " వెళ్ళు... మళ్ళీరాకు.. " అంటూ మొదలుపెట్టి ఒక వచన కవితను చదివారు. అప్పటికి విద్యార్దిగానే వున్న నాకు, ఆరుద్ర నుంచి ఇంకా ఇంతకంటే గొప్పదేదో ఆశించిన నాకు కించిదాశాభంగమే అయింది. ఈపాటి కవితకోసమా ఆరుద్ర వచ్చిందనో లేక ఆరుద్ర లాంటి కవా ఈ కవిత వ్రాసారనో ఒక అసంతృప్తి యేర్పడింది. చాలా రోజులు వెంటాడింది. ఇదే కవిత్వమైతే ఆపాటి నేనూ వ్రాయగలనేమో ననిపించింది. వ్రాస్తే యేం వ్రాయాలి? అందుకే ఒక నేపధ్యాన్ని సృష్టించుకొని ప్రయత్నించానిలా. వ్రాసి మిత్రులకు చూపిస్తే బావుందనే ప్రశంసలు. కానీ నాకే తెలియని యేదో అసంతృప్తి. తర్వాతి చాలారోజులకి ఇదే నేపధ్యాన్ని మరోరూపంలో చూచుకుంటేకాని వూరట కలగలేదు.
అప్పటి ఈ నా మొదటి వచన కవితను మీకోసం వుంచుతున్నాను.. అభిప్రాయాలకోసం..


ఆఁ..ఎందుకీబ్రతుకు
ఏముందీ .. ఇందులో
సుఖమా..సౌఖ్యమా !
అయినా ఏదిశాశ్వతం కనుక .. ఊఁ..
అని మూల్గింది నా మనసు
ఈ భావం .. నే వినే మెట్టవేదాంతమే
వంటబట్టి వచ్చిందో .. లేక
నా వంటరితనమే మొదలెట్టిందోకానీ..
మొత్తానికి నా మనసంతా బాధనిపించి
గట్టిగా నిట్టూర్పు విడిచాను.
ఇంతలో గట్టిగా నావీపుపై తట్టి
కిలకిలా నవ్వేరెవరో..
ఎవరా అని వెనుదిరిగి చూస్తే ?
ఎదురుగా ఓ అపరిచిత స్త్రీ..!?
ఏమిటీ నిట్టూర్స్తున్నావ్ ..అంది నవ్వుతూ..
ఏమీ లేదంటూనే ..పై
మాటలన్నీ చెప్పేసాను..
ఈ సారి కిలకిలా నవ్వలేదు..గంభీరంగా..
చాలా గంభీరంగా .. తనలో తానే నవ్వుకున్నట్లు
ఓ చిరునవ్వు నవ్వుతూ నాభుజంతట్టి..
వెర్రివాడా! ఏదో వూహించుకుని
ఏదేదో అనుకుంటున్నావ్..
ఇంతకీ నేనున్నాననే మర్చిపోయావ్..
అసలు నేను లేకపోతే ఈ ప్రజలంతా
ఏమయ్యేవారు?
రేపుందని తెలుసుకునేవారా?
ఆ రేపు ఏదోచేయాలని అనుకునేవారా?
ఏదో కావాలనీ..ప్రతిదీ నాదే ననీ అనుకునేవారా?
అసలు నేలేకుంటే
అంతా నీలాగే వంటరిగా కూర్చుని
వేడిగాలులొదిలేవారేమో!?
అయినా నేనొచ్చేసానుగా
ఇంకా భయమెందుకూ..
లే! లేచి నా చేయందుకో..
నా స్నేహం పంచుకో, రా, అంటూ
అరచేత్తో నానుదురు తాకింది..
అబ్బ!
ఎంతబావుందీ స్పర్శ..
ఆ.. స్పర్శలో .. నే నెరుగని ఆత్మీయత..
తీయదనం..చల్లదనం..ఆ..కాదు..కాదు
వెచ్చదనం.. అదీ ఎలాంటిదంటిది..
ప్రేయసి ఓడిలో తలపెట్టి
రెండుచేతుల్తో ఆమెను చుట్టి..
ఆమెకళ్ళల్లోకే చూస్తుంటే కలుగుతుందే
ఆ..నులి వెచ్చదనం.. ఆఁ..!
ఏమిటీ విచిత్రం?
యింతవరకూ నిర్లిప్తంగా వున్న నాకేనా
ఈ భావన? చిత్రంగా లేదూ?
ఆ.. అర్ధమయింది.. బహుశః..ఇది
ఆమె చేతి ప్రభావమేమో ననుకుంటూ
నాలో నేనే నవ్వుకున్నాను..
అవునూ.. నాపై యింత ఆత్మీయతనుజూపే
ఈమె యెవరబ్బా! మునుపెన్నడూ
చూసినట్లులేదే.. పోనీ
ఆమెనే అడిగితే పోలా?
అమ్మో..ఏమైనా అనుకుంటుందేమో?
అనుకునేదేమిటి నాముఖం..
అయినా.. అసలెవరో తెలీకుండా చెలిమిచేయడమెలా?
అనుకుంటూనే..అడిగేశాను..
నీవెవరు..నీపేరేమని..
వళ్ళీ వరదగోదావరిలా గల గలా నవ్వింది.
నేనోయీ .. నన్నే పోల్చుకోలేదూ?
యిన్నాళ్ళూ నీలోనే వున్నా..
నన్ను తెలుసుకోలేదని .. నీయెదుటకొచ్చానోయ్
తెలిసిందా? అంది..
ఊ..ఊ..హూ.. అన్నాను మెల్లగా
అయితే నాపేరుచెప్పనా ..అంది మెల్లగా
తలొంచుకుని..క్రీగంటచూస్తూ..
మునిపంటితో చిటికెనవ్రేలి గోరు కొరుకుతూ
ఊ.. అన్నాను.
నేను.. నేను .. ముందే చెప్పానుగా
రేపు నేనేనని.. చెపుతున్నా విను..
నేను నీ - ఆశ - ను అంటూ
సిగ్గుతో నాగుండెలో దూరిపోయింది.
ఇప్పుడు నాకేం భయంలేదు!
నాకుతోడు నా ఆశ వుందిగా మరి..
అందుకే....
-------------





5 కామెంట్‌లు:

kastephale చెప్పారు...

good

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శ్రీ పింగళి గారికి , చక్కని కవితలు వ్రాయుచున్నారు. అభినందనలు.మీరు 'శంకరాభరణం' బ్లాగునకు వస్తే మీ రచనలను రోజూ ఆస్వాదించే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం.

అందమ్ముగ ' పింగళి ' మీ
రందించిన పద్య వచన రస మాధురులే
పొందితి హృదయము నిండుగ
స్పందననే తెలుపు చుంటి "బహు బాగుండెన్"

Jaabilliraave చెప్పారు...

కష్టేఫలి గారికి ధన్యవాదాలు.
హనుమచ్ఛాస్త్రి గారూ! మీవంటివారికి పద్యస్ఫూర్తినిచ్చి మాబ్లాగ్ ధన్యమైంది మీ వీక్షణలతో పావనమైంది. ధన్యవాదాలు

తాడంకి రామకృష్ణ (TRK) చెప్పారు...


కవిత్వం పట్ల నాకు సరి ఐన అవగాహనా లేదు. ఏదో సంస్కృతం పట్ల ప్రేమతో MA-Sanskrit కూడా చదివాను. ప్రస్తుతము సాఫ్ట్వేర్ ఇంజనీర్, అయినా ఈ మధ్య కవిత్వం పట్ల మీలాగే ప్రేమ కల్గుతోంది నాకు...వచన కవిత్వము సులభంగా భావ వ్యక్తీకరణకు ఊతం ఇచ్చినా పద విన్యాసం ఉంటే నే అందము. మీ కవితలో భావము మెండుగా వుంది పద కూర్పు ఇంకా బాగుంటే బాగుండేదేమో !!! పద విన్యాసాన్ని మూలం రామాయణమే........కాదంటారా??

Jaabilliraave చెప్పారు...

శ్రీయుతులు తాడంకి రామకృష్ణగారికి స్వాగతం, ధన్యవాదాలు. మీరన్నది అక్షరాలా నిజం. ఆమాటే ముందుమాటలోనూ ఉటంకించాను. అది వ్రాసినది సుమారుగా నా ఇంటర్, డిగ్రీ మధ్యలో ననుకుంటా. అప్పటికీ దానితో నేనే తృప్తిచెందక మరో రూపంలొ వ్రాసుకున్నా. అయితే అదీ పూర్తి చందో బద్దంగా కాకుండా వుంది. అయినా ఒక రిధమ్ వుందని నాభావన. మీరు అన్నారుకాబట్టి ఆ రూపాన్ని కూడా పోష్టుచేస్తాను చదివి అభిప్రాయాన్ని చెప్పండి. సంస్కృతం మీద నాకేమాత్రమూ పట్టుకాదుకదా కనీసం ప్రవేశంకూడాలేదు. చందస్సు కూడా అంతంత మాత్రమే.