Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

12, జనవరి 2012, గురువారం

సంక్రాంతి శుభోదయమ్ము మనగా వలె జాతికి భవ్య క్రాంతియై

            [ పింగళి మోహిని ]

1. బంతులు బంతులై కనుల పండువు చేయగ గోమయంబుచే
    కాంతలు గొబ్బిళుల్ మిగుల కౌతుకమొప్పగ తీర్పరింపగా
    వింతగు బొమ్మలన్ కొలువు వేడుక మీరగ తీర్చిదిద్దు; సం
     క్రాంతి శుభోదయమ్ము మనగా వలె జాతికి భవ్య క్రాంతియై !

2.  ఇంతలు యింతలై పుడమి యీవలె సస్యము మానవాళికిన్
     చింతరవంతలేని సుఖ జీవన భాగ్యము కల్గజేయగా
     శాంతి సమానతా సుగుణ సంపద తుష్టిని పుష్టినిచ్చు; సం
      క్రాంతి శుభోదయమ్ము మనగా వలె జాతికి భవ్యక్రాంతియై !!


3.  లే తలిరాకు జొంపముల లీలగ తోచుచు పూచినట్టివౌ
    పూతలు పిందెలై పెరిగి వేల ఫలంబులొసంగు నట్లు గా
     జాతి హృదంతరాశలను శాశ్వత రీతి ఫలింప చేయ; నీ
      నూతన వత్సరమ్మున కనూన ముదావహ స్వాగతమ్మిదే !!!
                      అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు