Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

శిధిల హంపి (కొంగర జగ్గయ్య)

( శశిధర్ పింగళి )
ఇలలేని రతనాలు తొలికారు ముత్యాలు
              కొలబోసి నీవీధి విలిచిరంట
కవిపాదములనొత్తి గండపెండేరమీ
              మొగసాల రారాజు ముడిచెనంట
పగఱగుండెల చిచ్చు రగిలింప నప్పాజి
              రణతంత్రమీయింట వ్రాసెనంట
రాణి చిన్నమ్మ యీకోనేటనే మున్గి
              నవరాత్రిపూజనల్ నడపెనంట
మేఱకనరాని యీపొలిమేఱనెల్ల
ఝణఝణధ్వాన సోపాన చరిత లలిత
లాస్య లావణ్య విలసత్కళావధూటి
శిశిరచాంద్రీ ప్రమోదమ్ము చిలికెనంట!

ఈనిలువెత్తురాళ్ళు మునుపే మహనీయ పరాక్రమ ప్రభా
మానిత వీరనాయకులొ! మాయని వెచ్చని దేశభక్తి, ని
ద్రాణ మహాంధ్ర మానస పథమ్ముల జాగృతిగొల్పి; తల్లి మా
గాణపు మేలుకోరి పడిగాపులుగా నిలబడ్డవారటే !

ఈగాలి విసురులో యేకోడె మొనగాని
              తెగిన గుండియకోర్కె బుగులుకొనియె,
ఈ యెఱ్ఱమట్టిలో యే పూరిగుడిసెల
              కడుపు చుమ్మలగోడు కఱగిపోయె,
ఈ బండరాళ్ళలో యే శిల్పకారుల
              నూరేళ్ళ స్వేదమ్ము పేరుకొనియె,
ఈ ముళ్ళపొదలలో యే లేతజవరాండ్ర
              పసుపుకుంకుమ బైసి బ్రద్దలయ్యె,
ఈ భయంకర నైశ్యబ్ద్య హిండనమున
ఏ చరిత్ర స్వరాలాప మిఱుకు వడియె
ఈ యనంత పౌరాతన్య హృదయ రజని
ఏ భవిష్యత్ ప్రభాతమ్ము లిగిరిపోయె !

కనులకెదురుగ నాటిభాగ్యమ్ములెల్ల
నిలచి గర్వమ్ముగా నన్ను పలుకరించు
కాలియడుగున జాలిగా కదలునేల
వెలికితీయని వైనాలు విన్నవించు!

రారాజు గెలిచిన రణగాధ మఱుగున
               ప్రాణాలువిడచిన బంటులెవరు ?
వజ్రాల సంతలో వైభోగములు నింప
               గడ్డదున్నిన రైతు బిడ్డ లెవరు ?
జగతి మెచ్చిన శిల్ప సౌకుమార్యము నిల్ప
               రాళ్ళు కొట్టిన కూలిరాయులెవరు ?
రాణివాసపు చీని చీనాంబరాలలో
               సరిగ నేసిన పద్మసాలు లెవరు ?
భాగ్యవంతులు సుఖముగా బ్రదుకు కొఱకు
ముఱికినూడ్చిన నెఱమూక మూక యెవరు ?
ఉన్నవారికి మాత్రమే యున్నదోయి
లేనివారికి చరితలో లేదుచోటు!

           // అయిపోయింది //

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

bagundi

Amar చెప్పారు...

chala baagundi

sasidhar pingali చెప్పారు...

Thankyou Amar garu