స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సత్యం - శివం - సుందరం - 8

         (పింగళి మోహిని)

గీ.   సృష్టి, ప్రతి సృష్టి నీయందె జూడ దగును
      శాంతి; యుపశాంతి నీతోనె సాధ్యపడును
      ధ్యాన జ్ఞానాలు నీయందు లీనమగును
      ద్వైత ప్రకృతి కావలనున్న దైవమీవు ! ... 11

సీ.  భాస్వంత కిరణాల భాస్కరుండైనను
                    శశివోలె వెన్నెల చలువనిచ్చు
      సుందర సుకుమార సుమలీల హృదయంబు
                    సంకల్పములు వజ్ర సన్నిభంబు
      కమలాల స్పూర్తిని కలిగించు హస్తాలు
                    చేతలద్భుతములు చేసిజూపు
      విశ్వమానవులకు విందులు చేయుచు
                     పట్టెడన్నమె తాను పట్టితినును
      సర్వమానవులకు సంధించు శుభములు
                     భరియించు భక్తుల బాధలన్ని
      భక్తులు సాయిలో బరమాత్మ దర్శింప
                      ఆత్మను జూచుతా నఖిల జనుల
      అవతార వామనుండాకృతి గాంచగా,
                      భువనమంతయువాని పుణ్యభూమి
ఆ.వె. సర్వమతములందు సమతను దర్శించు
         విశ్వమందు దివ్యప్రేమ నింపు
         పుడమి జనులనెల్ల నొడిజేర్చి కాపాడు
         సత్యసాయి! విశ్వజనని కాదె ! ... 12

12, సెప్టెంబర్ 2011, సోమవారం

కొంటె ప్రశ్న

పురాణాల్లో జనకుడు - జానకి, ద్రుపదుడు - ద్రౌపది ఇలా తండ్రుల పేరుమీదుగా వారి వారి కూతుళ్ళను పిలిచినప్పుడు. గౌతముని భార్య గౌతమి ఎలా అయ్యింది ?


అని ఈమధ్య మా అమ్మాయి అడిగితే ముక్కుమీద వేలేసుకోవడం తప్పలేదు. నాకూ అదే సందేహం మరి మీకు తెలుసా! చెప్పండి.

సత్యం - శివం - సుందరం - 7

           (పింగళి మోహిని)

  గీ.    శాస్త్రవేత్తలు వివిధ దేశాధిపతులు
         కవులు, జ్ఞానులు సత్కళాకార వరులు
         విశ్వమయుడవు నీవంచు విశ్వసించి
         నిన్నె సేవించి తరియింత్రు | నిత్యవిధిని ! ...9
 
  మ.  కదిలే దేవుని సత్యసాయి ప్రభువున్, కారుణ్య రత్నాకరున్
         పద పద్మంబులు గొల్చి, తన్మహిమ సంభావించి, భద్రాత్ములై,
         ముదమందన్, ప్రజలెల్ల చేరిరిట సమ్మోహాత్ములై నీయెడన్
         నదులన్నీ ప్రవహించి, సాగి తుద రత్నాగారమున్ జేరవే ! ... 10

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సత్యం - శివం - సుందరం 6

                        (పింగళి మోహిని)

        ఉ.  ప్రేరణ ధర్మరక్షణము ప్రేమసుధామయ సత్యసాయిగా
              క్షీరపయోధి పావనుడు శ్రీహరి దివ్యకృపావతారుడై
              కూరిమి తెలుగు దేశమున కోరికదీరగ పుట్టపర్తిలో
              కారణ జన్ముడై వెలయ కాంతి రహించెను భారతాంబకున్! ...7

        శా. ఖండాంతర్గత భక్తసేవ్యునిగ ప్రఖ్యాతుండు నై; భారతీ
             భాండాగారమునుండి వెల్వడిన దివ్యగ్రంథ దీప్తిప్రభల్
             నిండారన్ వెలిగించె మానవుల సుస్నేహార్ద్రులై మెల్లగా;
             ఖండింపన్‍వలె మాదు సంకటములన్ కారుణ్య రత్నాకరా ! ...8

7, సెప్టెంబర్ 2011, బుధవారం

సత్యం - శివం - సుందరం - 5

         [ పింగళి మోహిని ]

శా.    దీక్షాదక్షత, త్యాగశీలతల దేదీప్యప్రభామూర్తి; భ
        క్త క్షేమావన సత్యబోధనల సత్కారుణ్యమూర్త్యాత్మకున్
        సాక్షాద్వేద స్వరూపునిన్ మహిము; విశ్వాధార ప్రేమాస్పదున్
        సాక్షాత్కారము నీయ వేడెద ప్రభున్ సత్యాశ్రయున్ సాయినిన్! ...5

కం.   చల్లని సేవానిరతియు
        యుల్లము రంజిల్ల జేయు నుపదేశంబుల్
        ఎల్లలు తెలియని పేమను
        ఎల్లప్పుడు పంచి పెట్టు! మీశ్వర! సాయా! ...6

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

శిధిల హంపి (కొంగర జగ్గయ్య)

( శశిధర్ పింగళి )
ఇలలేని రతనాలు తొలికారు ముత్యాలు
              కొలబోసి నీవీధి విలిచిరంట
కవిపాదములనొత్తి గండపెండేరమీ
              మొగసాల రారాజు ముడిచెనంట
పగఱగుండెల చిచ్చు రగిలింప నప్పాజి
              రణతంత్రమీయింట వ్రాసెనంట
రాణి చిన్నమ్మ యీకోనేటనే మున్గి
              నవరాత్రిపూజనల్ నడపెనంట
మేఱకనరాని యీపొలిమేఱనెల్ల
ఝణఝణధ్వాన సోపాన చరిత లలిత
లాస్య లావణ్య విలసత్కళావధూటి
శిశిరచాంద్రీ ప్రమోదమ్ము చిలికెనంట!

ఈనిలువెత్తురాళ్ళు మునుపే మహనీయ పరాక్రమ ప్రభా
మానిత వీరనాయకులొ! మాయని వెచ్చని దేశభక్తి, ని
ద్రాణ మహాంధ్ర మానస పథమ్ముల జాగృతిగొల్పి; తల్లి మా
గాణపు మేలుకోరి పడిగాపులుగా నిలబడ్డవారటే !

ఈగాలి విసురులో యేకోడె మొనగాని
              తెగిన గుండియకోర్కె బుగులుకొనియె,
ఈ యెఱ్ఱమట్టిలో యే పూరిగుడిసెల
              కడుపు చుమ్మలగోడు కఱగిపోయె,
ఈ బండరాళ్ళలో యే శిల్పకారుల
              నూరేళ్ళ స్వేదమ్ము పేరుకొనియె,
ఈ ముళ్ళపొదలలో యే లేతజవరాండ్ర
              పసుపుకుంకుమ బైసి బ్రద్దలయ్యె,
ఈ భయంకర నైశ్యబ్ద్య హిండనమున
ఏ చరిత్ర స్వరాలాప మిఱుకు వడియె
ఈ యనంత పౌరాతన్య హృదయ రజని
ఏ భవిష్యత్ ప్రభాతమ్ము లిగిరిపోయె !

కనులకెదురుగ నాటిభాగ్యమ్ములెల్ల
నిలచి గర్వమ్ముగా నన్ను పలుకరించు
కాలియడుగున జాలిగా కదలునేల
వెలికితీయని వైనాలు విన్నవించు!

రారాజు గెలిచిన రణగాధ మఱుగున
               ప్రాణాలువిడచిన బంటులెవరు ?
వజ్రాల సంతలో వైభోగములు నింప
               గడ్డదున్నిన రైతు బిడ్డ లెవరు ?
జగతి మెచ్చిన శిల్ప సౌకుమార్యము నిల్ప
               రాళ్ళు కొట్టిన కూలిరాయులెవరు ?
రాణివాసపు చీని చీనాంబరాలలో
               సరిగ నేసిన పద్మసాలు లెవరు ?
భాగ్యవంతులు సుఖముగా బ్రదుకు కొఱకు
ముఱికినూడ్చిన నెఱమూక మూక యెవరు ?
ఉన్నవారికి మాత్రమే యున్నదోయి
లేనివారికి చరితలో లేదుచోటు!

           // అయిపోయింది //

3, సెప్టెంబర్ 2011, శనివారం

శిధిల హంపి (కొంగర జగ్గయ్య)

శశిధర్ పింగళి ) 
( భ్లాగు ఉపశీర్షికలోని మాటలలో ఇంతవరకు మనసుకు తోచినవే వ్రాస్తూ వస్తున్నా. మనసు దోచిన వాటిల్లో భాగంగా, ఇప్పుడే 'శిరాకదంబం' రావుగారి బ్లాగులో శ్రీ జగ్గయ్య గారి గురించిన వ్యాసం చదివి ఈ టపా వ్రాస్తున్నా. ఇవి షుమారుగా 80ల ప్రాంతంలో ఒక వారపత్రికలో ఈయనగురించి వ్రాస్తూ ఈ పద్యాలు కూడా వేశారు.
అయనమీది అభిమానమో, పద్యమంటే వున్న అభిమానమో నన్ను ఇవి దాచుకునేలా చేసింది. ఈ పద్యాలు జగ్గయ్య తన 14వ యేట 1940లో వ్రాసారని చెప్పారు. ఆ వయసుకే భావంలోని గాంభీర్యం, భాషలోని ప్రౌఢత్వము అబ్బురమనిపించాయి. ఇప్పుడు మీతో యిలా పంచుకునేలా చేసాయి. చదవండి...........)

           ఇదొక విషాదగాధ; మునుపిచ్చట ఆయువుతీఱె, ఇందిరా
           వదన దరస్మిత స్పురిత వైభవ శస్తసమస్తగేహ, భృ
           న్మదన మహోదయమ్మునకు మాయని ఈ శిధిల ప్రశాంతిలో
           నిదుర మునింగిపోయెనొక నిన్నటి సత్యము శాశ్వతమ్ముగా !

           తెలుగు చరిత్రలో పసిడి తేటలుదిద్దిన కాలలేఖినీ
           విలసనధారలో పరువు విచ్చి జగమ్ములు మెచ్చి కొల్వగా
           పులకితమైన క్షేత్రమిది; మూగయెలుంగుల, ఓరుగాలులా
           తలపులు పాడుకొంచు బరితప్పవు నేటికదెంత బంధమో !

           ఇదికుందేటికి కూడ పౌరుషము రేకెత్తించు దేశంబు; దు
           ర్మద రాజన్య విదీర్ణ కంధరసిరా రక్తోష్ణ ఖడ్గప్రభా
           విదితోదగ్రుడు కృష్ణరాయుడిచటన్ స్వేచ్చా సముద్భూత; శుం
           భద ఖండాంధ్ర పతాక రేఖల దిశాభాండమ్ము వెల్గించెలే !

                                                                                                        ఇంకావుంది ....