[ శశిధర్ పింగళి]
(8th జులై 2012 వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితం)
"ఎలాగైనా నువ్వీ పెళ్ళికి ఒప్పుకోవాలి" సోఫాలోనుండీ ముందుకు జరిగి నా రెండు చేతులూ పట్టుకుని ఆర్ద్రంగా అడిగాడు గిరి.
వాడి అబ్యర్ధననీ అందులోని నిజాయితీని చూసి క్షణకాలం విచలితుణ్ణయ్యాను.
"నాదేముందిరా వాడిష్టం, మనకున్న సెంటిమెంట్లు వాళ్ళకుంటాయా చెప్పు" అన్నాను మెల్లగా.
"వాడి సంగతి నాకొదిలెయ్. నేను చూసుకుంటాను. నువ్వొప్పుకున్నావ్ అది చాలు. ధాంక్స్" అన్నాడు సంతోషంగా. మెల్లగా నవ్వాను అంగీకరిస్తున్నట్లుగా.
గిరికి మొదటి నుండి తనమీద తనకి గొప్ప నమ్మకం. ఎదుటి వారిని ఒప్పించడంలో దిట్ట. వాడి పర్సనాలిటీకి వాడి వ్యవహారశైలికి ఎలా కుదురుతుందా అని ఇప్పటికీ నాకు అనుమానమే. కాలేజీరోజుల్లో ఎక్కడ ఏ గొడవ జరిగినా వీడే తీర్పరి. వీడు వెళ్ళి ఏం మంత్రం వేసేవాడో కానీ ఇరు వర్గాలు గొడవమాని వెళ్ళిపోయేవారు.
కాలేజీ రోజుల్లో నేనూ, గిరీ, సుందరం ఒక జట్టు. ముందు బెంచీ బాచ్. గిరి అందరితో చనువుగా వుంటూ అన్ని పనుల్లోనూ తానే ముందు వుండే వాదు. సోషల్ యక్టివిటీస్ కూడా ఎక్కువే.
నేనూ, సుందరం మితభాషులం. చొరవ తక్కువ మనుషులం. అయినప్పటికీ గిరి మాప్రక్కన వుంటే కొంచెం అల్లరిగానే వుండే వాళ్ళం. సుందరం పేరుకు తగ్గట్టే అందంగా వుండే వాడు. చదువులో కూడా ముందుండే వాడు. క్లాసులో ఎప్పుడూ వాడే ఫష్ట్. వాడికి పోటీగా రాజేశ్వరి. చదువులోనే కాదు అందంలో కూడా సుందరానికి పోటీయే. ఎందుకోగానీ క్షణం పడేది కాదు ఇద్దరికీ. నన్నూ గిరినీ అడ్డం పెట్టుకుని ఒకరిమీద ఒకరు జోకులూ, సెటైర్లూ వేసుకునే వారు.