"పెళ్ళంటే సందడి, సంతోషమే ననుకున్నాను. వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయి ఇల్లు బోసిపోయింది. అమ్మాయి వెళ్ళిపోయి నామనసు బోసిపోయింది. తలుచుకుంటే మగవాణ్ణి నాక్కూడా కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి" అన్నాడు గాద్గదికంగా. "
** ** **
కల్యాన మండపం కళకళలాడుతోంది. అందంగా అలంకరించిన పెళ్ళి మండపం, బయట నిలబెట్టిన స్వాగత తోరణాలు, విద్ద్యుద్దీపాలతో చేసిన అలంకరణ చూపరులను ఇట్టె ఆకర్షిస్తూ మరో లోకాన్ని తలపిస్తోంది.
పెళ్ళికి వచ్చిన చుట్టాలు తలో మూల జేరి ఎప్పటెప్పటి కబుర్లో కలబోసుకుంటున్నారు. ప్రౌఢ ముత్తైదువలు పట్టుచీరల్లోనూ పెట్టుకున్న నగలతోనూ హడావిడి చేసేస్తూ ఒకటికి పదిసార్లు అటూ ఇటూ తిరుగుతున్నారు. కన్నెపిల్లలు జుత్తు విబొసుకొని కొందరూ సగం అల్లి వదిలేసి కొందరూ రకరకాల విన్యాసాలతో జడలల్లి కొందరూ నేటి తరం అభిరుచికి పాత తరం ఆనవాళ్ళకి మధ్యస్తంగా రక రకాల బట్టలువేసుకుని సందడి చేస్తున్నారు. నడివయసు మగవాళ్ళు గవర్నమెంటు ఉద్యోగస్తులయితే వాళ్ళ వాళ్ళ ఉద్యొగాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ప్రైవేటు ఉద్యోగులు వారు పనిచేసే సంస్థల భవితవ్యం గురించి తద్వారా తమ భవిష్యత్తునూ చర్చిస్తూ అంచనా వేసుకుంటున్నారు.
ముహూర్త సమయం అయింది పురోహితుడు గట్టిగా మంత్రాలు చదువుతూ వధూవరులిద్దరిచేతా జీలకర్ర బెల్లం పెట్టించేసాడు. పెద్దలందరూ లేచి అక్షింతలువేసి అటునుంచి అటు భొజనాలకి దారితీసారు ఇక అక్కడ తమ పని అయిపొయిందన్నట్లు.
స్నేహితులూ, చుట్టాల్లో చాలావరకు భొజనాలయి పోగానే వెళ్ళిపోయారు. రాత్రిపూట ముహూర్తం 8.30కి. అందరికి వచ్చి వెళ్ళిపోవటానికి వీలైన సమయం.
అందరి భోజనాలు అయిపోయి ఆఖరి బంతికి పెళ్ళి పిల్లలు వారి తల్లిదంద్రులు ఒకరిద్దరు దగ్గరివాళ్ళు తప్ప వేరెవరూ లేరు. సరదా సరదా కబుర్లమధ్య పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్లను ఆటపట్టిస్తూ ఒకరి చేత ఒకరికి తినిపించమని బలవంతం చేస్తూ మొత్తానికి ఓ గంటసేపటికి భోజనాలయ్యాయనిపించారు.
జరుగుతున్న సందడంతా మౌనంగా చిరునవ్వుతో చూస్తూ పల్లెత్తు మాటైనా మాటాడక నిండుకుండలా గంభీరంగా వున్నది ఒక్క పెళ్ళికూతురు తండ్రి మాత్రమే. అంతమందిలోనూ అనుక్షణం అతణ్ణి ఓ కంట కని పెడుతూ అతని భార్య. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు. మంచి సంబంధం పైగా కోరి చేసు కుంటున్నారు. దైవసంకల్పంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. పెళ్ళిలొ ఎక్కడా మాట రాకుండా అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఆనందంగా కనిపిస్తూ తిరుగుతున్నాడే కానీ గుండె లోపలిపొరల్లొ ఎక్కడో ఒక జల తరంగమై కదులుతూనే వుంది.
"అమ్మా! వధువు తల్లిదండ్రులు రావాలి" అప్పగింతలకు అన్నీ సిద్ధంచేసి పురోహితుడు గట్టిగా పిలిచాడు.
అప్పగింతలకు అందరూ కూర్చున్నారు. వధువు తండ్రి మాత్రం కనిపించడంలేదు. అందరూ తలో మూలా వెదకటానికి ఉద్యుక్తులవుతుంటే, "ఉడండి నేను పిలుచుకువస్తాను" అంటూ లేచి వెళ్ళింది వధువు తల్లి.
మండపంలో ప్రక్కగా వున్న ఓ గది తలుపు వోరగా తీసివుండటం గమనించి మెల్లగా వెళ్ళి చూసింది. లోపల కిటికిలోంచి ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డ భర్త దగ్గరకువెళ్ళి భుజంమీద చేయివేసింది అనునయంగా.
ఆతను మెల్లగా తలత్రిప్పిచూసాడు. కళ్ళు వర్షించడానికి సిద్దంగా వున్న కారుమేఘాల్లా వున్నాయి. ఆతన్ని చూడగానే తనకీ కళ్ళల్లో సుడులుతిరిగాయి. అంతలోనె తమాయించుకుని..
"రండి అందరూ ఎదురు చూస్తున్నారు" అంది అరచేత్తో గుండెలమీదచమురుతూ.
వీళ్ళని వెతుక్కుంటూ వచ్చిన మామయ్య ఇద్దరినీ చూసి క్షణం అగాడు. మెల్లగా వచ్చి ఇద్దరి భుజాలను తడుతూ బయటకు నడిపించుకుంటూ వచ్చాడు.
పురోహితుడు చేయించే తంతు యేమీ తలకెక్కడంలేదు. చెప్పించే మంత్రాలు యాంత్రికంగా పలుకుతున్నాడు. ఆతని ముఖంలోకి నేరుగా చూడటానికి అతని భార్యకు తప్ప యెవరికీ ధైర్యం చాలటంలేదు. కార్యక్రమం పూర్తయింది అందరూ లేచారు.
వరుడి తల్లి చొరవగా కొంచెం ముందుకు వచ్చి వధువు తల్లిని ఆలింగనం చేసుకుంది వీపునిమురుతూ. ఆమె రెండుచేతులూ పట్టుకుని "నాకు ఆడపిల్లలు లేని లోటును భగవంటుడు ఈరకంగా తీర్చాడను కుంటాను. నేనూ ఓ తండ్రిబిడ్డనే మీ బాధ అర్ధం చేసుకోగలను.
అన్నయ్యగారూ! ఊర్లో సంబంధమే కాబట్టి మీరేమి దిగులుపడద్దు. ఎప్పుడు అమ్మయిని చూడాలనిపిస్తే అప్పుడు నిరభ్యంతరంగా రావచ్చు. ఆమ్మయీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూవుంటుంది. నా పిల్లాడిని అనుబంధాలను అర్ధంచేసుకునే పరిణతితోనే పెంచాను అంది అనునయిస్తునట్లుగా.
ఎక్కడి చుట్టాలక్కడికి వెళ్ళిపోయారు. మూడునిద్దర్ల నెపంతో కొత్తబంధువుల రాకపోకలతో ఓ వారం రొజులు గడిచిపోయాయి. మెల్లగా పరిస్థితిని అలవాటు చేసు కుంటూ అమ్మాయిని అత్తవారింటికి పంపించివేసారు.
*** *** ***
"ఇప్పటికిది నాలుగో కప్పు కాఫీ.. ఇకనైనా లేచి స్నానానికి వెళ్తారా లేదా" అంటూ తెచ్చిన రెండుకప్పుల్లో ఒకటి భర్తకిచ్చి తనూ కూర్చుంది ప్రక్కనే.
"ఉండవోయ్ అమ్మాయి ఫోన్ చేస్తానంది అది రాగానే మాట్లాడేసి లేస్తాను" అన్నాడు నింపాదిగా కాఫీ త్రాగుతూ.
"పొద్దున్నించి చూస్తున్నా.. ఇప్పటికి నాలుగు కాల్స్ అయ్యాయి. అందులో మూడు వీడియో కాల్సే. ఇంకా ఏం మిగిలిపోయిందో మాట్లాడుకోటానికి.. ఎదురుగా చెట్టంత మనిషిని పనికిరాలేదు కానీ, ఎక్కడో దూరాన వున్న అమ్మాయి ఎక్కువైపొయింది" అంది కొంచెం కోపం నటిస్తూ.
"అదికాదోయ్ కొత్తచోటు, కొత్తమనుషులు అమ్మాయేమి ఇబ్బంది పడుతోందోనని ఆరాటంగా వుంది. అంతే".
"అమ్మాయికి అక్కడొచ్చిన ఇబ్బంది ఏమీవుండదు. మీరు ఇబ్బంది పెట్టకుండా వుంటే అది చాలు, అయినా దాన్ని కాపురానికి పంపి నిండా రెండురోజులు కాలేదు మరీ యింత ఆగిత్తం పనికిరాదు. వాళ్ళేమైనా అనుకుంటే ఎంత అప్రతిష్ట"
“ఆగిత్తం కాదోయ్ అది బెంగ. నా చిట్టి తల్లి నన్నువిడిచి వుండ లేదింత వరకు.ఎలా వుందో ఏమిటో ‘
“మీ వాలకం చూస్తుంటే అమ్మాయిని కాపురం చేయించే కళలు కనిపించటంలేదు.”
అయ్యొయ్యో! ఎంత మాటన్నావ్..అయినా ఇది తండ్రి ప్రేమోయ్.. నీకర్థం కాదులే.”
“అవునవును.. అదే అనుకుంటున్నారు. మీరొక్కరే జగదేక తండ్రి... మీ అమ్మాయోక్కటే అతిలోక తనయ. మేం కూతుళ్ళం కాము. మానాన్నలకు మీ అంత ప్రేమ వుండదు మరి.”
“అంటే అది నా ఉద్దేశ్యం...”
అయినా అయ్యవారికి కూతురిమీద ప్రేమ ఇన్నాళ్ళకి తెలిసొచ్చింది. మానాన్న కాళ్ళా వేళ్ళా పడుతున్నా ససేమిరా అంటూ నన్ను తీసుకువచ్చినప్పుడు తెలీదు పాపం బెంగ".
“బెంగ తెలీక కాదు, అది అమ్మాయిగారిమీద ప్రేమోయ్... ప్రేమ..” అయినా ముప్పై సంవత్సరాలు తపస్సుచేసి పెళ్ళిచేసుకుంది గుళ్ళో అమ్మవారిని చూసినట్లు నిన్ను అత్తవారింట్లో పెట్టిచూసుకోటానికా చెప్పు” అన్నాడతను ముసి ముసిగా నవ్వుకుంటూ.
“ఆహా! తను చేస్తే శృంగారం మరోడు చేస్తే వ్యభిచారం అన్నాట్ట ఎవరో, అలా వుంది మీ వ్యవహారం”
“ఇవ్వాళ శ్రీమతిగారు కొంచెం కాకమీదున్నట్లున్నారు”
"మీరు చేసిన బాగోతం తలచుకుంటే ఇప్పటికీ వళ్ళు మండుతుంది."
"అంత కానిపని ఏమిచేసానబ్బా.. గుర్తురావటం లేదే..."
గుర్తు రావడం లేదా.. మన పెళ్ళైన కొత్తలో తొలి పండక్కిరమ్మంటూ నాన్నగారు వచ్చి మనల్ని తీసుకువెళ్ళి, పలహారాలూ, పిండివంటలతో మీకు చేసిన సత్కారాలన్నీ చేయించుకున్నారు, పెట్టినవన్నీ బాగా తిన్నారు.. పండగ తర్వాత "అమ్మాయిని రెండు రోజులు వుంచి వెళ్ళండి అల్లుడు గారూ, తర్వాత తీసుకువచ్చి దిగాబెడతాం ఇంట్లో అందరూ బెంగపడ్డా" రని అభిమానంగా అడిగితే..
“అంత బెంగగా వుంటే మీరే వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళండి" అంటూ మొహంమీదే చెప్పి తీసుకొచ్చేయ లేదూ.
పాపం వాళ్ళు మనసెంత కష్టపెట్టుకున్నారో ఏమో!
కళ్ళు విప్పార్చుకుని చూస్తూ "ఊ.." అన్నాడు
"మరోసారి.. మాచెల్లి పెళ్లి కుదిరినప్పుడు, మానాన్న గారు వచ్చి "అమ్మాయిని ఓ పది రోజులు ముందు పంపండి అల్లుడుగారూ మాకు కాస్త సందడిగాను, సాయంగాను ఉంటుంది" అని అడిగితే ఎవన్నారూ..
"అమ్మో పది రోజులే, ఓ వారమయితే సరే"నంటూ ఆఫీసులో సెలవుకు కోత పెట్టినట్లు కోతపెట్టలేదూ..
పోనీ ఆ తర్వాత వున్న వారంరోజుల్లో నాలుగు ఉత్తరాలు. ఉత్తరం వచ్చిన ప్రతిసారీ మా అత్తయ్యలు, వదినలు ఒకటే ఆట పట్టించడం. సిగ్గుతో తెగ చచ్చి పోయాననుకోండి “ అంది తలొంచుకుని సిగ్గుపడిపోతూ.
"అప్పుడంటే సరే.. ఇప్పుడెండుకోయ్ అంతసిగ్గు" అన్నాడు గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తి కళ్ళలోకి చూస్తూ.
"ఛీ పొండి" అంటూ లేచి వేళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకుని ఆపుతూ..
"కాసేపు కూర్చోవోయ్ మనసేం బాగులేదు. అవ్వన్నీ నువ్వు గుర్తుచేస్తుంటే ఇప్పుడు బాధేస్తుంది. మిమ్మల్ని ఎంత బాధపెట్టానోకదా. నిజంగా నాకు తెలీదు. అయినా ఇంత బాధని మనసులో ఎలా దాచుకున్నావ్. ఎప్పుడూ సంతోషంగానే కనిపించే దానివిగా" అన్నాడు ఆశ్చర్యపోతూ.
"ఆడపిల్లకి సుఖం,సంతోషం, బాధా,దుఃఖం విడివిడిగా వుండవండీ.. పాలూ నీళ్ళలా కలిసేవుంటాయి. వాటి వాటి మోతాదుల్లో తేడాని బట్టి బాధా, సంతోషం వ్యక్తమవుతూవుంటాయి అప్పుడప్పుడు అంతే" అంది తాత్వికంగా చూస్తూ.
"అయితే నాచిట్టి తల్లికీ అంతేనంటావా?"
"ఏం? మీ అమ్మాయి దేవలోకంనుండి ఊడిపడిందా... మీ చిట్టితల్లి ఇంకా మీరు కుండీలో పెంచుకున్న చేమంతి మొక్క కాదు. చెట్టుగా మారి పదిమందికి నీడ నివ్వటానికీ, ఆ పెరట్లో నాలుగు కాయలు కాయడానికీ వెళ్ళింది.
అందమైన గులాబీ మొక్క పచ్చని కొమ్మ వంచి నేలలో అంటు కడతాం. ఆడపిల్లలూ అంతే. కొమ్మ భూమిని తాకినప్పుడే దానికి అర్థమవుతుంది. తానెప్పటికైనా మరో పెరట్లో పరమళించాల్సిందేనని.
అందుకవసరమయ్యే బుద్ది, బలం భగవంతుడే సమకూరుస్తాడు.”
“పెళ్లి కాని ప్రతి ఆడపిల్లకీ ఆకాశం పట్టనన్ని ఆశలు వుంటాయి. ఏవేవో ఊహించు కుంటూ అందమైన కలలు కంటూనేవుంటుంది. ఆ మూడుముళ్ళూ పడినతర్వాత, భర్త వేలుపట్టుకుని అత్తింట్లో అడుగుపెట్టాకే మొదటి సారిగా కలకీ వాస్తవానికి తేడా తెలుస్తుంది.
అప్పటినుండీ తన ఆశల రెక్కల్ని ఒక్కక్కటీ రాల్చుకుంటూ .. ఆ చిన్ని గూట్లో బొమ్మలా ఒదిగి పోవడానికి అనునిత్యం తనని తాను శిల్పంలా చెక్కుకుంటూనే వుంటుంది చివరివరకూ.
ఈ క్రమంలో ఇక్కోక్క సారి తన అస్తిత్వాన్ని కూడా మర్చిపోతుందండీ ఆడది.
ఇవేవీ మీ మగవాళ్ళకి అర్థం కావు. కనీసం అందుకు ప్రయత్నంకూడా చేయరు. ఎందుకంటే ఇవన్నీ అర్థం చేసుకుంటే మీరు మీలా వుండలేరు కాబట్టి మీ అహం అందుకు అడ్డుపడుతూ వుంటుంది."
ఆమె మాట్లాడుతున్నంత సేపూ ఆతను రెప్పవేయ కుండా ఆమెనే చూస్తున్నాడు విస్మయంగా. నిత్యం తనముందు అమాయకంగా, చెంగు చెంగుమంటూ తిరిగే తన భార్యేనా ఇలా మాట్లాడుతోందని ఆశ్చర్యపోయాడు. ఇన్నాళ్ళూ నవ్విస్తూ, కవ్విస్తూ, మాటకి మాటగా కొంటె సమాధానాలిస్తూ తిరిగే భార్య ఇవాళ ఇంత లోతుగా గంభీరంగా మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నాడు.
"నిజమే, మా మగవాళ్ళకి పొసెసివ్ నెస్ ఎక్కువ. అన్నీ తీసుకునే తత్వమేకానీ ఇచ్చే గుణం కాదు. అందుకే మీ కోణం నుంచీ ఆలోచించలేదింతవరకు. మొదటిసారిగా అమ్మాయిని అత్తవారింటికి పంపాక ఆబాధ అనుభవం లోకి వచ్చింది.
పెళ్ళంటే సందడి, సంతోషమే ననుకున్నాను. వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయి ఇల్లు బోసిపోయింది. అమ్మాయి వెళ్ళిపోయి నామనసు బోసిపోయింది. తలుచుకుంటే మగవాణ్ణి నాక్కూడా కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి" అన్నాడు గాద్గదికంగా.
అడవిలో తపస్సుచేసుకునే కణ్వమహర్షి అంతటివాడికే, శకుంతలను అత్తవారింటికి పంపే సమయంలో కన్నీళ్లు వచ్చాయట. పెంచిన ప్రేమ అటువంటిది. వీతరాగుల్నే కదిలించిన ఆ మోహపాశానికి సంసార బంధంలో బందీలయిన మనమొక లెక్కా.. ఊరుకోండి.. అలా చిన్నపిల్లాడిలా కన్నీళ్ళు పెట్టుకోకూడదు. అమ్మాయి వున్నది కూడా వూర్లోనేగా సాయత్రమొకసారి వెళ్లి చూసొద్దాం.” అంటూ అతని ముఖాన్ని అనునయంగా దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంది.
*****
కార్యేషుదాసీ, కరణేషు మంత్రీ,
రూపేచలక్ష్మీ, క్షమయాథరిత్రీ
భోజ్యేషుమాతా, శయనేషు రంభా,
షట్కర్మయుక్తా కులధర్మపత్నీ!
--శశిధర్ పింగళి