స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

26, మార్చి 2017, ఆదివారం

నువ్వొస్తావని

 [శశిధర్ పింగళి]

నువ్వొస్తావని
ఆకాశంలో విశ్వద్వారానికి
విహంగాలు తోరణాలు కడుతున్నాయి
నిన్ను అభిషేకించటానికి కాబోలు
మొయిలు ముత్తైదువలు – నీళ్ళు
మోసుకొస్తున్నారు
నీ లేత పాదాలు మాసిపోతాయనేమో
చందమామ
చుక్కల తివాచీ పరుస్తూ
దారంతా వెన్నెల దీపాలు వెలయిస్తున్నాడు..
మోడువారిన మహీరుహాలన్నీ
నూత్న పల్లవాలతో
కొత్త యౌవ్వనాన్ని సంతరించుకుంటునాయి
ఫల్లవాలు మేసిన పులుగు పాపలు
వేకువ సంగీతంలో పల్లవులు పాడుతున్నాయి
అప్పుడే సముద్రస్నానం చేసిన
సంధ్యా సుందరి అరుణ తిలకాన్ని దిద్దుకుంటోంది
అందంగా అలంకరించిన ఆశల వంతెనపై
అడుగులేస్తూ వస్తావని – అనందపు
తాయిలాలు తెస్తావని
నెఱ్ఱులు బారిన నా హృదయం
వెఱ్ఱిగా అఱ్ఱులుచాస్తూ – ఆర్తిగా
ఎదురుచూస్తోంది
***​