రచన: పింగళి వేంకట శ్రీనివాస రావు [సెల్: 9618409607]
శా|| శ్రీకల్యాణ గుణావహుండు జగతిన్ చిద్రూపకాలాకృతిన్
సాకారంబయి నాది అంతములకున్ సాక్ష్యంబు లేకుండగా
సాకల్యంబగు మాయవేషములతో శైలూషుడై యాడ సు
శ్లోకుండై జయనామధేయుడగుచున్ శోభిల్లవిచ్చేసిడిన్. 1
గీ|| శుద్ధవైరాగ్య భావనాస్ఫోరకముగ
ఆకులను రాల్చు పాదప యతులమేన
చివురు జొంపాలవలువలు సిద్ధపరచి
మనసు మరలంగజేసెడి మహిత ఋతువు. 2
సీ|| వాసంత నవరాత్ర వర్ధితమ్మైనట్టి
రమణీయశోభతో గ్రాలు ఋతువు
చెలువమ్ము నిండార శ్రీరామ జానకీ
కల్యాణములు చేయు కామ్య ఋతువు
సాగరమ్మున గ్రుంకి సలలితమ్మైనట్టి
సరిగంగస్నానాలు సలుపు ఋతువు
ఇక్షుశరాసను నెలమి తూపుల పంట
విరివిగా రాజిల్లి విరుయు ఋతువు
గీ|| కంటికింపైన కౌముదుల్ మింటవెలుగు
అతిమనోహర లావణ్య ఋతువతంసు
డవని కరుదెంచె విశ్వవిఖ్యాత కీర్తి
దర్పమలరంగ జయనికేతనముబూని ౩
గీ|| శిశిరమును త్రోసి రాజిల్లు చేవగాడు
కాలపురుషుని తొలుదొల్త కడుపుపంట
తుంటవిలుకాని నెయ్యంపు కంటివెలుగు
సరస ఋతురాజు వచ్చె వసంతుడిలకు. 4
గీ|| ఆది ఋతురాజు వైభవమవని చాట
కోరి సహకార పల్లవకోమలములు
మెక్కి రెచ్చిన కంఠాన మించిపాడె
కొమ్మ కొమ్మను జేరి పుంస్కోకిలమ్ము. 5
గీ|| శ్రీలు కెంగేలధరియించి కాలవిభుడు
చైత్ర రధమెక్కి ముదమార జైత్రయాత్ర
సకలహితగామి సఖుడు వసంతుతోడ
ఇలకు చనుదెంచె సదయుడై ఎలమిమీర! 6
ఉ|| స్వాగతమో సమాగత సువత్సర కాల కుమారయంచు, నీ
యాగమనమ్ము కోరి హృదయమ్మును కోవెలరీతి జేసి, పు
న్నాగవరాళిలో వర సునాదవినోద సరాగ రంజికా
రాగమునూది పల్కె మది రంజిల కోయిల గున్నమావిపై. 7
చం|| అరుదుగ వచ్చితీవు నిలనర్వది వత్సరముల్ గతించె, నీ
దరిశన భాగ్యమబ్బకను, ధన్యులమైతిమి నీదురాకచే
మురిపెముతోడ నీ మృదుల పుణ్యకరమ్మున నాశిషావళుల్
ధరపయి గ్రుమ్మరించి మముధార్మిక వృత్తిని నేలుకొమ్మికన్! 8
ఉ|| కాలమనంగ దైవతము కాలము గాయపు నౌషధంబగున్
కాల మనంతవాహిని సుఖంబును కష్టములారుపాళ్ళుగా
మేలగు షడ్రసోభరిత మేలిరసాయనమందజేయు నో
కాలస్వరూప! ఓ జయ సుకాలకుమారమ! నీకు మ్రొక్కెదన్. 9
మ|| ఋతుషట్కంబులనేల వచ్చిన మహోత్కృష్ట ప్రభారాశి! నీ
యతులైశ్వర్య కృపాకటాక్షముల నత్యంత ప్రమోదమ్ముతో
క్షితిసంవాసుల మీద జూపి గొనుమా! కీర్తి ప్రశంశోన్నతుల్
గతగాయంబులు మాన్పగా తగినదీ కాలంబు శ్రేయస్కరా! 10
ఉ|| మానవతల్ ప్రవాహముగ మానిసి నిత్యము తోటివారికిన్
మానిత రీతి సాయపడు మంజుల మానస భవ్యనందనో
ద్యాన వనాంతరమ్ముల సుధారస పూరిత దివ్యపుష్ప సం
ధానము గూర్చుమోయి సురధామపు శ్రీజయ! తోటమాలివై. 11
శా|| శ్రీమంతంబయి పండుగాక! పృధివిన్ స్నేహార్ద్రతా భావముల్
సామంతంబయి నిండుగాక! సుమనోసామ్రాజ్యముల్ పాలితుల్
సీమంతంబగుగాక! సృష్టి; సమతా శ్రీసస్యకేదారమై
హేమంతంబగుగాక శ్రీ జయ శుభశ్రీనామ కాలంబిలన్. 12