స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

29, అక్టోబర్ 2014, బుధవారం

’జడ పజ్యాల శతకం’

[శశిధర్ పింగళి]


నిన్న 'జడపజ్యాల శతక' మావిష్కృత సభ చాలా ఆత్మీయంగా, సరసంగా జరిగింది సన్ షైన్ హాస్పటల్ వారి శాంతా ఆడిటొరియంలో. కాంతాకరవాలంగా కొనియాడబడ్డ జడ అప్పుడు ఇప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే వుంది. చంపకు చారెడు కళ్ళు, బారెడు జడ, నుదుటిన రూపాయికాసంత బొట్టూ, ఆపైన అందమైన చీరకట్టుతోనో, పట్టుపరికిణీ ఓణీలతోనో కనిపిస్తే అది అచ్చమైన తెలుగమ్మాయి. కళ్ళెర్రజేసినా, కులుకుజూఁపి కవ్వించినా అన్నింటికీ ముందొచ్చేదీ, ముందుకొచ్చేదీ ఈ జడే మరి. అసలు దీన్ని కవితా వస్తువు చేసుకోవాలనే ఆలోచనలోనే చిలిపిదనం వుంది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు, కవులు తలుచుకుంటే పద్యాలకు కొదువా మరి. అందునా బ్నిం గారి ఆహ్వాన ప్రోత్సాహాలు అద్భుతమైనవి. బాపూ గారు ఈ జడ సౌందర్యాన్ని రేఖాబద్ధం జేస్తే ఇప్పుడు ఈ కవులు అక్షరబద్ధం చేసారు. ఏమైనప్పటికీ 'జడ' జన్మ సార్థకమైంది.

కందము లీజడ కందము 
నందీయగ వచ్చిజేరె నాప్యాయముగా 
ఎందరొ కవులున్, బ్నిం 
గారిందుకు అభినందనీయు లింతులు మెచ్చ్చన్. (లింతకు  నింతై) 

ఇల్లా జడపై పద్యా 
లల్లాలని పిలుపునిచ్చి యందరిచేతన్ 
ఉల్లేఖించిరి, తల్లీ 
పిల్లలు నికపై 'జడ'లనె వేయందొడగన్ 
-------------
నామాటగా ఒక పద్యం

నగలెన్ని పెట్టుకున్నను 
సిగలోపల పూలు పెట్టి సింగారింపన్ 
మగనికి ప్రియమౌనె చెపుమ!
తెగ బారెడు జడకు సాటి తేలే రమ్మా!

--------------------------
ఈ సభలో ముళ్ళపూడి వారబ్బాయినీ,  శ్రీ కంది శంకరయ్య మాష్టారిని, శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారిని కలుసుకోవటం ఆనందకరమైన విషయం.