స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

4, సెప్టెంబర్ 2014, గురువారం

స్వర్గారోహణంలో బాపు...[ శశిధర్ పింగళి ]

సెగెట్రీ! ఏర్పాట్లద్దిరిపోవాల

చిత్తం

సిత్తం సిత్తం అంటే గాదు, తేడాగానీ వచ్చిందంటే సితగ్గొట్టీసి సెట్టుతొర్రలో తొన్గోబెట్టీగల్ను. ఈ కాంట్రాక్టుమీదే మన బవిస్యద్ధారాపడివుంది. ఇంద్రుణ్ణి కాకా బెట్టీసి మరీ ఇప్పించుకున్నాం.

 చిత్తం. తవరు మేధావులండీ.

అద్గదే! ఈ పొగడ్తలంటేనే నాకు సిర్రెత్తుకొచ్చేది. ఈ పొగడ్తలమైకంలో పడి అసలిషయం మర్సిపోతాననే మా రవణ బాబాయి ఎనకాల బజంత్రీలేర్పాటుచేసాడు.

చిత్తవండీ.

శిత్తవని సేతుల్గట్టీసుకుంటే ఎలా. మడిసిగా పుట్టిచచ్చాక కూసింత ముందూయెనకా సూసుకోవద్దా. ఏది ఓపాలి ఆకాశంకేసి చూసుకో.

ఏటి.. ఏటి.. నేజూడమందేటి, నూజూస్తుందేటి. ఆకాశవనగానే గోసెగ్గట్టేసి, మోరెత్తేసి పైకి సూసేడవేనా. మనం సచ్చి సొర్గంలోవున్నామన్న ఇంగితం వుండక్కర్లే. సచ్చినోళ్ళం మనం పైనుంటాం. ఆకాశం మన కాళ్ళకిందుటది. ఏటి 
అర్దమైందా!

చిత్తం, తమరు మేధావులయ్యా!

ఛస్! మళ్ళీఅదే మాట.

చిత్తం చిత్తం, చూసానండీ! యేవో పొగలొస్తున్నాయండీ.

ఆవీ మాగుర్గారి కాట్టానికి జనాలగ్గెట్టేసిన పొగలు.

ఆమధ్యనుండి  ఓ తెల్లలాల్చీ తో ఓ పెద్దాయన వస్తున్నాడండీ.
ఆద్గదీ.. ఆయనే మా గుర్గారు.

ఛిత్తం.. ఇంతకీ ఆయనెవరో చెప్పేరుకారు.
ఛస్స్! భొత్తిగా ఇంగితంలేనిమడిసివి. నిన్నొచ్చిన మన రవణబాబాయి కారొపేనం.  రాత బాబాయిదైతే, గీత గురూగారిది.
బాబాయి నిన్నరావడమేంటి.. వచ్చి చాలా కాలమయ్యిందే!
సెగెట్రీ, నిన్ను కాదుగాని నీకుజ్జోగం ఇప్పించినాడ్ని తొంగోబెట్టేయాలి ముందు. ఇది సొర్గం. మనకిక్కడ ఒక రోజైతే ఆల్లకక్కడ ఒక సంవొచ్చరమన్నమాట. మన పెకారమ్ మనకి నిన్న ఆళ్ళ పెకారం ఆళ్ళకి నిరుడు.
అద్సరేగానీ సెగెట్రీ! ఏదీ ఏర్పాట్లు ఓపాలి లిష్టు చూసి చదువు.
చిత్తం, ముందుగురువు గారు కాలెట్టగానే పైనుండి పూలుపడతాయండీ. పాండవ వనవాసం లో లాగా
అప్సరసలందరూ పాటపాడుతూ పూలుజల్లుతూ స్వాగతం పలుకుతారండీ!
ఏటి ఈడకూడా గానాబజానెట్టేసావన్నమాట! సర్లేగానీ ఆ ఊర్వసిని రాకుండా చూసుకో జనాలెగవడితొక్కీసుకోగల్రు.
చిత్తం. అందుకే గుమ్మందగ్గర కాపలాగా మన రామలింగయ్యని పెట్టానండీ.
హార్నీదుంపతెగా! ఆ ఆమ్యామ్యా రామలింగణ్ణా! దండిగా ఆమ్యామ్యాలుచ్చుకుని అందర్నీ వదిలేస్తాడోయ్ సెగెట్రీ! జాగత్త!
చిత్తం! గురూగార్కి స్వాగతం ఐపోగానే నందోననం తోటలో ఇంద్రుడితో సన్మానం, పెద్దలతో నాలుగు మాటలు. ఆనక రంభతో ఓ ఆటా ఆ తర్వాత బొయినాలు.
ఇదంతాజూస్తుంటే గురూగారికోసం జేస్తున్నట్లేదు, నీ బులబాటాంకోసం జేస్తున్నట్లుంది. మనం జేసే పనిలో గురుగారిమీద బత్తికనబడాలి. అద్దవయిందా!
చిత్తం.. చిత్తం.. రామ రామ ఎంతమాట!
* * *

ఆనుకున్న సమయనికి స్వాగతవచనాలు చెప్పటానికి ఘనంగా చేసిన యేర్పాట్లమధ్య దేవేంద్రుడు, శచీదేవి, అప్సరసలు, సప్తరుషులు వగైరా వగైరాలందరూ ముందువరుసలోనూ, ఆయనకంటే ముందే చెట్టెక్కేసి పైకొచ్చిన మరికొందరు మానవాత్ములు రెండో వరుసలోనూ నిలబడ్డారు.
నీరసంగా నడుచుకుంటూ గుమ్మందాకా వచ్చి తనకోసం నిలబడ్డ వాళ్ళందరిని ఓ సారి కలయజూచి, గిరుక్కున వెనుదిరిగి పోయి ఆకాశంలో బాసింపట్లు వేసుకుని మూతి బిగించి కూర్చున్నారు గురువుగారు.
గుమ్మంలోకి రాగానే దండవేద్దామని ముందుకు వంగిన ఇంద్రుడు తూలిపడ్డాడు. ఘభాల్న పట్టుకున్న పక్కనే వున్న రంభని చూసి శచీదేవి మూతి విరుచుకుంది. ఖొరకొరా చూస్తున్న ఇంద్రుడి చూపుల్ని చూసి కాంట్రాక్టరు ఖంగుతిన్నాడు. కాంట్రాక్టరు సెగెట్రీ వంకజూశాడు. సెగెట్రీ గబగబా పరుగెత్తికెళ్ళీ గురూగారిముందు సాష్టాంగపడి లేచి రెండు లెంపలేసుకుని చేసిన యేర్పాట్లల్లో యేమైన పొరపాట్లుంటే మన్నించమనీ దాచేసుకున్న కాళ్ళని వెతుక్కుంటూ దండం బెట్టేసి లోనికి విచ్చేయమని వేడుకున్నాడు.
గురువుగారు కరగలేదు. మౌనం వీడలేదు. కానీ కళ్ళుమాత్రం నిశ్శబ్దంగా నిర్వికారంగా ఎటొ జూస్తున్నాయి.
సెగెట్రీ పడే పాట్లన్నీ అంతా చూస్తూనే వున్నారు. వయసైపోయి వచ్చాడుగా నీరసం వచ్చిందన్నారొకరు. కాదు ఇంతదూరం నడిచి వచ్చాడుగాబట్టి ఆయాసం వచ్చిందన్నారు ఇంకోరు. కాళ్ళనొప్పులనీ, కీళ్ళనొఫ్ఫులనీ మనకుండే మాయరోగాలన్నీ అంటగట్టేసి మానవ బుద్ధి చూపించుకున్నారు వెనక వరసలోని వారంతా.
రుషులు కళ్ళు మూసుకున్నారు దివ్య దృష్టికోసం. ఇంద్రుడు రంభా వూర్వశి, మేనకా, తిలొత్తమల్లో ఎవరిని పంపితే మౌనం వీడతాడా అని ఆలోచిస్తున్నాడు. ఈ మధ్య అప్సరసలకీ చిత్త చాంచల్యం పట్టుకుంది.  మేనక విశ్వామిత్రుడిని మరచిపోలేకపోతోంది. తల్లీ బిడ్డల్ని విడదీశానని నామీద అలకగా కూడా వుంది.  ఇక వూర్వశి అటు కిష్ణశాస్త్రికీ ఇటు చలానికి మధ్య పడి నలిగిపోతోంది. రంభ నలకూబరుడిని కాదని వేరెవ్వరివద్దకూ వెళ్ళనంటోంది. ఇక మిగిలింది తిలొత్తమ మొదటినుండీ తనే ఆమెని ప్రైవేటుగా అట్టేబెట్టేసుకుని జనాలకి తెలీకుండా చేసి తప్పు చేసాడు. ఇప్పుడామెను పంపినా అతగాడు గుర్తుపడతాడని నమ్మకంలేదు.
ఎవరికీ ఏమీ పాలుపోవడం లేదు. ఇక మిగిలింది తనే. రాజైన వాడు ముందే యుద్ధానికి వెళ్ళగూడదు కదా.  ఎంజేయడం చెప్మా అంటూ ముక్కుమీద వేలేసుకున్నాడు పైకి జూస్తూ.
ఇంతలో కాంట్రాక్టరు కళ్ళు బాబాయి కోసం వెదకడం మొదలెట్టాయి. సెగెట్రీ రవణబాబాయి ఎక్కడా అగుపట్టల్లేదే?
చిత్తం సెగెట్రీ పరుగు లంఘించుకున్నాడు బాబాయి దగ్గరికి.
ఆనక ఓ పది నిముషాలకి రొప్పుకుంటూ వచ్చాడు.
అక్కడ రవణ బాబాయి గారుకూడా ఇలాగే మాట్లాడకుండా కూర్చున్నాడు. గురువు గారొచ్చారని ఎంతజెప్పినా వినట్లేదు అంటూ.
బాబాయి ఒక్కడే వున్నారా దగ్గరెవరైనా వున్నారా అడిగాడు కాంట్రాక్టరు.
ఓ ఇద్దరు ముగ్గురున్నారండి. వారంతా రమ్మన్నా రావట్లేదు అన్నాడు వినయంగా.
ఇంతలో ఓ మధ్య వయస్కుడొకాయన వస్తూ ఇదో కాంట్రాక్టరూ అంటూ పిలిచాడు.
కాంట్రాక్టరుకి భయం, భక్తి, గౌరవం అన్నీ ఒకేసారొచ్చి మీదబది ముందుకు నడిచాడు.
రండి బాబూ, మీ ఉప్పుతిని, మీ పెరట్లో పుట్టిపెరిగిన కాంట్రాక్టరుని, నాజీవితాన్ని మలుపుతిప్పి నా యింటిముందు ముగ్గు కళతప్పకుండా చేసిన వారు అంటూ దగ్గరకు వెళ్ళాడు.
విషయమంతా వివరించి చెప్పాక ఆయన ఓ చిరునవ్వు నవ్వి.. హిరణ్యకశిపుని వధానంతరం, నరసింహస్వామి వద్దకు వెళ్ళే ప్రహ్లాదుడి లాగా నవ్వుతూ, భయంలేకుండా, చనువుగా గురువు గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు.
అతణ్ణి చూడగానే గురువుగారి పెదవి కాస్త విరిగింది. భ్రుకుటి ముడి కొంచెం సడలింది. అతడు కుశలప్రశ్నలయ్యాక ఈ మౌనానికి కారణం సెలవీయమని వేడుకోగా.. వేడుకోగా ఓ రెండుమాటల్లొ తన అంతరంగాన్ని బయటపెట్టారు. నా రాముడూ, నా రవణ లేనిది స్వర్గమైనా ఒకటే, చట్టుబండలైనా ఒకటే -  నేను రాను అంటూ.
ఆతనికి గురువు గారి మీద ప్రేమ ద్విగుణీకృతమైంది. వచ్చి ఇంద్రుడికి విషయాన్ని వివరించాడు. అందరూ నాలుక్కరుచుకున్నారు ఔనుస్మీ! మరచేపోయాం అనుకుంటూ. రవణనైతే యేదోలాగ బ్రతిమాలి తీసుకువస్తాం, రాముణ్ణి ఎలా రప్పించటం. ఇది స్వర్గమాయే. ఆయనుండేది వైకుంఠంలో నాయే. ఏంపర్లేదు మీ నారదుడిద్వారా కబురెట్టండి ఆయనే వస్తారు, ఈలోగా మనం రవణ దగ్గరకెళదాం అనగానే అందరూ బయలుదేరారు.
ఇంతమందిని ఒక్కసారి చూసేసరికి రవణ అప్రయత్నంగాలేచి నిలబడ్డాడు. ఆతను ముందుకు వెళ్ళి చెవిలో యేదో విషయం చెప్పాడు.   అప్పుడు నమ్మాడు బాబాయి.   ముఖం వెలిగింది. అడుగు ముందుకు పడింది.   ఆ వెనుకే అందరూ ఆనందంతో నడిచారు.
నారదుడి కబురందుకోగానే విష్ణుమూర్తి బట్టలేసుకుని బయలుదేరాడు. అందరూ ఒకేసారి గురువుగారి ముందుకొచ్చి నిలబడ్డారు. అందరికంటే ముందు రాముడూ, రవణా.
వారిని చూడగానే గురువు గారు లేచి నుంచున్నారు. రాముడికి వంగి వంగి సభక్తికంగా నమస్కరించారు. రవణ ను దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెలకు హత్తుకున్నారు చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తూ.   చూసే వాళ్ళందరికీ కన్నీళ్ళాగలేదు.
కాంట్రాక్టరు తన భక్తిని చాటుకుంటూ చేసిన యేర్పాట్ల ఏకరువు పెట్టాడు గురువు గారి ముందు. అందరూ సాదరంగ స్వాగతం చెబుతూ రమ్మన్నారు.
గురువుగారు మళ్ళీ తల అడ్డంగా ఊపారు రానని.
ఇంద్రుడు సన్మానం గురించి చెప్పాడు ఊహూ అన్నారు.
కాంట్రాక్టరు రంభ ఆట గురించీ, సెగెట్రీ ఆనక విందు గురించీ చెప్పారు.. ఊహూ అన్నారు.
ఇక లాభలేదనుకొని మళ్ళీ అతగాడి వైపు చూసారందరూ.
అతడు వినయంగా ప్రార్ధించాడు.  గురువు గారు తన మనోరథాన్ని తెలిపారు అతని చెవిలో.
అతడు సంతోషంతో పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా చెప్పాడు
గురువు గారికి ఈ సన్మానాలు, ఆటలూ, బొయినాలు వద్దన్నారు మరింకేమి కావాలన్నట్లు చూశారందరూ.
నిరంతరం ఈ రాముని పాదాలవద్ద చోటుకావాలన్నారు, ఇంకా ఓ సంచీడు కుంచెలూ, ఓ పుంజీడు రంగులు, కొన్ని కేన్వాసులూ, ప్రక్కనే రవణ, నేను ఇంకొకరిద్దరూ అదీ మా గురువు గారి డిమాండు అన్నాదు కాసింత గర్వంగా.
రాముడు నవ్వుకున్నాడు.
ఇంద్రుడు విస్తుబోయాడు.
కాంట్రాక్టరు చ్చస్...
*********


శ్రీ బాపూ-రమణ గార్లకు భక్తిపూర్వక నివాళులతో...
 

1, సెప్టెంబర్ 2014, సోమవారం

తెలుగక్షరం (బాపూ-రమణ)

[ శశిధర్ పింగళి ]


తెలుగక్షరం మూగబోయింది. గుణింతంలేని గీత నిలువునా కూలిపోయింది. నాకు ఊహతెలిసినప్పటినుండి, నేను కన్నంతవరకూ, విన్నంతవరకూ ఇంతటి స్నేహబంధాన్ని చూడలేదు. ఒకటా రెండా డెభై వసంతాలు ఎక్కడా ఏ పొరపొచ్చాలూ లేకుండా కలిసి మెలిసి ఉండటమంటే మాటలుకాదు. ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములే కలిసి వుండలేని కాలమిది. అటువంటిది ఇంత ఆత్మీయతను పెనవేసుకుని పుట్టిన బాపూ-రమణలు చిరస్మరణీయులు. తెలుగక్షరానిని మాటలునేర్పినదొకరైతే ఆమాటకు రూపాన్నిచ్చింది మరొకరు. అసలు మనకుతెలుగు అక్షరాలు రెండుగా విభజింపబడ్డాయి అచ్చులు, హల్లులు. ఇవిరెండూ కలిస్తేనే అక్షరం పరిపూర్ణమవుతుంది. మాటపుడుతుంది. కేవలం అచ్చులతో మాట్లాడితే మూగవాడు మాట్లాడినట్లుంటుంది. అలాగే హల్లులతో మాట్లాడితే ఎక్కిళ్ళు వచ్చినట్లుటుంది. రెండూ కలిస్తేనే రసరమ్యమైన భాషవుతుంది. ఇందులో అచ్చమైన అచ్చచ్చరం (గుణింతం) రమణ గారైతే హొయలొలికే హల్లక్షరం బాపూ గారు.
ఇద్దరి దృష్టి ఒకటే. దృక్పధం ఒకటే. తెలుగును వెలిగించటం. తెలుగుదనాన్ని బ్రతికించటం. నిజానికి వీరిద్దరికీ రావలసినంత కీర్తి రాలేదు. రమణగారి భాష తెలుగు కాబట్టి కొన్ని పరిమితులుండివుండవచ్చు, బాపూగారిది భాషతో వ్యాఖ్యానం అవసరంలేని బొమ్మ. ఎంత విశ్వవిఖ్యాతమవ్వాలి ఏదోఇచ్చామన్నట్లు నిన్న గాక మొన్న ఓ పద్మశ్రీ ఇచ్చారు. పోనీలెమ్మన్నట్లు ఆయనా పుచ్చుకున్నారు. నిజంచెప్పాలంటే ఇద్దరికిద్దరూ వట్టి అమాయకులూ అల్పసంతోషులూను.

ఇద్దరూ వేరువేరు శరీరాల్లో వున్నా ఆత్మ ఒకటేనన్నట్లుగా జీవించారు. నిజానికి రమణగారి నిష్క్రమణతోనే బాపూ గారి జవం పోయింది. జీవం ఇప్పుడుపోయింది అంతే.

 మనిషి ముఖంమీద నవ్వు వున్నంతవరకూ, తెలుగమ్మాయిలున్నంతవరకూ వారు మనతోనే వుంటారు. అందుకే మనవంతుగా ఆ ఇద్దరికీ నివాళులర్పిస్తూ వారి ఆత్మలకు శాంతిచేకూరాలని కోరుకుందాం.

చివరగా మనం ఓదార్చవలసిన వాళ్ళూ, హఠాత్తుగా పెద్దైపోయిన పిడుగులు "బుడుగు", "రెండుజళ్ళ సీత", "సీ గానపెసూనాంబ" ఎలావున్నారో పాపం!!
 - - -