స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఆలోచనలు

ఆలస్యంగా నిద్రకుపక్రమించానేమో
ఆలోచనలు ఆకాశాన్ని చుట్టి వస్తున్నాయి...
చుక్కల్ని పట్టేయడానికో
చందమామను చుట్టేయడానికో - కాదు
నాలో నన్ను వెదకటానికి
మనుషుల మధ్య
మారు వేషాలేస్తూ
మనసుకు వేసుకున్న
ముసుగులన్నీ విప్పేయాలని వుంది
చీకట్లో - నన్ను నేను
నగ్నంగా
చూసుకోవాలని వుంది
చీకటి - మనకి
ప్రకృతి ఇచ్చిన వరం...
తప్పించుకోటానికో
తప్పులు చెయటానికో - కాదు
మనల్ని మనం
మననం చేసుకోడానికీ
మనసుల్ని మధనం చేసుకోడానికీ
మర్నాడు
మానవత్వంతో
మనిషిగా వెలగటానికీ...