స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

15, జులై 2013, సోమవారం

మేక రాక పై...

( సుమారు గా ౩౦ సంవత్సరాల క్రితం హైదరాబాదు మల్కాజిగిరి లో ఒకరోజు రెండవ ఆట సినిమా "జష్టిస్ చౌదరి" చూసి వస్తుంటే విచిత్రంగా ఒక మేక వెనుకనుండి పరుగున వచ్చి మాతో కలసి నడవసాగింది. కొంతసేపటికి గమనించి ఎంత అదిలించినా పోకుండా మాతోనే యింటిదాకా వచ్చింది. పాపం ఏ కుక్కల తాకిడికో భయపడి వుంటుందని ఆరోజు మావయ్య గారింట్లోనే కట్టివేశాము. మరునాడు ఉదయాన పొదుగు నిండి బాధతో కేకలు పెడుతుంటే అమ్మ చూసి పాలుపితికింది. మావయ్య ఉదయమే వెళ్ళి ఆప్రాంతంలో తెలిసిన వాళ్ళకి ఈ విషయంచెప్పి దాని తాలూకు మనుషులెవరైనా వస్తే చెప్పమని చెప్పివచ్చారు. మర్నాడు వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళారు కధ సుఖాంతం అయింది. ఈ విషయం అక్కకు ఉత్తరంలో వ్రాస్తే ఇలా పద్యాల్లో జవాబు వచ్చింది. శ్రీలక్ష్మి పెండ్లి అంటే ఆ సినిమాలో మూగపిల్ల శ్రీలక్ష్మి పెండ్లి అన్నమాట.
శంకరాభరణం బ్లాగ్ లో  పద్య రచనాంశం "ఉపాయం"  లో యిచ్చిన బొమ్మ చూస్తే ఆనాటి సంఘటన గుర్తుకువచ్చింది. ఆనాటి స్మృతులను గుర్తు చేసిన వారికి ధన్యవాదాలతో )


[పింగళి మోహిని]

శ్రీలక్ష్మి పెండ్లి వేడుక
జాలీగా చూసి వచ్చు సమయము నందున్
నీలజలదమ్ము పోలిన
పాలిచ్చెడు మేక వెంట పడుటయు శుభమే!

పిలువ కుండగ నే మిమ్ము వెంటనంటి
బుజ్జగించినగాని తాఁపోవలేక
క్షీరమిచ్చుచు మీతోటి చెలిమి చేయు
మేకరాకడ మీకహా ! శుభము గాదె !

ఎవరిదొ ! ఎక్కడో ఉనికి ! ఏర్పడ చెప్పగలేము - దాని బం
ధువులను వీడి మిమ్ములను డాసిన కారణమేమొ ! స్వేచ్చ మై
నవనవ లాడుచున్ తిరుగు నల్లని మేక విచిత్ర రీతిలో
కవితకు మూలమైనిలచి ఖ్యాతిని గొన్నది ! వింత కాదొకో !