స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

17, ఫిబ్రవరి 2013, ఆదివారం

మహాభారతంలో తిక్కన దిద్దిన సుధేష్ణ 2


[ పింగళి వెంకట శ్రీనివాస రావు ]

"కామాతురాణాం నభయం నలజ్జా" అన్న ఆర్యవాక్కు అక్షరాలా నిజమైనది. కీచకుని కామవాంఛ జంకునకు చోటివ్వలేదు. సుధేష్ణ వాని మనసాతని ముఖవైఖరిని బట్టియే గ్రహించినది. వానిప్రవర్తనలో అసభ్యత, అసహ్యము తాండవమాడుచున్నవి.  ఆమె భయపడినట్లుగానే సైరంధ్రి విషయము ప్రస్తావనకు తేనే తెచ్చినాడు.  ముందుగనే ఈ సంఘటననూహించిన సుధేష్ణ తన మేధనుపయోగించి తమ్ముని మాటలు విననట్లు నటించి వేరుసంభాషణను పురస్కరించి వాతావరణమును తనకనుకూలపరచుకున్నది. కీచకుడు దీనితో కొంతహతాశుడయినాడు. అక్క వింతచేష్టితమునకు నిట్టూర్చి యందుండి వెడలినాడు. అక్క ఊపిరిపీల్చుకొన్నది. కాని అది ఎంతసేపు. పోయినవాడుపోక మరల వెనుదిరిగివచ్చినాడు. వదలిన దనుకున్న పీడమరల దగులుకొన్నది. సైరంధ్రిని సమీపించి ఆమె పట్ల ఎంత అసభ్యత ప్రదర్శింపవచ్చునో అంతయునూ ప్రదర్శించినాడు.  తన మక్కువ అక్కవలననే తీరవలయునని నిర్ణయించుకొని అక్కనే శరణుజొచ్చినాడు. మదనావేశము పూర్తిగా తలకెక్కినది. అతని వేగిరపాటును జూచిన సుధేష్ణ కర్తవ్యోన్ముఖురాలయినది. వలదని చెప్పినా వినువాడుగా కానరాలేదు. దైవమా! యని ఒకసారి ఆకసమును జూచి భగవంతుని స్మరించినది. తమ్మునియధర్మ కృత్యమునకు విచారపడినది. ధర్మమామెను తట్టి హెచ్చరించినది. సైరంధ్రి గతియేమి కానున్నది. కీచకుని కామాగ్నికి ఆహుతి కావలసినదేనా? ఆమె నీవిపత్తునుండి కాపాడుటెట్లు? గుండెలు దిటవుజేసుకొని ఎటులైన తమ్మునికి చెప్పి చూతమని ప్రారంభించినది. తెనాలివారి నిగమశర్మ అక్క పాత్రనియ్యెడపోషించినది. తమ్మునితో ప్రేమను పురస్కరించి లాలిత్యముతో... పిచ్చివాడా! అప్సరసలవంటి అనేకమంది కాంతలు నీపొందును గోరుచుండగా నీరసాకారమైన సైరంధ్రి నీ కేల నాయనా!? యని లౌక్యమును బ్రదర్శించుచూ అనునయించినది. వాని పొందును తమంతతాముగా ఇష్టపడుకాంతల వైభవమును సుఖమును అతిశయించి వివరించినది. ఆ వివరణాత్మకధోరణిలోని తిక్కన మహాశయుని మృదుమనోజ్ఞ పదలాలిత్య పద్యరత్నంఇది. 


సీ:   లలితంబులగుమట్టియల చప్పుడింపారనంచకైవడి నడనల్లవచ్చి
      యెడమేని నెత్తావి సుడియంగ పయ్యెదసగము దూలించిపైమగుడదిగిచి 
      సోలెడునెలతీగ లీల గ్రాలుచు వింత చెలువంబు దలకొనజేరినిలిచి
      తెలిగన్నుగవకు నెచ్చెలియైన లేత నవ్వొలయంగ సరసంపు బలుకుపలికి

తే.గీ: మెరయు చెయ్యలరాగంబు మెయికొనంగ
      నెడదసొగయించుమాటల నెలమి మిగుల
      నిన్ను ననురక్తి గొలుచు నన్నెలతలుండ
      నీరసాకారసైరంధ్రి గోరదగునె!?

యెంతగొప్ప విషయమైనా అదిమనకు ఇష్టం లేకపోయినా ఇతరులకు దానిపై విరక్తి కలిగించాలన్నా దానికి లేనిపోని అపభ్రంశాలన్నీ కల్పించి దానిమీద అసహ్యం పుట్టేలా వర్ణించి చెప్పడం సాధారణంగా జనసామాన్యంలో జరుగుతూ వుండే విషయమే. సరిగ్గా అదే చేసింది మన సుధేష్ణ.  అయితే కీచకుడేమయినా మాటలురాని వాడా? "నాకొలువు వారుకాద న్నాకేశుని గొలుచు నంగనలలోనైన నిట్టిచెలువము కానరాద"ని నిష్కర్షగా తేల్చిచెప్పినాడు. సుధేష్ణ మార్మిక వాదమువీగిపోయినది. 
అయినను ఆమెపట్టుసడలించలేదు. ప్రభుశాసనమునకు లొంగువాడు కాదని ఆమెకు తెలుసు. అందుకే చివరి అస్త్రముగా ధర్మమునాశ్రయించినది. పరకాంతల బలాత్కారపు పొందుధర్మ విరుద్ధమురా నాయనా! యని గడ్డము పట్టి బ్రతిమాలిచెప్పినది. అట్టి అధర్మమునకు పాల్పడిన వారి పూర్వ సంఘటనలెన్నియో వివరించినది. ఇట్టిధర్మ ప్రవచనములు కీచకుని చెవికి సోకునా? ఇదియును అడియాసయే అయినది కడపటి అస్త్రముగా తనపెద్దరికమును పణముగాపెట్టినది. దీనితోనైనా తమ్ముని దుష్ప్రవర్తన మారుతుందేమోనని ఆశించినది. కాని ప్రయోజనం లేకపోయినది. మదబలగర్వితుడు, కామోన్మాది అయిన కీచకుని ప్రత్యుత్తరము హద్దులు దాటినది. అక్క పెద్దరికమును విస్మరించినాడు. మమతను అనురాగమును మంటగలిపినాడు. సంబోధనలోనే తన అహంకృతిని వెళ్ళగ్రక్కుచూ కీచకుని నోటపలికించిన తిక్కన గారిపద్యమిది. 

మ: వనితా! యేనొకపల్కుపల్కెద జతుర్వారాశి మధ్యంబునన్ 
      ఘన బాహాబలమొప్పనన్ను నెదురంగా నెవ్వడుంలేమియె
      వ్వనికిందెల్లముగాదె? దాని మగలున్ వజ్రాహతింగూలుశై
      లనికాయంబన మధ్భుజా సమదలీలన్ గీటడంగెంచెదన్"

అని బీరములు పలికి "నీవు నామేలుగోరుదానవే అయిన మారుమాటాడక నా అభీష్టమును పాటించి నెరవేర్చు" మనియామె పాదములపై సాగిలపడినాడు.  సున్నిత మనస్విని సుధేష్ణ యెట్టి ధర్మసంకటమున బడినదో గమనింపుడు. తమ్ముడను పక్షపాతమొకవైపు దాని మగలు గంధర్వులే! తమ్మునకేమియెగ్గు తలపెట్టెదరో! యన్న భయమొకవైపు. ధర్మగ్లాని జరుగుచున్నదే! యన్నవెరపొక వైపు, కొంత సైరంధ్రి పట్లసానుభూతి మరికొంత. తమ్ముడు అవివేకి అయినాడే! అన్నదిగులింకొంత. ఇవి అన్నియు పెనగొని సుధేష్ణ మస్తిష్కమున పెనుతుఫాను చెలరేగినది.  ఆమె కనులనుండి భావనార్ద్ర బాష్పకణధారలు జాలువారినవి. ఈ సంకటస్థితి లో ఆమెగాకున్న మరియొక సామాన్య వనిత ఈ విచికిత్సకు యెదురు నిలిచి మనగలుగునేమో యోచింపుడు. 

కఠినమైన ధర్మ నిర్వహణము అసిధారావ్రతము వంటిది. ఆందామె కృతకృత్యురాలు కాలేకపొయినది.  స్త్రీ హృదయము కదా! సోదర ప్రేమ ముందు లొంగిపోయినది. అప్పటికీ ఇరుపార్శ్వముల నుంచి ఆలోచించినది. మన్మథ శరాగ్నికీలల చేతగాని గంధర్వుల గుప్త ప్రహారముల చేతగాని తమ్మునకు చావు తప్పదు. అయిన అధర్మమునకేల పాల్పడ వలె? అవును. అయినచో ఇంకొక సున్నిత విచారణ చేసెదగాక! "ఇప్పట్టునగీచకుని దిరస్కరించిన వాడు యెదిరించి నిలుచుననుకొందము.  అప్పుడు తనకీకాస్త పెద్దరికమునూ దక్కదు సరికదా! అప్పుడు రాజు విరటుని గతియు, ఆపై నా గతియు నేమికావలయును? కీచకుని క్రోధము సద్యస్కాలఫలప్రదము కదా! సైరంధ్రిని కైవశించెనే అనుకొందము. గంధర్వులు వీని నెదిరించగలరా?

నేటి బలవంతులలో సాటి లేని మేటి వీడు. గంధర్వులు వీనిని గెలువ సాధ్యము గాక మిన్నకున్నచో అపుడు అక్క తన అభీష్టమునకడ్డు వచ్చినదన్న అలుక నాపై శాశ్వతమగును గదా! అన్నిటినీ మించి తనను వెన్నుదన్ని రక్తమును పంచుకొని  పుట్టిన తోబుట్టువు అన్న ప్రేమ పాశము వైపే త్రాసుముల్లు మొగ్గుజూపుచున్నదే! దానికేమి సమాధానము చెప్పగలను." ఈ విధముగా సుధేష్ణ వితర్కించుకొన్నది. ఇట్టి విషమ సంకటమునజిక్కి చివరకు ఒక నిర్ణయమునకు వచ్చినది. ఉపాయము కూడా ఆలోచించిపెట్టుకొన్నది. తమ్ముడిని ఊరడించి పంపివైచినది. ఇక తరువాత ఘట్టమునకు తెర లేచినది. సుధేష్ణ సైరంధ్రి ని రావించినది. లేని అస్వస్థతను నటించినది. సైరంధ్రితో కవిబ్రహ్మ వాక్యములలో ఇట్లున్నది.

కం|| పదవెదు తృష పెల్లిదము న
      వదనము వరువట్లు వట్టెవాసిత రాజ
      న్మదిరారస మానగ నా
      హృదయంబున వేడ్కయెసక మెసగెడు తరుణీ!

కం|| కీచకుని ఇంటనెప్పుడు
      వాచవియగు బహు విధముల వారుణి గలుగున్
      వేచనియిచటికి గొనిర 
      మ్మా! చూతముగాని నీ గమన వేగంబున్.

సుధేష్ణ పలికిన మర్మపు మాటలు విని సైరంధ్రి విషయము గ్రహించినది. తానచటికి యేగుట అనుచిత కార్యమగుననుచూ తొలుత చేసిన బాసను ఙ్ఞప్తికి తెచ్చినది. సుధేష్ణ ఉలిక్కిపడినది. తాను చేయుచున్నది అధర్మమని యంతరాత్మ తట్టి ప్రబోధింనది. ఆమె వాస్తవికత దురపిల్లినది. మనో, బుద్ధులు ఆలోచించినవి. కానీ అహంకార చేతనముదే పైచేయి అయినది. తను చేయబోవునది అనుచిత కార్యమని తెలిసియూ తమ్ముని ముచ్చట తీర్చుటకే ఆ మగనాలి కట్టుబడినది. కపటగాంభీర్యమును ప్రదర్శించి సైరంధ్రి తో మేలపు మాటలు తెచ్చి యతికించుకొని పలికినది. అది మనకు పరాయి గృహము కాదనియు, అచటి వారి హృదయములలో నీ ఉనికి శ్లాఘనీయమనియు, వారిని నీవటు భావించుట మరియాద కాదనియూ హితము చెప్పుచునే నిష్ఠురోక్తులు పలికినది. మన కలయిక మొదలు ప్రసంగ వశమున వారికి నీ గుణోన్నతులు వర్ణించి చెప్పుదునని మెచ్చుకోలు మాటలు పలికినది. నీవిట్లనుట " నెయ్యము తియ్యము కల్మియే"యని అనునయ నిష్ఠూరములాడినది. సఖీ! అని సంబోధించి చెలువమును ఇనుమడించినది. బ్రతిమాలినది. ప్రార్ధించినది.

సైరంధ్రి సుధేష్ణను "అత్యంత కలుషాత్మ"గా భావించినది. ఆమె అట్లు భావించుటలో వింత లేదు సరి కదా! న్యాయము కూడా ఉన్నది.  ద్రౌపది సైరంధ్రి వేషము ధరియించి పరుల ఇంట ఊడిగము చేయ తలపెట్టిన కారణము వేరు. తానిప్పుడు గట్టిగా సుధేష్ణను ధిక్కరించిన మూల కారణ ప్రయోజనమునకు భంగము వాటిల్లును. ఆమె విఘ్న నిహన్యమాన. పూర్తిగా దైవం మీద భారము వేసినది. కీచకుని ఇంటికి వెళ్ళినది. తాను ఊహించిన ఘట్టమే యెదురయినది. వాని బారినుండి తప్పించుకొను ప్రయత్నములో పరుగులెత్తినది. వాడు వెంటపడినాడు. విరటుడు కొలువుదీరి యున్న సభామందిరసమీపమున వెనుక పాటుగా కాలితో తన్నినాడు. ఆమె భయవిహ్వలయై క్రిందపడి ధూళిధూసరితయై లేచి శోకమూర్తివలె సభను ప్రవేశించినది. ఈ ఘట్టము తనభర్తలతో సహా సభాసదులందరు తిలకించినారు. ధైర్యము చేసి విరటుడు వారింపగా కీచకుడు వెనుదిరిగినాడు. సైరంధ్రి సభను నిలదీసినది. కంకుభట్టు మందలింపుతో సుధేష్ణవద్దకు వెళ్ళినది. సుధేష్ణ ఏమియు ఎరుగని నంగనాచివలె ఇలా మాట్లాడినది. "ఇంతభయవిహ్వలవై కంపించు చున్నావేమి? శరీరమంతయు దుమ్ముకొట్టుకొనియున్నదేమి? ముఖమంతయు మేఘావృతమైన చంద్రబింబము వలె చెమటలతో కళావిహీనమైనదేమి? నిన్ను పరాభవించినవారెవ్వరైననూ వారినిప్పుడే చంపివేసెదను" అంటూ నయగారపు ఇచ్చకములు పలికినది. ఆమె పలుకులు విన్న సైరంధ్రి ఆమెను మహాజంతయని మనసున భావించినది. 

తరువాత విరటుని పనుపుమేరకు సుధేష్ణ ఆమెను నిన్ను జూచిన మగవారు మన్మథ శరాగ్నికీలలజిక్కి మతులుకోల్పోవుచున్నారు. మరియొకచోటికి వెళ్ళి నీ గడువు పూర్తిచేసుకొనుము అని తేల్చి చెప్పినది. సైరంధ్రి అమ్మా! ఎటులో ఇంతకాలమూ భరించితివి. ఇంకొక పదమూడు దినములు మాత్రము నీయొద్దనుండనిమ్ము. నా భర్తలు నీరాజుకు, రాజ్యమునకు మేలుచేయగలరు అని సహజ వినమ్రయై అర్థించినది. సుధేష్ణ నారాజును, నా సుతులను కాపాడమని అర్థించి, యుండుటకు అంగీకరించినది.  కథా సంవిధానముతో తాదాత్మ్యము చెందక తీరమునుండి పరిశీలనా దృష్టితో జూచిన యెడల సహజగుణశీలయైన సుధేష్ణ పుట్టినింటిమీద మమకారమునకు అసిధారాసదృశమైన ధర్మనిర్వహణకు నడుమ జరిగిన ఘర్షణలో విధివంచితయై ఓడిపోయిన మన తోటి భారతీయుల ఆడపడుచును క్షమాపణదృష్టితో మనమాదరింపకున్న చరిత్రలో ఈమెను "పాప" మని మన్నించువారెవరుందురు? 
     **  **  **  **  ** 


12, ఫిబ్రవరి 2013, మంగళవారం

మహాభారతంలో తిక్కన దిద్దిన సుధేష్ణ-1

[ పింగళి వెంకట శ్రీనివాస రావు ]

మహాకావ్య నిర్మాణం ఒక అరుదైన అపురూప కళాసంపద. దీనికి కేవలం భాషా పాండిత్యం ఒక్కటే సరిపోదు. కవికి ఇతివృత్తంలోని పాత్రలహృదయములను తనకనుసన్నల నర్తింపజేయగలనైపుణ్యత అవసరము. వ్రాయునపుడు ఇతివృత్తములోని ప్రతిపాత్రకు తగినంత న్యాయము చేకూరినదా? అనువిచికిత్సకు అవకాశముండదు. తనువ్రాయతలపెట్టిన కావ్యమునందలి ఇతివృత్తమే కనుచూపుమేర మహాసాగరమువలె కన్పట్టుచుండును. అట్టియెడ నిర్మాణకుని దృష్టియావత్తు కావ్యనాయికా నాయకుల పాత్రల చిత్రీకరణ యందే లగ్నమగుచుండును. కాని ప్రతినాయకుని యొక్క, మధ్య మధ్య వచ్చు అల్పపాత్రల యొక్క చిత్రీకరణకు విషయమునకు అంతగా ప్రాధాన్యత ఇచ్చుట అరుదు. ఒకవేళ ఎవ్వరేని ఇట్టివిషయమున జాగరూకత వహించిననూ పూర్తిగా కృతకృత్యులు కాలేకపోవచ్చును. అయిన నిట్టి నిశితపరిశీలన సామాన్య సృష్టికర్త అయిన రచయితకు కేవలం గగనకుసుమ సదృశమేనా?! అవునని చెప్పుటయెంతమాత్రము సమంజసము కాదు. అరుదనిమాత్రమే చెప్పగలము.

అందుకై ప్రయత్నించి కొంతవరకు కృతకృత్యుడైనవాడే "మహాకవి" అని అనిపించుకొనును. ఇది ఒక అలంకారశాస్త్రమునకు సంబంధించిన విషయముగా పరిగణింతురు. మొత్తంమీద ఇట్టి కావ్యరచనా విధానము అసిధారావ్రతము వంటిది అనుటలో అతిశయోక్తిలేదు.

తనరచకు తానే పరవశుడైన కవి అంతవరకు కూలంకషముగా సాగిన కవితాధారకు తానే అడ్డుకట్ట కాగలడు. ఈవిషయమున ఉభయకవిమిత్రుడు కవిబ్రహ్మ అయిన తిక్కన సోమయాజి సాటిలేని మేటికవి అనిపించుకొన్న సుప్రసిద్ధ మహాకవి.