Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

25, ఆగస్టు 2012, శనివారం

రామాయణం (మంజరీద్విపద)



(సేకరణ : శశిధర్ పింగళి )


దశరరధుడను రాజు | ధరయేలుచుండె
వానికి మువ్వురు | భార్యలు కలరు
నలుగురు కొడుకులు | నాల్గురత్నములు
కౌసల్య శ్రీరాము | కన్నట్టి తల్లి
కనియె సుమిత్ర | లక్ష్మణ, శత్రుఘ్నులను
భరతుండు యాకైక | గర్భమున బుట్టె
ఆ నలుగురును గూడ | అతిబాల్యమందె
అన్ని విద్యలు నేర్చి | రతిశ్రద్ధతోడ

రాజులందరి లోన | రామచంద్రుండు
విలువిద్యలో చాల | పేరుగన్నాడు

ఎట్టివారును బట్టి | యెత్తలేనట్టి
శివునివిల్లెక్కిడి | స్త్రీరత్నమైన
సీతను పెండ్లాడి | శ్రీరామమూర్తి
కడుకీర్తి గన్నాడు | కల్యాణ మూర్తి

తండ్రిమాటను నిలుప | తలచి రాముండు
ఘొల్లు ఘొల్లున ప్రజలు | గోలపెట్టంగ
పయనమై అడవికి | బయలుదేరంగ
అతని వెంటనె బోయి | రతిభక్తితోడ
తమ్ముడు సౌమిత్రి | తరుణి సీతమ్మ
కడుభయంకరమైన | కాననంబులకు

అన్నకు వదినకు | అనువైనయట్లు
లక్ష్మణ పర్ణశాలను కట్టియిచ్చె
(పర్ణశాలను కట్టె | భ్రాత లక్ష్మణుడు)

ఆపర్ణశాలలో | ఆ యాలుమగలు
సుంతలోపము లేక | సుఖముగానుండ
ఘనులైన రామ | లక్ష్మణులు ఇంటలేని
సమయమ్ముజూచి | వేషమెల్లను మార్చి
రాక్షసరాజైన | రావణాసురుడు
ఆదిలక్ష్మిని సీత | నపహరింపంగ
సీతకై దుఃఖించి | శ్రీరామమూర్తి
సుగ్రీవుతోమైత్రి | సొంపుగా జేసి
తనసేననెల్ల యాతడు | సిద్ధపరుప
వావితోడుత | మేటి వారధిందాటి
రావణు కడదేర్చె | రామభద్రుండు

తమ్ముని తోడను | సీతాదేవి తోడ
తనపట్టణంబునకు | తా జేరుకొనియె

మా రామచంద్రుండు | మముగన్న తండ్రి
మా లక్ష్మణ స్వామి | మా తల్లి సీత
మాకంటబడినారు | మా భాగ్యమనుచు
ఉప్పోంగి రప్పుడు | అయోధ్యలోప్రజలు

మనరామ చరితంబు | మనసార మీరు
బాలబాలికలార | పాటపాడండి!!

****

9, ఆగస్టు 2012, గురువారం

చూడాలని వుంది


( శశిధర్ పింగళి )
*** టీనేజి ప్రాయంలో తీగతొడిగిన కవిత ***

నేజూచిన కన్నులు నాలో -
కలిగించెను కమ్మని భావనలేవో
అనిపించెను నాలో నాకే  -
అవి కన్నులు కావేమో?
వికసించిన ..
నల్లని కలువల జంటేమో! నని
ఆ..... నల్లని కాటుక కన్నులలో
యే మత్తుందోగానీ - మరి
అరె !
రావే నాచూపులు విడివడి -
బుద్ధేమో తప్పని చెబితే
మనససలా మాటే వినదే!
పైగా - ఎదురడిగెను నన్నే-
అసలా కన్నులు చూడని కనులెందుకని?
ఇది నిజమా? యని నీవనవచ్చును
నీ వెరుగవు -
నే పలుకునదంతా ప్రత్యక్షర సత్యంబని
ఇంతవినీ నీ వడిగెదవేమో!
ఆ కన్నులలో యే ముందని?
ఆ కనులు .. కాదు - కాదు
నా పాలిట వలపు గనులు
ఆ కన్నులలో ...
చిరువెన్నెల చల్లదనం వుంది
మరుమల్లెల కమ్మదనం వుంది
చేమంతుల చిలిపిదనం వుంది
ఆ చూపులలో ...
మనసెరుగని తీయదనం వుంది
నే కోరిన సర్వస్వం - వుంది
అంతెందుకు... నా
బ్రతుకంతా ఆ కన్నులనే
చూడాలని వుంది
చూస్తూనే - కాలం
గడిపేయాలని వుంది.
      ***

3, ఆగస్టు 2012, శుక్రవారం

కోతి ప్రశ్న / కొంటె ప్రశ్న

(శశిధర్ పింగళి)

శ్రీరాముడు కోతులతో
సీతను విడిపించగ
అండగ లక్ష్మణుడుండగ
దండయాత్ర వెళ్ళినాడు.

రావణాసురుని జంపె
రాముడు తన బాణంతో
రాక్షసులనందరినీ
రాముని సైన్యం జంపెను

సీత తల్లి క్షేమముగా
శ్రీరాముని దరిజేరగ
అందరు జనులూ కని
ఆనందంతో పొంగినారు

చిన్న కోతిపిల్ల ఒకటి వచ్చి
శ్రీరాముని అడిగెనిట్లు
జానకి అందరికన్నా
చక్కనిదని అంటారు

ఆతల్లిని చూడాలని మా
కోతులన్ని కోరినాయి

చిన్న నవ్వు నవ్వి పలికె
శ్రీరాముడు జయరాముడు
అడ్డులేదు సీతమ్మను
అంతా చూడండి రండి

సాయంత్రము కోతులన్ని
సభదీరిచి కూరుచుండె

సీత వచ్చి సభలోగల
కోతులన్నిటికీ కనబడె
సీతమ్మను చూడగానె
కోతులు పళ్ళికిలించెను

ఆంజనేయుకడకు వచ్చి
అడిగినాయి ఒకసంగతి
జానకి ముల్లోకములా
చక్కనిదని అన్నారే?

ఆ చక్కని తల్లికి
తోకైనా మరి లేదే?

కోతిపిల్ల అడిగినట్టి
కోతిప్రశ్న కెవరైనా
జవాబు చెబుతారా
సవాలు చేస్తున్నా మరి!
***
( చిన్నప్పుడు ఈ పాటని అమ్మ దగ్గర నేర్చుకున్న గుర్తు. మళ్ళీ తన దగ్గర వ్రాయించుని మీకోసం వుంచుతునాను.)