Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

29, నవంబర్ 2011, మంగళవారం

అన్వేషణ

     [పింగళి శశిధర్]

     చీకటి  -
     నా అన్వేషణకి అంతరాయం కలిగిస్తూ
     అవనిపై ఆక్రమించుకుంటోంది
     నిన్నటిదాక నేస్తాలై
     నా చుట్టూ వున్న చెట్టూ చేమలన్నీ
     వికృతరూపాలై వికటాట్టహాసం చేస్తున్నాయి
     చర్మ చక్షువులు నిశ్చేష్టలై
     నీరసించి నిద్రలోకి జారుకుంటున్నాయి
     బాహ్యేంద్రియాలు సైతం చేష్టలుడిగి
     అచేతనంగా పడివున్నాయి
     మూసిన కనురెప్పల క్రింద
     మూతపడని ఆలోచనా లోచనాలు మాత్రం
     అన్వేషణ సాగిస్తూనే వున్నాయి
     అయితే
     చీకటి నిండిన బాహ్యంలో కాదు
     అంతరంలో
     అంతరమంతా శూన్యం -
     శూన్యంలోనే తరంగదైర్ఘ్యాలు పుడుతూవుంటై - పోతూవుంటై
     దాటి సాగితే - దూరంగా...
     వెలుగులు చిమ్ముతూ ఓ కాంతిరేఖ
     చీకటిని చీల్చుకుంటూ...
     చూచిన కన్నులు చెలమలైపోతున్నాయి
     ఆనందసాగరానికి ఏతమెత్తినట్లు
     అశ్రుధారలు ప్రవాహమై పారుతున్నాయి
     అటువైపే నా పయనం
     ఆగని నా ప్రయాణం
     క్షణకాలం మెరిసిన మెరుపు వెలుగు లో
     చూస్తే, నే దాటొచ్చిన దూరం యాభై మైళ్ళు
     గమ్యం నిర్ధారితమైంది - చేరుకోవాలనే
     లక్ష్యం నిర్దేశితమైంది
     ప్రయాణం సాగుతూనే వుంది
     వెచ్చని వూపిరులేవో ఒడలెల్లా తాకుతూవుంటే
     ఒడలిన కంటి కుసుమాలు కొత్త జీవంతో విచ్చుకుంటున్నాయి
     బడలిక తీరిన బాహ్యేంద్రియాలు చేతనత్వాన్ని నింపుకుంటున్నాయి
     చీకటిని జయించిన వేకువ
     వెల్లువలా విరుచుకు పడుతోంది
     మళ్ళీ మొదలైంది అన్వేషణ
     అయితే ఈసారి బాహ్యంలో కాదు
     అంతరంలో.....

12, నవంబర్ 2011, శనివారం

మనోహరి !

    [ శశిధర్ ఫింగళి ]

నాశాంత తనుకాంతి ఆశాంతమై తోచు
      నా కాంత కను కాంతి చంద్రకాంతిని త్రోచు
నా రాణి పాదాల పారాణి వెలుగులే
      ప్రాగ్భాగమరుణిమై ప్రభలు చిందు
నా బాల ఫాల మర్ధచంద్రుని బోలు
      ఆ నీలి కురులలో నెరితుమ్మెదలు వ్రాలు
నా కలికి గొంతులో కులుకు కోయిల కూన
      ఆ కులుకు పలుకులో కురియు తేనెలవాన
నా రాగ సుందరీ నాట్యమాడెడివేళ
      అచ్చంపు రాయంచలడుగులొత్తు
నా వాణి వేణిలో విరియు మల్లెల సౌరు
      సొక్కి విహరించు నా యెడద యెక్కి వెన్నెల తేరు
నా లేమ వనసీమ నడయాడు సమయాన
      పసిడి పచ్చని చేలు పాటపాడు
నా చాన చనువార చెయిసాచి పిలువంగ
      సింహ, శార్దూలముల్ చెలిమి చేయు
నా సఖియ వెలయించు సౌహార్ద్రతను చూచి
      సూర్యుడంతటి వాడు సుధలు కురియు
నా తరుణి గుణగణాల్ నా తరమె వర్ణింప
      దాన సరితూగు చానలీ లోకాన లేరన్న
అతిశయోక్తులు కావులే అతివలార -
ఏ పూర్వ పుణ్యమో -  ఏ పుణ్యఫలితమో
అతివ రూపాన నాకొరకె అవతరించి
వలపునిండిన గుండెతో నను వరించె.