Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

7, సెప్టెంబర్ 2016, బుధవారం

ప్రతీక్ష !

[శశిధర్ పింగళి] 

ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్నాను..
నువ్వొస్తావనీ నీతో
ఎన్నెన్నో కబుర్లు చెప్పుకోవాలనీ
కలలు కన్నాను
పచ్చని ఙ్ఞాపకాల మంచె మీద - మనం
ఆకాశాన్ని చూస్తూ జారిపోయిన
గతాన్ని గుత్తులు.. గుత్తులుగా
గుర్తుచేసుకుంటూ గడపాలని .. ఓ
చిన్ని కోరిక..
నీవొస్తావన్న ఆశ.. వస్తున్నావన్న వార్త
నాలొ ఉద్వేగాన్ని నింపుతోంది..
ఉవ్వెత్తున లేచే సంతోష తరంగాలు
అమాంతంగా మీదపడి .. బయటకీ
లోపలకీ నిలకడలేకుండా నడిపిస్తున్నాయి
తీరా నువ్వొచ్చాక..
కాలునిలువని కాలం.. నిన్నూ
తనతో పాటు తీసుకెళుతుందన్న
నిజం - నన్ను
నిర్వీర్యుణ్ణి చేస్తుందేమో..
నీతో గడుపుదామనుకున్న మధుర క్షణాలు..
మంచు బిందువుల్లా కరిగిపోతాయేమో..
ఆనందం ఓ ప్రక్కా.. భయమో ప్రక్కా
జమిలిగా నన్ను చుట్టేసుకుని..
మూగవాణ్ణి చేసేస్తాయేమోనని చిన్న సంశయం! ​
ప్రత్యక్షానుభవం కంటే
ప్రతీక్షానుభవమే ఆనందంగా తోస్తుంది..
అందుకే .. నాకు
పండుగ రోజుకంటే.. పండుగ
ముందురోజంటేనే.. ఇష్టం!?
...............

6, ఆగస్టు 2016, శనివారం

ఉంగరమ్మునిచ్చి ఊరడించినదేమొ!?

తొలుతపుట్టినాడు తొలిభాగమైతాను
తనదు సగముకొరకు తనరువేళ
ఉంగరమ్మునిచ్చి ఊరడించినదేమొ
అర్థభాగమిచ్చి ఆదరించె.

15, జులై 2016, శుక్రవారం

మాయింట్లోనూ ఓ ఆషాఢం!!!?

(శశిధర్ పింగళి)
ఆషాఢం పేరుచెప్పగానే (కొత్త) అల్లుడి గుండె గుభేల్ మంటుంది తెలుగువారిళ్ళలో. కోరితెచ్చుకున్న పెళ్ళాన్ని కర్కశంగా తీసుకుపోయే మామని చూస్తుంటే మండుకొస్తుంది ఆల్లుడికి. ఒక నెలేకదా అని మామగారూ, ముప్పైరోజులా అని అల్లుడూ గిల్లుకుంటూ వుంటారు. ఆ ముప్పైరోజులే ముప్పై సంవత్సరాలుగా గడిపిన గతాన్ని తల్చుకుని నవ్వుకుంటాడు మామగారు. ఆ ముప్పై రోజుల్ని గంటల్లోకీ, నిమిషాల్లోకీ, సెకండ్లలోకీ విడగొట్టుకుని గుండె బేజారై తలపట్టుకు కూర్చుంటాడు అల్లుడు. తనకీ అంతబాధావున్నా కనపడనీయకుండా, తండ్రి సంతోషంలోనూ, భర్త బాధలోనూ వారికి తనపైవున్న ప్రేమను వెతుక్కునే ప్రయత్నంలో వుంటుంది కూతురు. అల్లుడికైతే  ఆషాఢాన్ని కనిపెట్టిన వాడి కాళ్ళు విరిచేయాలన్నంత కోపం వస్తూవుంటుంది.
అతని చేత బలవంతంగా ’బై’ చెప్పించు కుని వెళ్ళిపోతుంది భార్య.
ఆ క్షణంనుంచి కాలం కుంటటం ప్రారంభిస్తుంది.
ఆరోజునుంచి పూటగడవటమే కష్టమౌతుంది. క్షణమొక యుగంగా గడుస్తుంది.
"శాస్త్రిగారూ ఆషాఢమాసం ఎన్ని సంవత్సరాలండీ" అంటూ ఆరా మొదలుపెడతాడు. "ఒక సంవత్సరమే బాబూ" అని ఆయన సమాధానం. గడవని కాలాన్ని గణించి గట్టెక్కాలని అతగాడి ఆరాటం. తొలి సంవత్సరమేలే ననేది ఆయన తాత్పర్యం.
***
అసలు ఆషాఢానికీ విరహానికీ అనాదిగా వస్తున్న అవినాభావ సంబంధం ప్రత్యెకంగా చెప్పనవసరంలేదు. ఎందుకంటే కాళిదాసు వ్రాసిన మేఘసందేశం ఆషాఢమాస వర్ణనతోనే ప్రారంభమౌతుంది. ఒకానొక యక్షుడు శాపగ్రస్తుడై భార్యకు దూరంగా వుండవలసిరావటం, తా ననుభవించే విరహ బాధను ఓ మేఘుడిద్వారా భార్యకు కబురుపంపటం చాలా మనోహరంగా వుంటుంది. ఏ వ్యక్తికైనా సంయోగం ఎంత సంతోషాన్నిస్తుందో వియోగం అంతే బాధాకరమన్న విషయం సార్వజనీనమే.
ఆసలు దేని విలువైనా అదిలేనప్పుడే తెలుస్తుందన్నది కూడా అంతే నగ్న సత్యం. మనిషిలోని నిరంతర చింతనాశీలత్వంవల్ల బాధ మరింత ప్రబలమౌతుంది. మిగతా సృష్టినుండి మానవుణ్ణి వేరుఛేసేది ఈ ఆలోచనే కదా. ఆలోచించటం, ఆరాటపడటం, అనుభవించడం,  అనుభూతుల్ని నెమరువేసుకోవటం వంటి  చిత్తజనితమైన వుద్వేగాల్ని అందంగా వ్యక్తీకరించడం మనిషి యొక్క ప్రత్యేకత.
తెలుగు వారికి ఆషాఢం ఒక పండుగ. తెలుగు  పండుగలు మొదలయ్యేది ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశితోనే. అదే తొలి ఏకాదశి. కూతురుకి పెండ్లిచేసి అత్తవారింటికి పంపిన తల్లిదండ్రులకు ఈ నెల నిజంగా పండుగే. అయితే నూత్న వధూవరులకు మాత్రం పైన చెప్పిన యక్షుడి శాపకాలంలాంటి ఒక గడ్డుకాలమే. సాధారణంగా మనకి మాఘమాసం పెళ్ళిళ్ళకు అనుకూలమైన కాలం.ఈ కాలంలో పెళ్ళై కొత్తజీవితాన్ని ప్రారంభించిన నూత్న దంపతులకు కష్టకాలమే మరి. కొందరికి వైశాఖంలోనో, జ్యేష్టంలోనో పెళ్ళవుతుంది. వాళ్ళ పారాణి తడి తపన ఆరకముందే ఆషాఢం వచ్చిపడుతుంది . ఎంతకష్టంమో ఆలోచించండి. ఆసలీ ఆచారంవెనుక యేదోసాంకేతికమైన, భౌగోళికమైన వివరణలిస్తారుకానీ నామట్టుకు నాకు ఒకరి విలువ ఒకరికి తెలియడంకోసమే యేర్పాటుచేసారనిపిస్తుంది. ఎందుకంటే ఈకొద్దికాలంలోనే ఒకరినొకరు అర్ధంచేసుకొని, మానసికంగా దగ్గరై ఒకరకమైన బంధాన్ని, అనుబంధాన్ని యేర్పరుచుకొని వుంటారు. కొన్ని విషయాలలొ ఒకరిపై ఒకరు ఆధారపడిపోవడమూ కద్దు. ఈ యెడబాటు ఆ వెలితిని ప్రస్పుటం చేసుంది. తద్వారా ఇద్దరూకూడా విచక్షణాశీలురై మెలగుతూ బంధాన్ని మరింత గట్టిగా పెనవేసుకోవతానికి దోహదంచేసుంది. అందుకేనేమో ఆరుద్రగారొక పాటలో "ఎంత యెంత యెడమైతే అంతతీపి కలయిక" అన్నది.
ఇక ఈ యెడబాటు, విరహము చూసేవాడికి వినోదమూ, అనుభవించేవాడికి విషాదమూను. సమక్షంలో వున్నప్పుడు ఆలోచనలకు తావులేదు. వియోగంలో వున్నప్పుడే ఆలోచనలు ఆరాట పెడుతూ దహించి వేస్తుంటాయి.   దీనికి తోడు కాలమూ కక్షకట్టినట్లు కదలకుండా మొండికేస్తుంది.
మన పెద్దలు అత్తా-కోడలు, అత్తా-అల్లుడు ఒక గడప దాటకూడదు అంటూ కొంచెం నర్మగర్భంగా చెప్పారుకానీ ఇందులో అత్తగారికేపాపమూ తెలీదు. నిజానికి ఒక గడప దాటకూడనిది భార్యభర్తలే. అంటే ఒక గదిలోకివెళ్ళకూడదనిఅర్థం.  దీన్ని అర్థం చేసుకోకుండా అత్తగార్ని యాత్రలకు పంపించో, మాకత్తగారే లేదనో, మేమిద్దరం వేరేవుంటున్నంగా మాకు వర్తించదనో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
యెడబాటుని ఒక్క నెల రోజులు ఓపికబట్టలేనివాళ్ళు, రేపు పురిటికో పబ్బానికో పెళ్ళాం పుట్టింట్లోనూ, మొగుడు అత్తింట్లోనూ ఏ మూదునెలలో, ఆరునెలలో వుండవలసి వస్తే యెలా? "పయనమైతినన్న పతిమాట విన్నంత పడతి యుంగరంబు కడియమాయె" అంటూ ఓ కవి చమత్కరించాడట.  బెంగపెట్టుకోవడాలూ బక్కచిక్కిపోవటాలూ ఒకప్పటి మాట. ఇప్పుడీ అధునికయుగంలో, అందివచ్చిన సాంకేతిక ఙ్ఞానంతో కాలాన్ని, దూరాన్ని కూడా జయించేస్తున్నాం.  మేఘసండేశం ఒకప్పడు భావుకత, కవి కల్పితం. నేడది నిజం ప్రత్యక్షానుభవం. మనం పంపే సంక్షిప్త సందేశాలను చేరవేసేది మేఘుడే. (అంతర్జాలం పేరుతో క్లౌడ్ టెక్నాలజీ అదేగా)

"అన్నీ మన వేదాలలోనే వున్నాయిష" అంటూనో "పెద్ద  వాళ్ళేంచెప్పినా అంతా మన మంచికే" అనుకుంటూనో గడిపేయటం ఉత్తమం. ఈ నెలరోజులు తరువాతి సుదీర్ఘ వైవాహిక జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా వుంటుంది. ఈ నెల్లాళ్ళూ భర్తలకొచ్చే అలకలూ, వేసే వేషాలూ గుర్తుంచుకొని, తర్వాత్తరువాత సమయాకూలంగా వీటిని ఉటంకిస్తూ భార్యలు పండించే హాస్యానికీ కొదువుండదు.
అంచేత ఈ నెల్లాళ్ళూ తామేదో త్యాగంచేసేసామన్న భ్రమవీడి, ఇది మీ దాంపత్యానికి ఒక పత్యంగా భావించండి. ఆపై ఆనందం ఆరోగ్యం అంతా మీదే.

      సత్యంబుగ వధువరులకు
      నిత్యంబొక యుగముకాదె నీ యాషాఢము
      లో, త్యాగం కాదది దాం
      పత్యానికి పెద్దలిడిన పత్యంబదియే !

23, ఏప్రిల్ 2016, శనివారం

కలల నెలబాలు నుదరాన తలచుకొనుచు


[శశిధర్ ఫింగళి]

తే.గీ:  పులుపు కాయలు కనినంత పులకరించె
        కలికి మనమందు మధురోహ కలిగెనేమొ?
        చూపు త్రిప్పక నద్దాని చూచుచుండె
        కలల నెలబాలు నుదరాన తలచుకొనుచు