స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

24, సెప్టెంబర్ 2015, గురువారం

ఏరీతి మాబోంట్లు జేరగలరు ?

శశిధర్ పింగళి ]

ఎగిరేటి పక్షిపై తిరిగేటి నీ దరికి
          ఏరీతి మాబోంట్లు జేరగలరు ?

బుసకొట్టు పామెక్కి బోజ్జుండు నీ దరికి
          ఏరీతి మాబోంట్లు జేరగలరు ?

అలల సంద్రపుటింట అలరారు మీయింటి
          కేరీతి మాబోంట్లు జేరగలరు ?

అవతార ములపేర ఎవరింట నుందువో
          ఏరీతి మాబోంట్ల కెరుక గలుగు ?

కనుక, కరుణించి మాబోంట్ల కష్ట మెరిగి
ఆర్తి జేసిన ప్రార్థనలాలకించి
కరిని గాచిన కరముతో గాచి మమ్ము
చీరి నీచరణ పద్మాల జేర్చుకొమ్ము!

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

ముక్కంటి యేరీతి ముద్దులాడు ?

శశిధర్ పింగళి ]

తనమేన సగమైన తరుణి పార్వతితోడ
    ముక్కంటి యేరీతి ముద్దులాడు ?
తలపైన కొలువున్న నెలత గంగమతోడ
   శూలపా ణేరీతి జూఁపుగలుపు ? 
గజవక్తృ కేరీతి గౌరమ్మ ప్రేమతో
    కోరి తినిపించునో గోరుముద్ద ?
ఆరు మొగముల వాని నాదరమ్మున బిల్చి
    లాలించి యేరీతి పాలు కుడుపు ? 

 వెండికొండన మీయింట వింతశోభ
చూడ మనసయ్యె నొకసారి జూఁపవయ్య
నీదు ప్రమధుల మూకలో నాదరించి
కరుణ జూఁడుము మ్రొక్కెదన్ కరము లెత్తి!