స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

30, జూన్ 2015, మంగళవారం

నేనూ బ్రహ్మనే !

[ శశిధర్ పింగళి ]
అనంతానంత విశ్వంలో
అణుమాత్రంగావున్న నేను కూడా
బ్రహ్మనే!?
ఎందుకంటే
పుట్టినదగ్గర నుంచీ
పరివారం కోసమైతేనేమి
ప్రపంచం కోసమైతేనేమి
ప్రతిక్షణం - నన్ను నేను
క్రొత్తగా సృష్టించుకుంటూనే వున్నా...మరి !?

 = = = 

21, జూన్ 2015, ఆదివారం

మన్నిస్తావుకదూ.. నాన్నా!

[ శశిధర్ పింగళి ]

నీ మోకాళ్ళపై - నే
బొర్లా పడుకుని  బోసినవ్వులు
నవ్వుతూ ఊయలలూగే - ఆ
అపురూప క్షణాలు -  
పడుతూ లేస్తూ అడుగులేస్తూ
నిన్ను చేరుకున్న వేళ - నీ
కళ్ళల్లొ మెరిసే ఆ అనంద క్షణాలు -
నా  బంగరు భవితవ్యానికి
నీ కళ్ళతొ కలలు కంటూ
ఎదురు చూసే ఆ నిరీక్షణాలూ
అవిశ్రాంతంగా శ్రమిస్తూ కూడా
అర్ధ రాత్రిదాకా తోడుండే  నీ
అనురాగ వీక్షణాలు
నా కోసం త్యాగం చేసిన వెన్ని క్షణాలో
నాకోసం వీపున మోసిన వెన్ని వ్రణాలో
ఏ త్యాగమయమూర్తుల ప్రక్కనో నీకు
పీఠమేసి నిలబెడుతున్నాయి -
వేలుపట్టి నిలబెట్టిన రొజులే కాదు
వేలుకట్టి చదివించిన రొజులూ గుర్తే !
యెందుకు నాన్నా యివన్నీ అంటే
అమాయకంగా నవ్వే ఆ నవ్వూ -
అంతర్లీనంగా ప్రవహించే ప్రేమేమో
కళ్ళల్లొకి చిమ్మి చిన్నగా మెరుస్తుంది గానీ
మౌనం గీత దాటని మాట
కోరని వరాలిన్ని యిచ్చినా  యింకా- ఓ
కోరిక వుంది నాన్నా! తీరుస్తావా?
త్యాగాన్ని నీ వద్దే వుంచుకుని
ప్రేమానురాగాల్ని పంచి యిచ్చేసావ్
ఇప్పుడా త్యాగం కూడా నా కిచ్చేయవూ
రేపు - నాకు పనికొస్తుందన్న స్వార్థం కాదు
నాన్నా.. ఇక పై నీకా అవసరం లేదందుకే 
అడుగుతున్నా - ఇస్తావుకదూ .. మన్నిస్తావుకదూ!
                   ***

పిత్రుదినోత్సవ శుభాకాంక్షలు...