స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

29, మే 2015, శుక్రవారం

"పరమాత్మ నిలయం"

పరమాత్మ నిలయం

సిలికాన్ ఆంధ్ర - సుజన రంజని మే 2015 సంచికలో ప్రచురింపబడ్డ కథ. ఈ క్రింది లింకులో...
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2015/katha2.html

[శశిధర్ పింగళి]

సమయం ఉదయం 10.30 గంటలు మునిసిపల్ ఆఫీస్ అప్పుడప్పుడే చిక్కబడుతోంది హడవుడిగా వచ్చే సిబ్బంది తోనూ, ముందుగానే వచ్చికూర్చున్న సందర్శకులతోనూ.
పదిన్నర కావొస్తున్నా సీటుకు చేరుకోని సిబ్బందిని చూసి, మనసులోనే "వీరెప్పుడు మారుతారురా భగవంతుడా" అనుకుంటూ ఒకరిద్దరు సందర్శకులు మౌనంగానే తమ అసహనాన్ని ముఖంలో వ్యక్తపరుస్తున్నారు.
మునిసిపల్ ఆఫీస్ మొదటి అంతస్తులో కిటికి ప్రక్క సీటులో కూర్చున్న ఓ యువకుడు మాత్రం ముళ్ళమీద కూర్చున్నట్లు అసహనంగా అటూ ఇటూ కదులుతూ మాటిమాటికీ కిటికీ లోంచి తొంగిచూస్తున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన ఆఫీస్ ప్యూన్ ని చూసి
"ఇదిగో వీర్రాజూ ఇటురా" అంటూ పిలిచాడు. వీర్రాజు వస్తూనే "సార్, ఇంకా ఏ విషయం తెలీలేదండి, ఈ రోజుకూడా దుకాణం తీయలేదు, మీరో అరగంట పర్మిషన్ ఇస్తే ప్రక్క వీధిలో వాళ్ళ అబ్బాయి షాప్ కి వెళ్ళి వాకబు చేసి వస్తా" అన్నాడు వినయాన్ని నటిస్తూ.
ఇలా రోజుమొత్తంమీద ఏదో ఒక పని నెత్తినేసుకుని బయట తిరగటం వాడికున్న హాబీల్లో ఒకటి.
"సర్లే, ఇప్పుడేం వద్దులే కానీ, నువు బయటకువెళ్ళినప్పుడు చూసిరా చాలు" అన్నాడు తనమీద నెపంరాకుండా చూసుకుంటూ.
ఈ యువకుడి పెరు ప్రభాకర్. సుమారుగా పాతిక వయసుంటుంది. అనేకానేక వుద్యొగ ప్రయత్నాలు చేసి చివరికి ఈ మునిసిపల్ ఆఫీస్ లో వచ్చి పడ్డాడు.

"నాన్నా నాకు బందరు మునిసిపల్ ఆఫీస్ లో వుద్యోగం వచ్చింది" అంటూ కేశవమూర్తి తో చెప్పినప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందంతో పాటు ఒక న్యూనతా భావం కూడా కనిపించింది. రెండుమూడు నిమిషాలు మౌనంగా వున్న కేశవమూర్తి మెల్లగా తేరుకుని, "చాలా సంతోషం. అక్కడ రాఘవరావు మాష్టారని వుండే వారు, నీవు చేరిన తర్వాత ఒకసారి ఎంక్వయిరీ చేయి" అని మాత్రం చెప్పి వూరుకున్నారు. కేశవమూర్తి మొదటినుండీ అంతే. ఏదీ పూర్తిగా విడమరచి చెప్పరు. ఆయన చెప్పిన ఒక్క మాటలోనే పూర్వాపరాలు విచారించుకొని పని సానుకూలపరచుకోవడం ప్రభాకరానికి చిన్నప్పటినుండి అలవాటైపోయింది. అవసరమైతే తల్లి సాయం తీసుకుంటాడు అప్పుడప్పుడు. పని సానుకూలమైనప్పుడు కనిపించని స్పందన, వేరేవిధంగా జరిగినప్పుడు గానీ, అర్థంకాక మరోసారి అడిగినప్పుడు గానీ తీవ్రంగా వుంటుంది.

"సరే నాన్నగారూ" అని ఇక తన ప్రయాణ ప్రయత్నాల్లో తానున్నాడు. మధ్యలో ఒకసారి తల్లివద్ద రాఘవరావు మాష్టారి ప్రస్తావన తెస్తే, ఆవిడ తనకు తెలిసినంతవరకూ చెప్పింది. మీ నాన్న గారిని ఆయన తనవద్ద వుంచుకుని చదువు చెప్పారనుకుంటా. పదవ తరగతి తర్వాత కూడా కాలేజీ ఫీజులు కట్టి చదివించారని ఒకసారి చెప్పినట్లు గుర్తు" అంది. సామాన్లు సర్దటంలో తల్లికి సాయం చేస్తూనే అప్రయత్నంగా "తర్వాత" అన్నాడు ప్రభాకర్. "తర్వాత ఏముంది ఉద్యోగం పేరుతో ఇలా రాజమండ్రి వచ్చి ఇక ఇక్కడే స్తిరపడ్డారు. మొదట్లో ఒకటి రెండుసార్లు వెళ్ళి రావటమూ, ఆతర్వాత కొన్ని వుత్తరాలూ, అంతే. మెల్లగా కబుర్లు తెలీడం కూడా తగ్గిపోయింది. తల్చుకున్నప్పుడల్లా బాధపడతారేకానీ వెళ్ళి చూసిరమ్మంటే కదిలేవారు కారు. తన చొరవ లేమి కారణంగా ఇలాగే చాలామందికి దూరమైపోయారు" అంది వివరణయిస్తూ.
ఆ నేపథ్యంనుండి బయలుదేరి ఈ ఆఫీసులో చేరి మూడునెలలు కావొస్తోంది. వచ్చిన రెండోరోజే మాష్టారి గురించి అడిగితే ఎవరూ తెలీదన్నారు. ఆఫీసులో పెద్దవాడూ, స్థానికుడూ అయిన సెక్షన్ సూపర్వైజర్ వద్దకువెళ్ళి వాకబు చేస్తే, "అవును రాఘవరావని ఒక టీచరు వుండేవారు, మన మునిసిపల్ స్కూల్ లోనే పనిచేసేవారు. అయనకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు కూడా వచ్చినట్లు గుర్తు", అయితే తనకి ఆయన గురించి అంతకుమించి వివరాలేమీ తెలీదని చెప్పి వూరుకున్నాడు.
చిగురించిన ఆశ మళ్ళీ మోడువారినట్లయింది ప్రభాకరానికి.
కొద్ది రోజులక్రితం వీర్రాజుతో ఇదే ప్రస్తావన తెస్తే, వాడు రామభక్త హనుమాన్ లాగా వ్యవహారం చక్కబెట్టుకొని వచ్చాడు. రాఘవరావు మాష్టారు రిటైరు అయిపోయి దగ్గరలోని రంగనాయకస్వామి ఆలయంలో పురాణ ప్రవచనం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని చెప్పాడు. ఆయనకి ప్రక్క సందులోని చెప్పుల దుకాణం యజమాని మహదేవుడికీ స్నేహమనీ, ప్రతిరోజూ సాయంత్రం దుకాణానికి వచ్చి వెళుతుంటారని చెప్పాడు. ఈ విరోదాభాస వినంగానే మొహం చిట్లించి మళ్ళీ ప్రసన్నమైపోయాడు ప్రభాకర్. ఆ చెప్పుల దుకాణం తన సీటుప్రక్క కిటికీ లోంచి తొంగిచూస్తే కనిపిస్తుంది. సాయంత్రమవ్వగానే అసంకల్పితంగా కిటికీవద్దకు వెళ్ళి తొంగిచూశాడు. "పరమాత్మ నిలయం" అని బోర్డు వ్రేలాడ కట్టిన ఒక చెప్పులు కుట్టే దుకాణం కనిపించింది.
దుకాణం ముందు ఒక బక్కపలచటి వ్యక్తి లాల్చీ, ధోవతీ, పైకండువాతో చూడగానే గురుభావంతో నమస్కరించాలనిపించేలా కూర్చుని టీ త్రాగుతూ వున్నాడు. దుకాణం లోపల మహదేవుడనే యజమాని నిండైన రూపంతో, ప్రసన్న వదనంతో, చిరునవ్వుతో రాఘవరావునే చూస్తూ కూర్చున్నాడు. అతని చూపులో ఆత్మీయతకు మించిన ఆరాధనేదో తొణికిసలాడుతోంది. టీ త్రాగి కప్పుక్రిందపెడుతూండగా అందుకుంటూ "ఈ రోజు మీ ప్రవచనం దేనిమీద పంతులుగారూ" అన్నాడుమహదేవుడు.
రాఘవరవు చిన్నగా నవ్వి, "మహాభారతం చెపుతున్నాను తెలుసుగా, ఈరోజు ధర్మవ్యాధుని ఘట్టం" అన్నాడు. "ధర్మవ్యాధుడంటే సన్యాసికి ధర్మబోధచేసినాయనే కదా" సందేహనివృత్తికోసం అన్నట్లుగా అడిగాడు మహదేవుడు. రాఘవరావు మెల్లగా తల పంకించాడు. మళ్ళీ మహదేవుడే "అంత తపశ్శక్తి సంపన్నుడు వేదవేదాంగాలు తెలిసిన సన్యాసికి ఒక కటిక వాడు, మాంసవిక్రయదారుడూ ఙ్ఞానాన్ని బోధించడం విడ్డూరంగాలేదూ" అన్నాడు.
"విడ్డూరమేముంది చదువు ఏ మనిషికైనా ఙ్ఞానాన్ని ఇవ్వాలి.తద్వారా యుక్తాయుక్త విచక్షణ యేర్పడుతుంది. బుద్ధి ననుసరించి యుక్తమైన మార్గాన్ని యెన్నుకుని పయనిస్తే ఏ వ్యక్తియైనా లక్ష్యాన్ని చేరుకుంటాడు. అట్లుకాక మార్గమధ్యలంలో తన శక్తి సామర్ధ్యాలపై అహంకారాన్ని పెంచుకుంటే విచక్షణ లోపిస్తుంది వివేకం మందగిస్తుంది. ఙ్ఞానాన్ని కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు గురువు యొక్క అవసరం యేర్పడుతుంది.
"మాంసాన్ని ముక్కలుగా కోసి అమ్ముకునే వృత్తిలోనున్న ధర్మవ్యాధునికీ, అతని ప్రవృత్తియైన ధర్మబొధనని ఎలా అన్వయించుకోవాలి" ప్రశ్నించాడు మహదెవుడు.

"వృత్తి ధర్మం వేరు, ప్రవృత్తిధర్మం వేరు. రెంటినీ ఒకే దృష్టితో చూడకూడదు. వంశానుగతంగా వచ్చింది కులవృత్తి. అది దైవంతో సమానం. ధర్మాతిక్రమణ చేయని ప్రతివృత్తిలోనూ గౌరవం వుంది".
"ధర్మ వ్యాధుడు చేసినదికూడా అదే. తన కులవృత్తి కాబట్టి మాంసవిక్రయాన్ని వదలలేదు. అట్లని తానేజీవిని చంపలేదు. పనియందు దైవాన్ని దర్శించాడు కాబట్టి అతనికి ఎటువంటి పాపమూ అంటలేదుసరికదా ఙ్ఞానవంతులలో ఒకరిగా పేరుతెచ్చిపెట్టింది". చెప్పటం పూర్తిచేసి "మహదేవా ఇలా రోజూ పురాణపాఠాన్ని ముందుగానే వినే బదులు నీవుకూడా గుడికివచ్చి వినవచ్చుగా" అన్నాడు రాఘవరావు.
"రాఘవా! నీకుతెలిసిందేకదా నేను ఏగుడికీ రానని. నాపని, నాదుకాణమూ ఇవియే నాకు దైవమూ, దేవాలయమూ. అందుకే దీనికి పరమాత్మ నిలయమని పేరుపెట్టుకున్నాను. నీకు గుర్తుందిగా ఇదేకధని ఒకనాడు చిన్నప్పుడు పాఠంగా చెప్పావు. అదే నామనసులో బలంగా నాటుకుపోయింది" అన్నాడు.
ఎప్పుడో గుండె ఆర్ద్రమైనప్పుడుకానీ రాఘవరావుని ఏకవచన సంబొధన చేయడు మహదేవుడు. ఇద్దరూ చిన్నప్పటి సహాధ్యాయులు. ఒకటినుండి ఐదు వరకూ కలిసి చదువుకున్నారు. ఎప్పుడూ క్లాసులో వీరిద్దరే ఫష్టు వచ్చేవాళ్ళు. ఎలిమెంటరీ నుండి హైస్కూలుకు మారినప్పుడు మహదేవుని తండ్రి మనకిక ఈ చదువు చాలు, నాతో దుకాణానికి రారా అంటే సరే నని తండ్రికి తోడుగా దుకాణాంలోనేవుండిపోయాడు.
స్నేహాన్ని వదులుకోలేని రాఘవరావు మాత్రం బడినుండి నేరుగా దుకాణానికి వచ్చి ఆరోజు చెప్పిన పాఠాలన్నీ చెప్పి చదివించి వెళ్ళేవాడు. అలా తనతో పాటు పదవతరగతివరకూ తానే చదువుచెప్పి పరీక్షకూడావ్రాయించాడు. ఇద్దరూ ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులయారుకూడా. ఈ క్రమంలోనే ఒకరోజు ధర్మవ్యాధుని పాఠ్యభాగాన్ని వివరించి చెపుతూ మహదేవునిలోని న్యూనతాభావాన్ని తరిమికొట్టాడు. ఆనాటీనుండి మహదేవునిలో అతనిపట్ల అంకితభావం శ్రద్ధ పెరిగినాయి. తరువాత తానే అనేకానేక పుస్తకాలు, గ్రంధాలు, పురాణాలు చదివి విఙ్ఞానాన్ని పెంచుకున్నాడు. ధర్మసూక్ష్మాలని గ్రహించడంలో నేర్పరియై తర్కానికికూడా వెనుకాడేవాదుకాదు ఒకోసారి.
అందుకే మహదేవుడు అడగకపోయినా తాను చెప్పబోయే ఘట్టాన్ని వినిపించి అతని తర్కాన్ని, వ్యాఖ్యానాన్ని విని దాన్ని సామాజిక అన్వయంచేస్తూ రసరంజకంగా ప్రవచనం చెపుతూవుంటాడు రాఘవరావు.
చిన్నగా నవ్వి వెళ్ళొస్తానంటూ బయలుదేరాడు రాఘవరావు.
ఇదంతా గమనిస్తున్న ప్రభాకర్ సందిగ్ధంలో పడ్డాడు. ఆయనతో పరిచయం చేసుకోవాలన్న తలంపుని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాడు. కానీ అటు రాఘవరావునీ ఇటు మహదేవుణ్ణీ ఒక కంట కనిపెడుతూనేవున్నాడు. ప్రతిరోజూ ఉదయం రాగానే ఒకసారి క్రిందికి చూసి మహదేవుడిని చూడటం, సాయంత్రమవ్వగానే రాఘవరావుకోసం చూడటం పైనుంచే వారిని గమనించడం ఒక అలవాటుగామారి కొంతకాలానికి వారి స్నేహ సాంగత్యాలపై ఒక సానుకూల దృక్పధం ఏర్పడింది. ఇంతలో రెండురోజులనుండీ దుకాణం తెరవడం మానివేశారు. కారణం తెలీదు. రాఘవరావుని కలుసుకోవడంలో తాను ఉపేక్షించినందుకు చాలా బాధపడ్డాడు. అందుకే వీర్రాజుతో రోజూ వాకబు చేయిస్తూ వున్నాడు.
సుమారుగా 4గం. ప్రాంతంలో వీర్రాజు వచ్చి "సార్ దుకాణం తెరిచాడు" అని చెప్పి వెళ్ళిపోయాడు. లేచివెళ్ళి కిటికిలోంచి చూశాడు. దుకాణం తెరిచి వుండి. మహడెవుడు ఏదో సర్దుకుంటూ కనిపించాడు. అతని దగ్గరగావెళ్ళి కొంచెం తటపటాయిస్తూ "నమస్కారమండీ! నా పేరు ప్రభాకర్, ఈ ప్రక్కనే మునిసిపల్ ఆఫీసులో పనిచేస్తున్నాను" అంటూ స్వీయపరిచయం చేసుకున్నాడు. ప్రసన్నంగా నవ్వి ప్రతినమస్కారంచేస్తూ "తెలుసుబాబూ" అన్నడు.
"తెలుసా?" ఆశ్చర్యపోవడం ఈతని వంతయ్యింది.
"అదే ఆ కిటికీ వద్ద రెండుమూడుసార్లు చూశాను, సర్లేండి నాతో ఏమైనా పనా?" అంటూ అడిగాడు.
"మీతో కొంచెం మాట్లాడాలి".
"నేను అవసరంగా బయలుదేరుతున్నా, అభ్యంతరం లేకుంటే నాతో రండి నడుస్తూ మాట్లాడుకుందాం" అంటూ మెల్లగా నడకతీసాడు మహదేవుడు. అవెంటే ప్రభాకర్.
"నేను మాష్టారిని కలవాలి" నడుస్తూ చెప్పాడు ప్రభాకర్. ఎందుకన్నట్లు చూసాడు మహదేవుడు.
"నేను కేశవమూర్తి గారబ్బయిని. నాన్నగారు తమ గురువుగారిని చూసిరమ్మన్నారు" అన్నాడు.
మహదేవుడు ఒకసారి సాలోచనగా ప్రభాకర్ ముఖంలోకి చూశాడు. అది గ్రహించి ప్రభాకర్ ఇలా చెప్పాడు.
"అవును మాష్టారివద్ద నాన్నగారు చదువుకున్నారట చిన్నప్పుడు. మీకూ తెలిసే వుంటుందనుకుంటాను"
"విన్నాను, రాఘవ దగ్గర చాలామంది కుర్రవాళ్ళు చదువుకునేవాళ్ళు. చురుకుతనం వుండి ఆర్ధికస్తోమతలేని చాలామంది విద్యార్ధులకు తానే ఫీజులు కట్టి చదివించేవాడు. వారిలో మీనాన్నకూడా ఒకరు. మీనాన్నపై ప్రత్యేక శ్రద్ధ కనబరచేవారని విన్నాను".
"మాష్టారికి పిల్లలున్నారా?" అడిగాడు ప్రభాకర్.
"కడుపునపుట్టిన బిడ్డలు ఇద్దరున్నారు, ఒక కొడుకు, ఒక కూతురు. ఇకపోతే తనవిద్యార్ధులందర్నీ సొంతబిడ్డలుగానే చూసుకునేవాడు. వచ్చిన జీతం వచ్చినట్లు ఈ పిల్లలందరి పోషణకి, చదువులకే అయిపోయేది. ఒక్క రూపాయికూడా దాచుకుని యెరుగడు మహానుభావుడు. చివరికి సొంతకొడుకు పైచదువులకు విదేశాలకు వెళ్తానంటే పిత్రార్జితంగా వచ్చిన ఇంటిని అమ్మి పంపవలసిన పరిస్థితి యేర్పడింది".
"అయితే వారబ్బాయి అమెరికాలో వున్నాడా?" ఆసక్తిగా అడిగాడు.
"అవును బాబూ చదువుపేరుతో కొన్నాళ్ళూ, ఉద్యోగంపేరుతో కొన్నాళ్ళూ గడిపి ఆపై అక్కడి అమ్మయినే వివాహంచేసుకుని కన్నవారినీ, వున్నవూరినీ పూర్తిగామర్చిపోయాడు" అన్నాడు విచారంగా. రాఘవ పిల్లలే తన సర్వస్వమని జీతాన్నీ, జీవితాన్నీ కూడా త్యాగంచేశాడు బాబూ. కొడుకు దూరమయ్యే సరికి రాఘవ భార్య జానకమ్మ దిగులుతో మంచంపట్టి కాలంచేసింది. పెళ్ళికెదిగిన కూతురూ తనూ తనకొచ్చే కొద్దిపాటి పెన్షన్ తో ఆద్దెయింట్లో కాలక్షేపంచేస్తున్నాడు. ఉద్యోగంలో వున్నప్పుడు సన్మానాలూ, ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నా రెటైర్ అయిపోయినాక అందరితలపుల్లోనుండి తొలగిపోయాడు. అటు కొడుకుగానీ, ఇటు శిష్యులుకానీ ఈ నిస్వార్ధజీవిని ఎప్పుడైనా తలుచుకుంటారోలేదో కూడా అనుమానమే".  చెపుతున్నంతసేపూ అతని కంఠం జీరబోతూనే వుంది.
"పదబాబూ ఇక్కడే ఈ హాస్పిటల్లోనే గతరెండురోజులుగా మూసిన కన్ను తెరవకుండా పడివున్నాడు". పాపం చిన్నపిల్ల బెంబేలుపడిపోతుంటే నేనే కాస్తదగ్గరవుండి చూస్తున్నాను" అంటూ లోపలికి దారితీసాడు.
వెనకే ప్రభాకర్ కూడా నడిచాడు.
గదిలో మంచంపై రాఘవరావు పడుకుని వున్నాడు. ప్రక్కనే కూర్చున్న ఆయన కూతురు వీళ్ళని చూసి రండి అంటూ లేచినిల్చుంది.
"ఈమే బాబూ రాఘవ కూతురు. రాధిక నే చెప్పానుగా" అంటూ పరిచయం చేసాడు.
"ఇతను ప్రభాకర్ అని నాన్నగారి శిష్యుల్లో ఒకరి అబ్బాయి" అంటూ రాధికకి పరిచయం చేసాడు.
వీరి అలికిడికి మెలకువ వచ్చి మెల్లగా కళ్ళుతెరిచాడు రాఘవరావు. మహదేవుడు కొంచెం ముందుకువంగి రాఘవరావు చెవిలో "మీ కేశవమూర్తి కొడుకు" అన్నాడు ప్రభాకరాన్ని చూపిస్తూ.
కేశవమూర్తి పేరువినగానే రాఘవరావు ముఖంలో ఒక వెలుగుని చూశాడు ప్రభాకర్. శిష్యవాత్సల్యం అంటే ఇదేగామోసు అనుకున్నాడు.
దగ్గరికి వెళ్ళి నమస్కరించి కుశలం కనుక్కున్నాక, తన తండ్రి గురించి, తన ఉద్యోగం గురించి అంతా వివరంగా చెప్పాడు. చెపుతున్నప్పుడే తనొక నిర్ణయానికొచ్చాడు.
పదినిమిషాల తర్వాత మహదేవుణ్ణి ప్రక్కకు తీసుకువెళ్ళి తన నిర్ణయాన్ని తెలిపాడు. మానాన్నగారు గురువు గారివద్ద చదువుకుని పెద్దవారయ్యారు.దాని ఫలితంగానే మేమూ ఈనాడు ఈస్థితిలో వుండగలుగుతున్నాం. కారణాలేమైనా నాన్నగారు గురువుగారి రుణం తీర్చుకోలేకపోయారు. ఆయన కొడుకుగా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. వారికి అభ్యంతరంలేకపోతే రాధికని నేను పెళ్ళిచేసుకుంటాను. మాష్టారిని కంటికిరెప్పలా చూసుకుంటాను. ఒకసారి వారితో మాట్లాడిరండి అంటూ అబ్యర్ధించాడు.
అతని విచక్షణకి, నిర్ణయానికీ చేతులెత్తి నమస్కరించాలనిపించింది మహదేవుడికి. నీళ్ళునిండిన కళ్ళతో "నాకు తెలుసుబాబూ, రాఘవ చేసినపుణ్యం వృధాపోదని. అతను చేసిన ఙ్ఞానదానం, విద్యాదానం ఈరోజు నీరూపంలో వచ్చి అతన్ని ఆదుకుంటోంది. తానెప్పుడూ అంటూవుండేవాడు ప్రతిమనిషిలోనూ పరమాత్మ వుంటాడని. మానవసేవయే మాధవసేవయని. ప్రతి మనిషి ఙ్ఞానవంతుడై, సంస్కారవంతుడై తనహృదయాన్ని "పరమాత్మ నిలయం" చేసుకుంటే అతడే నిజమైన మనిషవుతాడు. మహనీయుడౌతాడు. అట్లుకాదని ఆ పరమాత్మని "లయం" చేసుకుంటే అతను కేవలం జీవచ్చవం గానే మిగిలిపోతాడు.
"పదబాబూ ఇప్పుడే ఈ శుభవార్తను రాఘవ చెవిన వేద్దాం" అంటూ ప్రభాకర్ చేయిపట్టుకుని లోనికి నడిచాడు ఆనందంతో.
                                      * * * * * *