Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

18, ఏప్రిల్ 2015, శనివారం

లవ్వించుక కొసరువెట్టి….

[శశిధర్ పింగళి]

పచ్చని కాపురమంటే
నచ్చిన చీరొకటి తెచ్చు నడవడి కాదోయ్
మెచ్చిన చీరకు మల్లే
వెచ్చగ తాచుట్టుకొనెడు విభుడే ఘనుడౌ...1

తెచ్చిన చీరలొ సతితా
మచ్చిక గాదరి కిజేరి మాధుర్యముతో
వెచ్చని కౌగిలి లో సొగ
సిచ్చిన మరి పుచ్చుకొనుటె సెహబాసు సుమీ! ...2


చల్లని సాయం వేళల
మల్లెలు తాకొన్ని తెచ్చి మగడే సతికా
నల్లని కురులలో తురిమిన
ఎల్లరి సంసార శోభ ఎల్లలు దాటున్...3

అలుకలు మూతి బిగిం పులు
సులువుగ తీరేటి దారి శోదించితిగా (సో సింపులెగా)
నలునకు నువు తమ్ముడివై
అలుపెరుగక వంటయింట నాడుము చాలున్ ...4

ఆలూ మగలన ఎప్పుడు
సోలోగా నుండవలయు, చోటివ్వకుడీ
మీలో ఎవరును ఇతరుల
ఫాలో గాకుండు టద్దె  ప్రాఙ్ఞత మీకున్ ... 5
పక్కింటావిడ నగపై
మక్కువపడి మగని చేరి మారాం జేస్తే
అక్కున జేరిచి మరి గ
భుక్కున నొక్కేయ వలయు బుద్దిగ నోరున్ ... 6

లేటుగవచ్చిన పతితా
నీటుగ నెన్నైన కధలు నేర్పుగ చెప్పున్
పాటున పట్టం గవలయు
ధీటుగ నవ్వాని గరిమ ధీరత్వముతొన్ ... 7

నవ్వించుచు విరి తూపులు
రువ్వించుచు విభుని జేరి క్రొవ్వలపులతొన్
కవ్వించుచు జేరు సతిని
లవ్వించుక కొసరువెట్టి లాలించ వలెన్ ... 8

సురగంగాఝరి సమమై
సరసంగా సాగవలయు సంసారమిలన్
ఇరువురు నొకరికి నొకరై
చరియించిన సాధ్యపడును స్వర్గంబిలపై ... 9

సత్యంబుగ వధు వరులకు
నిత్యంబొక యుగము గాదె నీ యాషాఢం
లో, త్యాగం గాదది దాం
పత్యానికి పెద్దలిడిన పత్యం బదియే ... 10

(ఆమధ్య బ్నిం గారి జడాపజ్యాల శతకావిష్కరణకెళ్ళి వచ్చాక రెండుమూడురోజులు మనసెందుకో ఆ భావాలనుండి బయటకు రాలేకపోయింది. ఆ భావజాలంనుంచి కొన్ని సరదా పజ్యాలు ఇలా పుట్టుకొచ్చాయి. చిత్రంగానూ, చిలిపిగానూ పచ్చని సంసారానికి పదిసూత్రాల్లా పదంటే పది పజ్యాలు వచ్చి ఆగిపోయాయి.)

---------------

కామెంట్‌లు లేవు: