Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

19, ఫిబ్రవరి 2015, గురువారం

చలమోర్వశీయం (ఊర్వశి-చలం సంవాదం)

(శశిధర్ పింగళి)

తెలుగు సాహితీలోకంలో చలం, తరాలు మారినప్పటికీ  పరిచయం అక్కరలేని రచయిత. పేరు కీర్తి మాటలెలావున్నా తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పటికీ అవి చదువరులని ఆరాటపెట్టే గ్రంధాలే. వాటిని చదివిన వాళ్ళకంటే చదవని వాళ్ళే ఎక్కువ విమర్శిస్తారనే అపప్రధకూడా వుంది. పోనీ చదివిన వాళ్ళు చెపుతారా అంటే వాళ్ళూ మాట్లాడరు. నామట్టుకు నాకు అన్నీ కాకపోయినా కొన్ని చదివి ఎలా అర్ధంచేసుకోవాలో తెలీక జుట్టుపీక్కున్నవాణ్ణే. ఆ విలక్షణశైలి, ఎంచుకున్న ఇతివృత్తం చదువరుల్ని వెంటాడుతాయనేదిమాత్రం నిజం. అలా వెంటాడిన కొన్ని ఆలోచనలే ఈ క్రింది రచనకు స్పూర్తి. (ముఖ్యంగా ఈ క్రింది రచనాశైలి... చలంగారి పురూరవ... రేడియోనాటకాన్ని మనసులోపెట్టుకుని చదవమని మనవి. ఒకవేళ ఇంతకుముందు ఆ రేడియో నాటిక వినకపోతే.. ఇక్కడ  వినండి)
***                    ***                         ***

ఒక నాటి సాయంకాలంలో నందనవనంలో ఒక మూలగా వంటరిగా, శూన్యంలొకి చూస్తూ ఏదొ అన్వేషిస్తున్నట్లుగా, ఏదొ పోగొట్టుకున్నట్లుగా  కూర్చున్న చలంగారి దగ్గరకు వస్తుంది ఊర్వశి.......



ఇక్కడున్నావా? నీకొసం ఈలోకం అంతా గాలించి వస్తున్నాను? ఇప్పటికి దొరికావు
ఆఁ .. ఎవరదీ! ఎవరు నువ్వు?
హహ్హహాహా  నన్నే మరిచిపోయావంటే నిన్నునీవు మర్చిపోయినట్లే.. కనీసం నీకు నువ్వన్నా గుర్తున్నావా?
ఏమో? అదే అలోచిస్తున్నాను.. గుర్తులేదు నువ్వే చెప్పు
హహ్హహాహా నిజంగానే.. మర్చిపోయవా ఏమిటి? అయితే ఈమాయని కాసేపు మాయం చేస్తాను చూడు
ఇప్పుడు చెప్పు.. నేనెరనో?
ఏమో నువ్వే చెప్పరాదూ..
హహ్హహాహా నన్నేపోల్చుకోలేదా.. నేను నీ ప్రేమను..
ప్రేమంటే?
ఏమొ అది నువుచెపితేనే అందంగా వుంటుంది.. ఏదీ! ఓ సారి చెప్పవూ....
ఆఁ... అదే అందం..
అందమంటే? ప్రేమ.
అంటే రెందూ ఒకటేనంటావా?
కాదనెట్లా అనమంటావ్.. రెండూ పరస్పరాశ్రయాలు. రెంటిలో ఏది లేకపోయినా రెండోది లేనట్లే.
అంటే అందంలేని ప్రేమ... ప్రేమలేని అందం నిరర్ధకమనా?
ఊఁ...
అయితే ఈరెండూ దెరికేచోటు?
ఇంకెవరు? స్త్రీయే!
అంటే నేనేగా...
కావచ్చు.
అబ్బా.. ఏమిటా నిర్లిప్తత .. కాసేపు పరధ్యానం ప్రక్కనబెట్టి నాతో మాట్లాడవచ్చుగా..
ఏం మాట్లాడమంటావ్... నామాటలు వినేదెవరూ.. అర్థంజేసుకునేదెవరూ..
అదే ఆ దిగులే వద్దంటున్నా... నేనొచ్చానుగా నాతో మాట్లాడు.. నేనొకటి అడుగుతా సమాధానం చెప్పు..
ఊఁ...
సరే ఇంతమంది ఆడవాళ్ళని సృష్టించావు కదా.. ఎందుకు .. వాళ్ళనేమ్జేద్దామనుకున్నావు
స్వేచ్చనిద్దామనుకన్నాను?
అంటే? అంతకుముందు అది మాదగ్గరలేదా?
లేదనే అనుకున్నాను.
ఎలా?
మీ బానిస బతుకుల్ని చూసి.
బానిసలంటే?
మీ మగవాళ్ళకి వండివారుస్తూ, పిల్లల్ని కంటూ మిమ్మల్ని మీరు పూర్తిగామర్చిపోయరుగా.. అదే.
అంటే .. సంసారం చెడ్డదనా నీ అభిప్రాయం?
కాదా? ఇందులో ఆమెకు స్వేచ్చ యెక్కడుంది?
స్వేచ్చంటే?
కోరుకున్నప్పుడు కోరుకున్నట్లు జీవితాన్ని అనుభవించడం.
అనుభవించడమంటే?. .
... (నిట్టూర్పు...)
మాట్లాడవేం? శృంగారనుభమనా నీవుద్దేశ్యం.
ఆవును. ఈ అందమైన సృష్టిలో అంతకుమించిన అనుభవమూ.. ఆనందమూ ఏమున్నాయి?
ఎవరికి? మీ మగవాల్లకా.. అమెకా...?
ఏం? ఆమే మనిషేగా, ఆమెకు మాత్రం కోరికలుండావా? సౌఖ్యాన్ని కోరుకోదా?
అయితే నువు నడిపించిన నాయికలందరూ సుఖపడ్డారంటావా?
ఎందుకులేదు. కోరుకున్నవాడితో కోరుకున్నప్పుడు కోరుకున్నవిధంగా.
అంటే తాను కోరుకున్నట్టుగానా? తనవాడు కోరుకున్నట్టుగానా?
రెంటికీ బేధమేముంది. తను కోరుకున్నవాడిని తను ప్రేమిస్తోందికాబట్టి అతనికోరిక తనకూ ఆనందమేగా.
అదేప్రేమను కట్టుకున్నవాడికిచ్చి వాడినే కోరుకున్నవాడిగా అనుకోవచ్చుగా.
ఆదెలా కుదురుతుందీ.. సంసారం ఒక బందం.. బాధ్యత వట్టి సంకెల.
ఆలా అని అమె యెప్పుడైనా నీతో చెప్పిందా?
లేదు
ఏం?
ఆమెకా స్వేచ్చలేదు.
అంటే నువ్వే ఆమె చేయిపట్టుకుని బయటకు నడిపించావు అంతేనా?
ఆవును.
మరి ఆమెకు స్వేచ్చ దొరికినట్లేనా?
అనే అనుకుంటున్నాను.
ఎలా?
‘ఆ తర్వాత అమె‘కెప్పుడూ ఏ బంధమూ అడ్డురాలేదు ఒక్క ప్రేమ తప్ప.
అంటే ప్రేమ బంధనమనేగా అర్ధం.
ఎలా అవుతుంది? ప్రేమ ఒక పారవశ్యం. ప్రేమ ఒక అలౌకికానందం.
నువ్వే అన్నావుగా ప్రేమకు బందీ అని.
అవును అది ఆమె తనకుతానుగా ప్రేమకు బానిస అయ్యింది. వ్యక్తికి కాదుగా.
ఊ.. ఇంకా...
ఏమో.. ఏమైనా తనుకోరుకున్నట్లుగా జీవితాన్ని అనుభవించిందిగా
నువ్వనుకుంటునట్లు ఆమెకు ఆ అనుభవంతప్ప వేరే ఏమీ కోరికలు లేవనా
ఏముంటాయి, ప్రేమనుమించిన అనుభవం.. ఆనందం ఏముంటాయి.
నువుచేప్పిన ‘ఆ’ అనుభవం ఒక్కటే ఆనందమను కుంటే జంతువులకీ మనకూ తేడా ఏముంది?
అదే.. వాటికున్న స్వేచ్చా, ప్రేమా మీకెందుకు లేవన్నదే నా బాధ.
ప్రేమ, స్వేచ్చా చాలా? గౌరవ మర్యాదలు ఆక్కరలేదా?
ఇంతకీ నువ్వెవరో చెప్పావుకాదు.
ఎవరైతెనేమిలే ఇప్పుదావిషయమెందుకు
లేదు తెలుసుకోవాలి.
తెలుసుకుని ఎం జేస్తావ్. అయినా నీవు సృష్టిమ్చినదాన్నేకడా.
అదే ఎవరూ అని.
సరేగానీ. వాళ్ళలో నీకు ఎవరంటే ఇష్టమో చెప్పు.
కష్టమైన ప్రశ్న. ఇష్టం లేకపోతె ఎందుకు సృష్టిస్తాను.
పోనీలే..  వాళ్ళలో నీకు ఏమి నచ్చిందో చెప్పు.
అందం, అమాయకత్వం, ఆడతనం,
ఇంతకీ నువ్వెవరో చెప్పావుకాదు.
ఎవరో ఒకరని అనుకోవచ్చుగా.
అదే ఎవరని.
వదిలేద్దూ. చెప్పానుగా నేనూ ఒక ఆడదాన్నని.
ప్రేమ ముందు వాటికి విలువలేదు.
పోనీ.. నువ్వెప్పుడైనా ఆ ప్రేమని పంచావా?
పంచకేం. అందిన ప్రతిస్త్రీకీ నన్ను నేను మర్చిపోయి మరీ పంచాను.
సరే . నీ వేప్పుడైనా పోమ్దావా మరి.
కొన్నిసార్లు.. కొంతకాలం
అంటే త్రుప్తికలగలేదా?
ప్రేమకు తృప్తి ఎక్కడుంది?
ఇంత తపించే వాడివి.. మా మానాన మమ్మల్ని వదిలేసి ఎందుకెళ్ళిపోయావ్..?
ఏంజేయను? నా ప్రేమ కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇక నన్ను ఎవరూ అర్ధం చేసుకోలేదు. వంటరివాణ్ణి చేసారు. అన్ని విధాలా మోసపోయాను.
పాపం...! వెళ్ళిపోయి ఎం జేశావు నీ ప్రేమను మర్చిపోయావా?
లేదు. మరింత ప్రేమించాను.. అజరామరమైన ప్రేమ మూర్తిని ద్యానించాను.. అసలైన ఆనందంకోసం తపించి తపించి తనువూ చాలించాను.
మరి...మా గురించి ఎప్పుడైనా ఆలోచించావా?
లేదు. నా ప్రేమాన్వేషణలో ఆలోచనకు తావులేదు. మీకు స్వేచ్చా మార్గం చూపించే వచ్చానుగా.
హూఁ.. అదే మా దురదృష్టం. ప్రేమపేరుతో నువ్వు అందమైన మా గుండెలనే చూశావుకానీ. దాని వెనుక వున్న హృదయాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నువ్వు చూపించిన స్వేచ్చకు ముందూ తర్వాతా కూడా మేము స్వతంత్రులం కాలేకపోయాము. మీ మగవాళ్ళ దృష్టిలో మేము ఎప్పుడూ ‘అందుకే’ నన్నట్లుగా ప్రేమ పేరుతొ బందీలు చేశారు. ఒకప్పుడు ‘ఆ’ అవసరాలకోసం సమాజంలో ఒక ప్రక్కగా కొంతమంది మాత్రమె వుండేవారు. నీ పుణ్యమా అని సమాజం మొత్తం మమ్మల్ని అలానే అనుమానించి బాధించింది. ఇక మీ మగవాళ్ళు వాళ్ళ ఇంటి తలుపులు మూసి వూరి వాళ్ళ తలుపులకేసి తల్లీ చెల్లీ బేధం లేకుండా ప్రతి సంసారిక స్త్రీలోనూ ఆమె నే చూసారు.. చూస్తున్నారు.  అటువంటి ఆమెను ఉద్దరించి పరువు మర్యాదలు కల్పించాల్సిన నీవు మమ్మల్ని ఆ స్థాయికి జేర్చి అదే ఉద్దరణ అని భ్రమపడ్డావు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు అందరూ మమ్మల్ని చదివి మూతులు తుడుచుకున్న వాళ్ళే. ధైర్యమున్న వాళ్ళు తప్పన్నారు. లేనివాళ్ళందరూ ఏకమై తర్వాత నీవు పాడినట్లే స్త్రీ జనోద్దరణ పల్లవులు పాడారు.
నిజానికి మాకు స్వేచ్చా స్వాతంత్ర్యాలు లేని మాట వాస్తవమే. అయితే అది నీవనుకుంటున్నట్లు "ఆ" ప్రేమ విషయంలో కారు. వ్యక్తిత్వంలో, విద్యలో, ఉద్యోగాల్లో, ఇంకా అప్పటి సాంప్రదాయాలవల్ల ఎక్కువగానష్టపోయి చెడిన మా తలలనీ, తలరాతలనీ ఉద్దరిస్తే బాగుండేది. మాకూ సభ్య సమాజంలో పరువూ గౌరవం దక్కేవి.
ఏమంటావ్...  అరెరే .. ఏమిటా కన్నీళ్లు? ఎందుకు దుఃఖం..?
అమృతమయమైన ప్రేమను ప్రేమించాను. ప్రేమే సర్వస్వం అనుకున్నాను. అందుకు ఆలంబనమైన స్త్రీనే దేవతగా భావించాను. సుఖమూ, శృంగారమూ నేను నమ్మిన ప్రేమకు ఉపాంగాలు మాత్రమే. సమాజం ఈ శృంగారాన్ని మాత్రమే చూసింది. నన్నసహ్యించుకుంది. చివరికి వెలివేసినంత పని చేసింది. అందుకే వెళ్ళిపోయాను. నన్నెవరూ అర్ధం జేసుకోలేదు. చివరికి నువ్వుకూడా..
పిచ్చివాడా... నిన్నూ నీమనసునూ అర్థం చేసుకున్నదాన్ని కనుకనే వచ్చాను. నువ్వే అన్నావుగా సుఖమూ, శృంగారమూ ప్రేమకు ఉపాంగాలని. ప్రేమను అన్వేషించాలన్నా... అందుకోవాలన్నా.. నువ్వెంచుకున్న  మార్గమే తప్పు. అది మానవులని సమాజాన్ని ఇట్టే ఆకర్షించి వాళ్ళ ఆలోచనల్ని అక్కడే నిలిపివేసింది. వారి మనస్సులో గందర గోళాన్ని సృష్టించింది. కానీ నువ్వు నమ్మిన ప్రేమ నీతోనే వుంది. నీకు రుజు మార్గాన్ని చూపెట్టి చివరికి తనలో లీనం జేసుకుంది.
విచారించకు లే... ఇలావచ్చి నాబాహుబందంలో సేదతీరు.. రా...
నిజమా.. నామీద నీకు ద్వేషం లేదా... నన్ను నీ ప్రేమకు పాత్రుణ్ణి చేస్తావా...
పిచ్చివాడా... నేను ఆడదాన్ని.... అమ్మదనం తెలిసిన దాన్ని... ప్రేమ నా నైజగుణం .. సందేహించకు... రా .. నాగుండెలపై సేదతీరు...
ధన్యుణ్ణి... మాటలు రావటం లేదు...
పరవాలేదు... నిశ్శబ్దంగా...నే చేప్పేది విను... నన్నెవరని ప్రశ్నించావుగా.. విను..
నువ్వు వచ్చేసాక ఆ ఆడవాళ్ళంతా వాళ్ళ అంతరంగాన్ని నాతో చెప్పుకున్నారు. బాధని నాతొ పంచుకున్నారు. నీనూ ఆ పవిత్రభూమి మీద కొన్నాళ్ళు కాలుమోపిన దాన్నేగా.. అందుకే సులభంగా వాళ్ళ బాధని అర్ధంజేసుకున్నాను. అందుకే నిన్నడిగి నిజం తెలుసుకుందామని వచ్చాను. నేను ఊర్వశిని... నీ ఊర్వశిని...  నా వచ్చిన పని అయిపోయింది. వస్తా...
ఆ... ఊర్వశివా.. వద్దు వద్దు.వెళ్ళకు... నన్నొదిలి వెళ్ళకు...
ఊర్వశీ.............................!

కామెంట్‌లు లేవు: