Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

5, డిసెంబర్ 2014, శుక్రవారం

దత్త జననం-కధ (శ్రీ దత్తాత్రేయ జయంతి, 06.12.2014 మార్గశిర శుద్ధ పౌర్ణమి)


[ శశిధర్ పింగళి ]
కైలాస పర్వతం కోలాహలం గావుంది. దేవ, యక్ష, కిన్నెర, కింపురుషాది స్త్రీ జన పరివారంతో శోభాయ మానంగా వుంది. సమస్త సృష్టికి మూలకారణమైన, జగజ్జనని శ్రీ పార్వతీదేవి దుష్ట దనుజ సంహారము గావించి, ముల్లొకములలోనూ శాంతిస్థాపన గావించినందుకు గానూ విజయోత్సవ వేడుకలు జరుపు తున్నారు.  ఫార్వతీదేవి, దేవలోకంలోని స్త్రీలందరినీ పిలిచి పేరంటం చేస్తోంది. తమ త్రిశక్తులలో ఒకటైన పార్వతి సాధించిన విజయాన్ని తమ విజయంగానే భావించి ఆనందపడుతున్నారు లక్ష్మి సరస్వతులు.
విజయోత్సవంలో భాగంగా, త్రిశక్తులు, తమతమ పతులకు పాదపూజ చేసారు. ఆరి ఆశీర్వాదాలు స్వీకరిస్తుండాగా నారద మహాముని వచ్చారు.
రా నారదా రా,  ఇంతవైభవంగా పండుగ జరుపుకుంటుంటే ఇప్పుడా రావడం అంటూ నిష్టూరాలుడుతూనే స్వాగతం చెప్పింది అంబ. నారదుడు నీరసంగా నవ్వాడు.
అదేమిటి నారదా అలా వున్నావ్ అంటూ చనువుగా దగ్గరికి వెళ్ళింది తల్లి మనసుతో  సరస్వతీ దేవి.
క్షుద్భాద తల్లీ, క్షుద్భాధ అంటూ బదులిచ్చాడు నారదుడు.
క్షణం ఓపికపట్టునాయనా, వడ్డించేస్తాము అన్నీ సిద్ధంగానే వున్నాయని బదులిచ్చించి లక్శ్మి. నారదుడు మళ్ళీ నవ్వాడు నీరసంగా.
త్రిమూర్తులకు ఆనవ్వులో ఏదో మర్మం వున్నట్టుగా లీలగా తోచింది, యెందుకైనా మంచిదనుకుని, "మీ రా యేర్పాట్లు చేసుకుంటూ వుండండి మేమిప్పుడే అలా వెళ్ళివస్తా"మని మెల్లగా బయపడ్డారు.
వడ్డన వ్యవహారం ఒక ప్రక్క సాగుతోంది.  త్రిశక్తులు మెల్లగా కబుర్లలో బడ్డారు. తమ శక్తులగురించి,  తమ భర్తల ప్రతాపాల గురించీ, వారిపట్ల తమ భక్తీ, పాతివ్రత్యాలగురించీ మాటసాగింది. అంతలో తమ ముగ్గిరిలో ఎవరెక్కువ అనురాగవంతులో , ఎక్కువ పతిభక్తి గలవారోనన్న చిన్న మీమాంస తలెత్తింది.
ఇంతలో నారదుడు బ్రేవ్ మంటూ త్రేన్పు విడిచాడు.
అదేమిటినారదా ఇంకా భోంజేయకుండానే త్రేన్పుతున్నావ్ అడిగింది లక్ష్మి.
ఆకలి త్రేన్పులేమో నంది సరస్వతి.
పార్వతికి మాత్రం ఎందుకో అనుమానం కలిగింది. కొంచెమాలోచించి, సరే నారదా మా వివాదానికి నీవే సమాధానం చెప్పాలి రా అంటూ పిలిచింది. 
నారదుడు గతుక్కు మన్నాడు. ఆమ్మా, నాకా ఈ విషమ పరీక్ష అన్నాడు మెల్లగా బొజ్జ నిమురుకుంటూ లోలోపల నవ్వుకుంటూ.
నారదుడెంతకీ సమాధానం చెప్పకపోయేసరికి, పార్వతి తానే ఇలా అంది. "ఏమి నారదా నీ మౌనానికి అర్ధమేమిటి. మాకంటే ఎవరైనా పతివ్రతలున్నారా నీ దృష్టిలో"
త్రిమాతలు మన్నించాలి. ఏలాగూ ఈ విషమ పరీక్ష నుండి తప్పించుకునే మార్గము లేదు. అంతగా అడుగుతున్నావు గాబట్టి చెపుతున్నాను తల్లీ, భూలోకంలో అట్టి మహామాత ఒకరున్నారు అన్నాడు.
భూలోకమా కొంచెం ఈసడింపుగా అన్నారు ముగ్గురూ ఒకేసారి.
ఎవరు నారదా అంత పతివ్రత కొంచెం స్వరంపెంచుతూ అడిగింది భవాని.
అనసూయా మాత తల్లీ, అత్రి మహా ముని ధర్మపత్ని అంటూ శలవిచ్చాడు.
ముగ్గురు మాతలు ఒకరినొకరు చూసుకున్నారు.  ఓక పరీక్ష పెట్టదలచారు. వెంటనే కొన్ని ఇనుప శనగలను సృష్టించి ఒక బట్టలో కట్టి నారదునికి ఇస్తూ, నారదా, ఇవి ఇనుప శనగలు, నీవు ఇప్పుడే ఆమె వద్దకు వెళ్ళి వీటిని ఉడికించి పెట్టమని చెప్పి తీసుకురా ఆఙ్ఞలాంటి స్వరంతో అంది.
ఆఙ్ఞ  తల్లీ, అసలే ఆకలితో వున్నాను, నాలుగు శనగలు నోట్లో వేసుకుంటే ఎమీ అనుకోకు మాతా అంటూ శలవు తీసుకున్నాడు. శనగలు వుడకటమూ ఖాయం, మీరు ఉడుక్కోవడమూ ఖాయమని అనుకుంటూ.
ఆత్రి మహామునికి వందనాలు, అనసూయా మాతకు ప్రణామాలు అంటూ ఆశ్రమంలోనికి వ్రవేశించాడు నారదుడు.
రండి దేవర్షీ రండి అంటూ సాదరంగా ఆహ్వానించి, కాళ్ళుకడిగి, అర్ఘ్యపాద్యాదులైన తర్వాత, ఎమిటి మహాత్మా విశేషాలు అంటూ అడిగారు దంపతులు.
మునివరేణ్యా!, త్రిగుణాలకూ అతీతమైన చిత్తస్థైర్యాన్ని కలిగినవాడివి, అత్రి నామధేయుదవు నీవు, ఈమె మానవ సహజమైన ఈర్ష్యాసూయలకు అతీతురాలు అనసూయా మాత, మీ దంపతుల దర్శనాభిలాషినై వచ్చాను. అన్నాడు.
కొంచెం సేపు కుశలప్రశ్నలయిన తర్వాత, అమ్మా ఆకలిగా వుంది, ఏదో జిహ్వచాపల్యం కొద్దీ దారిలో దొరికిన ఈ శనగలను మూటకట్టుకొచ్చాను, కాస్త వుడికించి పెట్టవూ అంటూ శనగలమూటను ఆమెకిచ్చాడు.
అయ్యో ఇందాకే వంటపూర్తిచేసి అగ్నిచ్యుతం గావించానే అనుకుంటూ ఆ శనగల మూటను అందుకుని, కళ్ళుమూసుకుని ధ్యానమగ్నురాలయ్యింది. మెల్లగా కనులు విప్పి, మూటను నారదునికిస్తూ, తీసుకోండి దేవమునీ అంటూ అందించింది. నారదుడు, మూటవిప్పి నాలుగు శనగలు నోట్లో వేసుకుని, ఆహా, అద్భుతం తల్లీ, నీ జన్మ చరితార్ధమవుతుంది, బిడ్డ ఆకలి తీర్చిన తల్లివి, త్వరలోనే మీకు సంతానం కలుగుతుందని దీవించి అక్కడి నుండి బయలుదేరాడు.
కైలాసంలో, త్రిమాతలు, మాటాపలుకూ లేకుండా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు. నారదుణ్ణి చూస్తూనే వచ్చావా నారదా! వెళ్ళినపనేమయింది అంటూ ప్రశ్నించారు. ఇవిగో తల్లీ మీరిచ్చిన శనగలు అంటూ అందిస్తూ, మళ్ళీ రెండు శనగలు తీసి నోట్లో వేసుకున్నాడు. ఆవి చూసిన ముగ్గురు మాతలూ నిశ్చేష్టలయ్యారు, అప్పటికే శచీదేవి అందించిన వుప్పందుకుని పరుగుపరుగున వచ్చిపడ్డాదు దేవేంద్రుడు. అనసూయా మాత పాతివ్ర్యత్యపు సెగలు స్వర్గాన్ని తాకటమూ ఇంద్రుడిలో గుబులు మొదలవ్వటమూ ఆపాటికే జరిగిపోయి ఆమెనెలా నియంత్రించాలా అని అవకాశం కోసం ఎదురు చూస్తూవున్నాడు.
వ్యాహ్యాళికోసం బయటకు వెళ్ళిన త్రిమూర్తులు, అప్పుడే అడుగుపెట్టారు. వారిని చూస్తూనే, ముగ్గురు శక్తులూ వారి వారి పతులను సమీపించి విషయాన్ని విన్నవించారు. ముగ్గురూ ముక్తకంఠంతో తీర్మానం చేసినట్లుగా ఇలా అన్నారు. మేము ముగ్గురమూ అనసూయా దేవి పాతివ్రత్యాన్ని పరీక్షింపదలచాము, మీ త్రిమూర్తులు ముగ్గురూ ఇప్పుడే వెళ్ళి పరీక్షించి రావసిందని చెప్పారు.
ఆనివార్యమైన సతుల మాట శిరోధార్యమనుకుంటూ, ఒక కంట నారదుణ్ణీ చూస్తూ బయలుదేరారు. ఇంద్రుడు లోలోపల తృప్తిపడ్డాడు.
సకల ఫల వృక్షతతులతోనూ, సర్వ జాతి పశు పక్ష్యాదులతోనూ, నిత్యవసంతంగా శోభిల్లుతోంది అత్రి ముని ఆశ్రమం. నిరంతరతపోదీక్షతో నిత్యయౌవనవంతులై విరాజిల్లు ఆ మునిదంపతుల వద్దకు త్రిమూర్తులు ముగ్గురూ ప్రచ్చన్నవేషధారులై  మౌనిరూపంలో అడుగుపెట్టారు.  అనసూయా మాత అతిధులకు సాదరముగా ఆహ్వానము పలికి, అర్ఘ్య పాద్యముల నిచ్చిన తరువాత, స్వామీ, మీ రాకతో మా గృహము, మనమూ రెండూ పావనమయినవి.  తమరీపూట మాయింట ఆతిధ్యము స్వీకరించి మమ్ములను కృతార్ధులను చేయవలసినది. నా పతి స్నానార్ధమై నదికి వెళ్లి యున్నారు. ఇహనో ఇప్పుడో వచ్చేస్తారు. మీరు మీ సంధ్యావందనాది విదులుకానివ్వండి అని వేడుకుంది.  
అందుకు మాకభ్యంతరములేదు, నీ పతి కొరకు వేచివుండే వ్యవధీ మాకులేదు. వెంటనే వడ్డన ఏర్పాట్లు చేయమని తొందర పెట్టారు. ఆమె సరేనంటూ లోనికెళ్ళ బోతూవుండగా  ఆమెను పిలిచి మేమొక వ్రతబద్ధులమై యున్నాము. మేము వివస్త్ర యైన గృహిణి చేతి వడ్డన మాత్రమే భుజించెదమని చెప్పారు.
విని దంపతులు నిశ్చేష్టురాలయ్యింది. అంతలోనే తెరుకుని లోనికి వెళ్ళీంది. ఓక్క క్షణం ధ్యానమగ్నురాలై విషయము గ్రహించినది. మనోవాక్కాయ కర్మలయందు భర్తను స్మరించింది. ఫూజా మందిరమందున్న తీర్ధ పాత్రను గ్రహించి వారివద్దకు వచ్చి,  అతిధులారా, ముందుగా ఈ తీర్ధమును గ్రహించండి, మిగిలిన యేర్పాట్లను తర్వాత చేస్తానని తీర్ధజలమిచ్చి, కొంచెము జలమును వారిపై ప్రోక్షణ చేసింది.
ఆప్పుడొక అద్భుతము జరిగినది. ఆతిధి వేషాన వున్న త్రిమూర్తులు మువ్వురూ, మువ్వురు ముద్దులొలుకు బాలలుగా మారిపోయారు. బోసినవ్వులతోను, దిస మొలలతోనూ కేరింతలు కొడుతూ ఆడుతున్నారు.
సర్వ చరాచర సృష్టి  ఒక్క క్షణం అచ్చెరువుతో నిశ్చేష్టితమయింది. ఇంతలో స్నాన సంధ్యలు కావించుకుని అత్రి మునీంద్రులు విచ్చేసారు. అనసూయద్వారా విషయాన్ని తెలుసుకున్నారు. చిరునవ్వులొలికించు చిన్నారులను చూస్తూనే ఆ ముని దంపతుల కళ్ళు కారు మేఘములై ఆనందవర్షమును కురిపించాయి. ఆనసూయా మాత మాతృ హృదయముప్పొంగింది. స్తన్యములు చేపుకొచ్చినవి, క్షీరములుబుకుచున్నవి. అమందానందకందళితమైన హృదయముతో, మెల్లగా చేయిసాచి ఒక్కొక బిడ్డనూ యెత్తుకుని ముద్దాడి, స్తన్యమిచ్చి, ఆ ముగ్గిరి బాలల క్షుదార్తిని తీర్చింది. సుష్టుగా పాలారగించిన బాలలు పరవశంతో మెల్లగా సుషుప్తిలోనికి జారుకొన్నారు. వారిని ఒడిజేర్చి లాలించిన దంపతులిద్దరూ అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించారు.
వెళ్ళిన పతులెంతకీ రాకపోయేసరికి, లక్ష్మి, పార్వతి, సరస్వతులకు మనన్సు ఎదో సంశయానికి లోనయ్యింది. దృష్టిసారించి చూడగా విషయం అర్ధమైంది. గుండె ఒక్కసారిగా గతుక్కు మంది. వెంటనే నారదుణ్ణి వెంటతీసుకుని ఆశ్రమానికి చేరుకున్నారు.
తల్లి ఒడిలో పసిపాపలై, బోసినవ్వులొలికిస్తూ కేరింతలు కొడుతున్న తమ తమ భర్తలను చూసి బెంబేలెత్తి పోయారు. సృష్టి, స్థితి, లయ కారకులైన ఈ ముగ్గురూ యిలా బాలలై తల్లి మురిపాలలో తేలిఆడుతుంటే, అక్కడ జగత్పరిపాలన గతేంగాను. ఆనవసరమైన భేషజాలకు పోయి తామే తిప్పలు కొనితెచ్చుకొన్నామని చింతించారు.  తమ అవివేకానికి కించిత్ లజ్జపడుతూ నారదుణ్ణి చూసారు, ఏమిటి కర్తవ్యమని.
 నారదుడు మాత్రం,  అత్రి అనసూయల కంటే ఆనందం అనుభవిస్తున్నాడు. పసిబాలల వూయలల చుట్టూ తిరుగుతూ తనూ చిన్నపిల్లవాడైపోయి కేరింతలు కొడుతున్నాడు. ఆమ్మ వార్ల చూపునర్ధం చేసుకున్నవాడై, నవ్వుతూ దోసిలి చూపి అర్ధించటమొక్కటే మార్గమని చెప్పాడు.
ఆమ్మవార్లు ముగ్గురూ అనసూయా మాతకు పాదములంటి ప్రణమిల్లారు,  కొంగులు సాచి తమను క్షమించి పతిబిక్ష పెట్టమని అర్ధించారు. ఆనసూయామాత వారిని సాదరంగా భుజములు పట్టి లేవనెత్తి దగ్గరకు తీసుకుంది. తలనిమిరింది. నుదుట ముద్దు పెట్టుకుంది. ఆ స్పర్శలో పులకించిపోయారు అమ్మవార్లు మువ్వురూ. ఆనిర్వచనీయమైన ప్రేమ భావానికి లోనయ్యారు. ఓక క్షణం  తామూ పసిగుడ్డులై ఆ తల్లి ఒడిచేరి ఓలలాడాలని తలచారు ఆ మాతృస్పర్శకు
వారి ఆనందపారవస్యాన్ని చూస్తుంటే వచ్చిన పని మరిచేటట్లున్నారని భావించి నారదుడు
ఆమ్మా! అనసూయాదేవి, మీ దంపతుల అదృషమేమని వర్ణింపగలము. సాక్షాత్తూ త్రిమూర్తులే నీ నట్టింటి పాపలై నడయాడుతున్నారు. ఇక జగన్మాతలు ముగ్గురూ నీ మునివాకిట పతిబిక్షనర్ధిస్తూ కొంగుసాచి నిలుచున్నారు. కరుణించు తల్లీ, వారికి పతిబిక్షను ప్రసాదించి , జగద్రక్షను చేయమని వేడుకొన్నాడు.
ఈ అదృష్టము, అనుభవమూ కలయో వైష్ణవ మాయో కాకుండా చూడమని, ముక్కోటి దేవతలనూ ప్రార్ధించింది. హృదయంలో వుప్పొంగే ఆనందం పెల్లుబికి కన్నులద్వారా బహిర్గతమవుతోంది. జరగబోయేది లీలగా కంటిముందు కనబడుతోంది. తను కరుణించి, వారి మాట మన్నించి బిక్షనిచ్చిందా, తన మాతృత్వపు ముచ్చట ముచ్చటగానే మిగులుతుంది. కానీ, దీన్ని శాశ్వతం చేసుకోవాలనే దురాశా తనకు లేదు. ఈ పాటి అదృష్టానికైనా నోచుకున్నందుకు గోచరాగోచరమైన  దేవతలందరికి వినమ్రంగా నమస్కరించుకొంది. వర్షిస్తున్న కళ్ళను కొంగుతో వత్తుకుంది. గుండెలోంచి ఎగసిపడుతూ వస్తున్న దుఃఖసాగరానికి పెదవులవద్దే చెలియలికట్ట వేసింది. అంతలోనే ప్రసన్న వదనురాలైపోయింది. ఓక్కొక్క బాలకుణ్ణీ చేతులలోకి తీసుకుంది, గుండెలకు హత్తుకుంది, ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది. ఫ్రక్కనున్న భర్తకు అందించింది. ఆయన మందస్మి తంతో దక్షిణహస్తంతో బాలకుల శిరస్సులు తాకి ఆశీర్వదించాడు. పితృవాత్సల్య సంభరితమైన ఆ కర స్పర్శకు బాలకులు, బాలకుల కుక్షినిక్షిప్తమైన జగమ్ములు యావత్తూ పులకించిపొయాయి. ఆత్రిమహా మునికూడా అదే ఆనంద పారవశ్యాన్ననుభవిస్తూ ఉండిపోయాడు. వీరి అదృష్టాన్ని, ఆనందపారవస్యాన్ని కనులారా వీక్షిస్తున్న నారడునికీ, త్రి మాతలకూ, వారితో మమేకమై చూస్తున్న తోటి మునిజనసందోహానికీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. పరిదీనులై, కొంగుసాచి నిలుచున్న ఒక్కొక్కరి చేతిలోనూ వారి వారి భర్తలను పెడుతోంది అనసూయా మాత. అప్పటిదాకా బాలకుల రూపంలో వున్న వారు వారి వారి భార్యల స్పర్శ తాకగానే నిజరూపులై నిలుచున్నారు. సతీ సమేతులై నిలుచున్న త్రిమూర్తులకు ఉపచారములు గావించి నమస్కరించారు దంపతులు.
ఆమ్మా! నీవంటి మహా పతివ్రతను తల్లిగాపొంది, స్తన్యము గ్రోలి, నీ ఒడిచెరి జీరాడిన మాజన్మ ధన్యమైనది తల్లీ. నీ మనోరథాన్ని నెరవేర్చడానికి మేము సిద్ధంగా వున్నాం. నీ కోరిక యేదైనా సరే నిస్సంకోచంగా అడగవచ్చు అన్నారు. అత్రి ముని కూడా సాదరంగా ఆమె వైపు చూసారు అడగమన్నట్లుగా. స్వామీ స్త్రీ జన్మకు సార్థకత బిడ్డలు కలిగినప్పుడే కదా. మీ వల్ల ఈ నాడు నాకా ఆనందం లభించింది. ఈ ఆనందాన్ని నిజంచేసి మాజన్మలు చరితార్థం జేయమని కోరింది. నిజానికి కైవల్యం కోరినా కాదనకుండా ఇవ్వటానికి సంసిద్ధులై వున్నారు వారు. ఆమె ధర్మబద్ధమైన కోరికను విని సంతసించి యిలా అన్నారు. నీ మాతృత్వాన్ని నిజంజేస్తూ, మా మువ్వురి అంశలు కలిగిన ఒక కుమారుని మీ దంపతులకు ప్రసాదిస్తున్నాము. అతని ద్వారా నీ మాతృత్వం పరిపూర్ణంగాసిద్ధించగలదు. మీ వాత్సల్యానుగాల్ని పంచి యిచ్చి మీరు పరిపూర్ణ మైన ఆనందాన్ని పొందగలరు.  అతనికి దత్తత్రేయుడని నామకరణం చేయండి. మహా ఙ్ఞానియైన అతడు కారణ జన్ముడు. అతనిద్వారా ఈ భూలోకమున నెరవేర్చబడవలసిన కార్యములు కొన్ని నిర్దేశింపబడివున్న కారణమున షోడశ వర్శప్రాయము వరకు మీ వద్దవుండి పిమ్మట జగద్గురువై, జీవులనుద్ధరించుటకు ప్రయాణము సాగించును. చతుర్వేదములు అతని వెంట ప్రచ్చన్న శునకరూపులై వుంటాయి. అటుపిమ్మట కాలానుగుణముగా అనేకానేక అవతారములనెత్తి,అవధూతయై యెన్నొ లీలలను జూపి భక్తులనాకర్షించి బొధనలద్వారా వారినుద్ధరింపనున్నాడు. ఆతని తల్లిదండ్రులుగా మీరున్నూ విశేషముగా కీర్తింపబడతారు అని దీవించి అంతర్ధానమయ్యారు.
 అనతి కాలంలోనే త్రిమూర్తుల వరప్రభావం తో అత్రి అనసూయలకు పుత్రుడు జన్మించాడు. బ్రహ్మతేజోమయమూర్తి యై, సర్వశుభ లక్షితుడై మూడు తలలతో ప్రభవించిన పుత్రుణ్ణి చూచి సాక్షాత్తూ త్రిమూర్తులే మళ్ళీ వారింట పుట్టినంతగా సంతోషించారు ఇరువురూ. ఆశ్రమం అంతటా సంబరాలు జరుపు కున్నారు, జరగబోయే లోక కల్యాణానికి సూచనగా.
అతడు దినదిన ప్రవర్ధమానుడై అపారమైన ప్రజ్ఞా పాటమవములతో చూస్తుండగానే పెద్దవాడై, తల్లి దండ్రుల వద్ద శలవు తీసుకుని, ధర్మ  ప్రచరానికి బయలుదేరి వెళ్ళాడు. నాలుగు వేదాలు నాలుగు శునక రూపములై అతని వెంట సాగిపొయినవి.
*****
శ్రీ దత్తాత్రేయ జయంతి (మార్గశిర పౌర్ణమి నాడు) నాడు చిన్న తనంలో మాచేత కుక్కలకు రొట్టె ముక్కలు వేయించే వారు.
*****

కామెంట్‌లు లేవు: