Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

22, డిసెంబర్ 2014, సోమవారం

ఆ రేపటి కోసం!

[శశిధర్ పింగళి ]

ఎప్పటినుంచో ఓ కోరిక
కోరికగానే మిగిలిపోతోంది..
ఆశలతీరానికి దగ్గరగా వుంటూ
అలసత్వానికి బలైపోతొంది..
లేలేతపాదాలతో నువ్వు
నడిచొస్తుంటే చూడాలనీ...
కనీ కనిపించకుండా
నువు దాగుడుమూతలాడుతుంటే
చూసి నవ్వుకోవాలనీ...
చేతులుసాచి గుండెలనిండా
నిన్ను హత్తుకోవాలనీ...
చిన్ని ఆశ!
నువ్వొస్తావనే 
మునివాకిలినిముగ్గుల్తో అలంకరించా
అర్ధరాత్రికూడా దాటకుండానే
అంతరంగపుటరుగులమీద
రంగవల్లులేసుకున్నాను - అక్కడ
నీతో కూర్చొని కబుర్లు చెప్పాలని
ఆశ పడ్డా!
రాత్రంతా నీ తలపుల జడిలో పడి
తడిసి ముద్దవుతూ వుంటే
ఓ వెచ్చని ఒడి
మెల్లగా నన్ను తనలోకి లాక్కుంది
పొద్దున్నే -
నీవంపిన కబురు నన్ను జేరే లోగా
ఎవరో బరువైన బద్దకాన్ని – నా
రెప్పలపై పెట్టి వెళ్ళిపోయారు..
వదిలించుకుని లేచేసరికి  నువ్వేమో
అందనంత యెత్తుకెదిగిపోయావ్..
ఇప్పటికీ – నువ్వు వస్తుంటే
చూడాలన్న - ఆ
కోరిక అలాగే వుండిపోయింది.
అయితేనేంలే, అప్పటిదాకా
తోడుతెచ్చుకున్న ఆశ తో
ఎదురుచూస్తూ వుంటా
ఆ రేపటి కోసం!



19, డిసెంబర్ 2014, శుక్రవారం

సరిహద్దు రాళ్ళు


[శశిధర్ పింగళి]

సరిహద్దు రాళ్ళు పీకేస్తే – చాలు
సమస్యలు తీరిపోతాయనుకున్నాం
సామరస్యం వెల్లివిరుస్తుం దనుకున్నాం
చదరపు విస్తీర్ణం పెరిగిందే తప్ప
హృదయ వైశాల్యం పెరగలేదు
కూలిన గోడలపై నుంచీ
హోరెత్తించే పడమర గాలులు ఓ ప్రక్కా –
అంతర్జాలపు రహదారులపై
అవిశ్రాంతం గా నడిచొచ్చే
అశ్లీలపు నీలినీడలు ఓ ప్రక్కా -
అర్ధరాత్రి జొరబడే ఆగంతకపు
ఆలోచనలింకోవైపు
నా యువత గుండెల్లో గందరగోళాన్ని
సృష్టించి - బందిపోటు
తత్వాన్ని బలంగా నింపుతున్నాయి
మనం అందంగా కట్టుకున్న
కట్టుబాటు గోడల్ని పడద్రోసి
కొంపల్ని కూల్చేస్తున్న – సు
పుత్రుల్ని చూసి – భారతమాత
మౌనంగా – రోదిస్తోంది
చెరిగిన సరిహద్దుల సాక్షిగా
సంకోచిస్తున్న
మానవ సంబంధాల మధ్య
మనిషికీ మనిషికీ మధ్య – కట్టుకున్న
మహా కుడ్యాల మధ్య
మనకి మనమే ఎవరికీ వారే
మహారాజుల్లా వెలిగిపోతున్నాం
విశ్వపువీధుల్లో మాత్రం
వెలవెల  పోతున్నాం
--------------

17, డిసెంబర్ 2014, బుధవారం

నమ్మకమే జీవితం

[శశిధర్ పింగళి]

ప్రేమగా నాటిన విత్తు
మొలకెత్తి -మొక్కై
ఆకులు తొడుగుతున్నప్పుడు
మొగ్గలు పువ్వులై  తోటంతా
ఆక్రమించుకున్నప్పుడు
గుండె గదంతా పూర్తిగా
పరుచుకున్న - ఆనందం

12, డిసెంబర్ 2014, శుక్రవారం

దినచర్య

[ శశిధర్ పింగళి ] 
ఆకాశద్వారాన్ని - ఆశా కుసుమాలతో
అందంగా అలంకరిస్తున్నారు..
లేలేత పాదాలతో నడిచి వచ్చే
ఆ వెలుగుల రాయనికి
సముద్రజలాల తో అభిషేకించి స్వాగతం
పలుకుతున్నారు ..

8, డిసెంబర్ 2014, సోమవారం

ప్రేమా – దేవుడూ

శశిధర్ పింగళి ]
అక్కడ
దేవుని కోసం
యజ్ఞాలు చేస్తున్నారు
వాళ్లు –
ఇక్కడ
ప్రేమకోసం – ఏకంగా
యుద్ధాలే చేస్తున్నారు
వీళ్ళు –
అక్కడ దేవుడూ దొరకలేదు
ఇక్కడ ప్రేమా దొరకలేదు
అసలు
ప్రేమా – దేవుడూరెండూ ఒకటే
అది
బౌతికవాదానికి అందని
మానసికమైన అనుభూతి మాత్రమే.
--- --- --- 

5, డిసెంబర్ 2014, శుక్రవారం

దత్త జననం-కధ (శ్రీ దత్తాత్రేయ జయంతి, 06.12.2014 మార్గశిర శుద్ధ పౌర్ణమి)


[ శశిధర్ పింగళి ]
కైలాస పర్వతం కోలాహలం గావుంది. దేవ, యక్ష, కిన్నెర, కింపురుషాది స్త్రీ జన పరివారంతో శోభాయ మానంగా వుంది. సమస్త సృష్టికి మూలకారణమైన, జగజ్జనని శ్రీ పార్వతీదేవి దుష్ట దనుజ సంహారము గావించి, ముల్లొకములలోనూ శాంతిస్థాపన గావించినందుకు గానూ విజయోత్సవ వేడుకలు జరుపు తున్నారు.  ఫార్వతీదేవి, దేవలోకంలోని స్త్రీలందరినీ పిలిచి పేరంటం చేస్తోంది. తమ త్రిశక్తులలో ఒకటైన పార్వతి సాధించిన విజయాన్ని తమ విజయంగానే భావించి ఆనందపడుతున్నారు లక్ష్మి సరస్వతులు.
విజయోత్సవంలో భాగంగా, త్రిశక్తులు, తమతమ పతులకు పాదపూజ చేసారు. ఆరి ఆశీర్వాదాలు స్వీకరిస్తుండాగా నారద మహాముని వచ్చారు.

4, డిసెంబర్ 2014, గురువారం

కాటుక కంటి నీరు మణి కట్టుపయింబడనేల యేడ్చెదో !?

[ శశిధర్ పింగళి ]

ఫేసు బుక్ లో మిత్రులు సరదాగా పెట్టిన ఈ బొమ్మకు ఓక సరదా పద్యం...



















కాటుక కంటి నీరు మణి కట్టుపయింబడ నేలయేడ్చెదో
పాటల గంధి! లేఁ జివురు  ప్రాయపుదాన! భయంబదేల, నా
మాటలు నమ్ముమింక అనుమానము మానుము, ఫేసుబుక్కులో
ఘాటగు లైకులిచ్చి నిను గాఢముగా గెలిపింతునే చెలీ!


1, డిసెంబర్ 2014, సోమవారం

ఒరుగుతున్న ఆకాశం

[ శశిధర్ పింగళి ]
గుండె లోపలి పొరల్లో – ఇంకా
ఇంకిపోని – తడేదో అప్పుడప్పుడు
కంటి కొలకుల్లో – మంచు ముత్యమై
మెరుస్తుంది -
వారాంతాల్లో వచ్చే
పొడిబారిన పలక రింపుల మధ్య
వడిలిన పెదాలపై – హరివిల్లొకటి
విరుగుతుంది –