Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

29, నవంబర్ 2014, శనివారం

నిలువెత్తు నిజం


[శశిధర్ పింగళి]
పాతవాసనల్ని పూర్తిగా 
తుడిచేసి - వంటికి 
వర్తమానపు రంగులద్ది
పొందిగ్గా పొత్తిళ్ళలో పెట్టి
అమ్మ పక్కలో పెట్టింది ఆయా!
సరిగ్గా - అప్పుడే
సంఘర్షణ మొదలయ్యింది - నాలొ
గతాన్ని మర్చిపోలేక  - వర్తమానంలో
ఇమడలేక చేసే నా ఆక్రందనలు
చుట్టూ వున్న వాళ్ళ ముఖాల్ని 
చేటంతచేసాయి ?!
రోదనలోని వేదనని
గుర్తించడం మానేసి
పాలబుగ్గని నోటికందించి
లోకం చేసే - యేమార్చే
ప్రయత్నం !
శైశవం నుంచి - బాల్యంలోకీ
బాల్యం నుంచీ - యవ్వనంలోకీ
యవ్వనంనుంచీ - వృద్ధాప్యంలోకీ
సాగే ప్రతిప్రయాణంలోనూ  
నన్ను విడువకుండా
నావెంటే వచ్చిన నేస్తం - ఈ
సంఘర్షణే  
మధ్య మధ్యలో అందివచ్చిన 
తాయిలాలన్నీ-  తాత్కాలికమే
కానీ  నా
సంఘర్షణ మాత్రం
నిరంతరం – నిర్విరామం
నిలువెత్తు నిజం .. 
------------ 

28, నవంబర్ 2014, శుక్రవారం

నా నేల - నా గాలి

[శశిధర్ పింగళి]

రెండు వేర్వేరు తోటల్లో పెరిగిన మొక్కల్ని
ఒకచోట అంటుకట్టారు
అంటుకున్న బలమేమిటో కానీ
ఏ జవం ఏ జీవంలోకి పరావర్తనం చెందిందో
చెప్పలేనంతగా – ఎదిగిన
రెండుగా కనిపించే - ఏకాండీవృక్షం

2, నవంబర్ 2014, ఆదివారం

బాపూ గారి మీద ప్రత్యేక సంచిక - సుజన రంజని

బాపూ గారి మీద ప్రత్యేక సంచిక గా  సుజన రంజని (సిలికాన్ ఆంధ్ర వారిది) నవంబరు సంచిక విడుదలయ్యింది. విశ్వవ్యాప్తంగా బాపూ-రమణ గార్ల కున్న అభిమానులు,  ఏకలవ్య శిష్యులు ఎందరో తమ తమ అనుభవాల్ని, అనుభూతుల్ని, అత్మీయతని చాటుకున్నారు. ఉడుతా భక్తిగా నే వ్రాసిన "స్వర్గారోహణం లో బాపూ" కధని స్వీకరించిన  "సుజన రంజని" (చూ . 50 వ పుట ) వారి సౌజన్యానికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. - శశిధర్ పింగళి