స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

1, సెప్టెంబర్ 2014, సోమవారం

తెలుగక్షరం (బాపూ-రమణ)

[ శశిధర్ పింగళి ]


తెలుగక్షరం మూగబోయింది. గుణింతంలేని గీత నిలువునా కూలిపోయింది. నాకు ఊహతెలిసినప్పటినుండి, నేను కన్నంతవరకూ, విన్నంతవరకూ ఇంతటి స్నేహబంధాన్ని చూడలేదు. ఒకటా రెండా డెభై వసంతాలు ఎక్కడా ఏ పొరపొచ్చాలూ లేకుండా కలిసి మెలిసి ఉండటమంటే మాటలుకాదు. ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములే కలిసి వుండలేని కాలమిది. అటువంటిది ఇంత ఆత్మీయతను పెనవేసుకుని పుట్టిన బాపూ-రమణలు చిరస్మరణీయులు. తెలుగక్షరానిని మాటలునేర్పినదొకరైతే ఆమాటకు రూపాన్నిచ్చింది మరొకరు. అసలు మనకుతెలుగు అక్షరాలు రెండుగా విభజింపబడ్డాయి అచ్చులు, హల్లులు. ఇవిరెండూ కలిస్తేనే అక్షరం పరిపూర్ణమవుతుంది. మాటపుడుతుంది. కేవలం అచ్చులతో మాట్లాడితే మూగవాడు మాట్లాడినట్లుంటుంది. అలాగే హల్లులతో మాట్లాడితే ఎక్కిళ్ళు వచ్చినట్లుటుంది. రెండూ కలిస్తేనే రసరమ్యమైన భాషవుతుంది. ఇందులో అచ్చమైన అచ్చచ్చరం (గుణింతం) రమణ గారైతే హొయలొలికే హల్లక్షరం బాపూ గారు.
ఇద్దరి దృష్టి ఒకటే. దృక్పధం ఒకటే. తెలుగును వెలిగించటం. తెలుగుదనాన్ని బ్రతికించటం. నిజానికి వీరిద్దరికీ రావలసినంత కీర్తి రాలేదు. రమణగారి భాష తెలుగు కాబట్టి కొన్ని పరిమితులుండివుండవచ్చు, బాపూగారిది భాషతో వ్యాఖ్యానం అవసరంలేని బొమ్మ. ఎంత విశ్వవిఖ్యాతమవ్వాలి ఏదోఇచ్చామన్నట్లు నిన్న గాక మొన్న ఓ పద్మశ్రీ ఇచ్చారు. పోనీలెమ్మన్నట్లు ఆయనా పుచ్చుకున్నారు. నిజంచెప్పాలంటే ఇద్దరికిద్దరూ వట్టి అమాయకులూ అల్పసంతోషులూను.

ఇద్దరూ వేరువేరు శరీరాల్లో వున్నా ఆత్మ ఒకటేనన్నట్లుగా జీవించారు. నిజానికి రమణగారి నిష్క్రమణతోనే బాపూ గారి జవం పోయింది. జీవం ఇప్పుడుపోయింది అంతే.

 మనిషి ముఖంమీద నవ్వు వున్నంతవరకూ, తెలుగమ్మాయిలున్నంతవరకూ వారు మనతోనే వుంటారు. అందుకే మనవంతుగా ఆ ఇద్దరికీ నివాళులర్పిస్తూ వారి ఆత్మలకు శాంతిచేకూరాలని కోరుకుందాం.

చివరగా మనం ఓదార్చవలసిన వాళ్ళూ, హఠాత్తుగా పెద్దైపోయిన పిడుగులు "బుడుగు", "రెండుజళ్ళ సీత", "సీ గానపెసూనాంబ" ఎలావున్నారో పాపం!!
 - - -

1 వ్యాఖ్య:

శ్యామలీయం చెప్పారు...

ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
రాత గీత భువిని రాజ్యమేలె
రాత నిన్న చనెను గీత నేడు చనెను
రాత గీత దివిని రాజ్యమేలు