Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

31, మార్చి 2014, సోమవారం

జయహో జయీభవ

రచన: పింగళి వేంకట శ్రీనివాస రావు [సెల్: 9618409607]

శా||    శ్రీకల్యాణ గుణావహుండు జగతిన్ చిద్రూపకాలాకృతిన్
         సాకారంబయి నాది అంతములకున్ సాక్ష్యంబు లేకుండగా
        సాకల్యంబగు మాయవేషములతో శైలూషుడై యాడ సు
        శ్లోకుండై జయనామధేయుడగుచున్ శోభిల్లవిచ్చేసిడిన్.            1

గీ||    శుద్ధవైరాగ్య భావనాస్ఫోరకముగ
        ఆకులను రాల్చు పాదప యతులమేన
       చివురు జొంపాలవలువలు సిద్ధపరచి
       మనసు మరలంగజేసెడి మహిత ఋతువు.                2

సీ||    వాసంత నవరాత్ర వర్ధితమ్మైనట్టి
                రమణీయశోభతో గ్రాలు ఋతువు
        చెలువమ్ము నిండార శ్రీరామ జానకీ
               కల్యాణములు చేయు కామ్య ఋతువు
        సాగరమ్మున గ్రుంకి సలలితమ్మైనట్టి
              సరిగంగస్నానాలు సలుపు ఋతువు
        ఇక్షుశరాసను నెలమి తూపుల పంట
             విరివిగా రాజిల్లి విరుయు ఋతువు
గీ||    కంటికింపైన కౌముదుల్ మింటవెలుగు
        అతిమనోహర లావణ్య ఋతువతంసు
        డవని కరుదెంచె విశ్వవిఖ్యాత కీర్తి
        దర్పమలరంగ జయనికేతనముబూని                        ౩

గీ||    శిశిరమును త్రోసి రాజిల్లు చేవగాడు
        కాలపురుషుని తొలుదొల్త కడుపుపంట
       తుంటవిలుకాని నెయ్యంపు కంటివెలుగు
       సరస ఋతురాజు వచ్చె వసంతుడిలకు.                    4

గీ||    ఆది ఋతురాజు వైభవమవని చాట
        కోరి సహకార పల్లవకోమలములు
       మెక్కి రెచ్చిన కంఠాన మించిపాడె
       కొమ్మ కొమ్మను జేరి పుంస్కోకిలమ్ము.                    5

గీ||   శ్రీలు కెంగేలధరియించి కాలవిభుడు
       చైత్ర రధమెక్కి ముదమార జైత్రయాత్ర
       సకలహితగామి సఖుడు వసంతుతోడ
       ఇలకు చనుదెంచె సదయుడై ఎలమిమీర!                    6

ఉ||   స్వాగతమో సమాగత సువత్సర కాల కుమారయంచు, నీ
       యాగమనమ్ము కోరి హృదయమ్మును కోవెలరీతి జేసి, పు
       న్నాగవరాళిలో వర సునాదవినోద సరాగ రంజికా
       రాగమునూది పల్కె మది రంజిల కోయిల గున్నమావిపై.            7

చం|| అరుదుగ వచ్చితీవు నిలనర్వది వత్సరముల్ గతించె, నీ
       దరిశన భాగ్యమబ్బకను, ధన్యులమైతిమి నీదురాకచే
       మురిపెముతోడ నీ మృదుల పుణ్యకరమ్మున నాశిషావళుల్
       ధరపయి గ్రుమ్మరించి మముధార్మిక వృత్తిని నేలుకొమ్మికన్!        8

ఉ||   కాలమనంగ దైవతము కాలము గాయపు నౌషధంబగున్
       కాల మనంతవాహిని సుఖంబును కష్టములారుపాళ్ళుగా
       మేలగు షడ్రసోభరిత మేలిరసాయనమందజేయు నో
       కాలస్వరూప! ఓ జయ సుకాలకుమారమ! నీకు మ్రొక్కెదన్.        9

మ|| ఋతుషట్కంబులనేల వచ్చిన మహోత్కృష్ట ప్రభారాశి! నీ
      యతులైశ్వర్య కృపాకటాక్షముల నత్యంత ప్రమోదమ్ముతో
      క్షితిసంవాసుల మీద జూపి గొనుమా! కీర్తి ప్రశంశోన్నతుల్
      గతగాయంబులు మాన్పగా తగినదీ కాలంబు శ్రేయస్కరా!         10

ఉ|| మానవతల్ ప్రవాహముగ మానిసి నిత్యము తోటివారికిన్
     మానిత రీతి సాయపడు మంజుల మానస భవ్యనందనో
     ద్యాన వనాంతరమ్ముల సుధారస పూరిత దివ్యపుష్ప సం
     ధానము గూర్చుమోయి సురధామపు శ్రీజయ! తోటమాలివై.        11

శా|| శ్రీమంతంబయి పండుగాక! పృధివిన్ స్నేహార్ద్రతా భావముల్
     సామంతంబయి నిండుగాక! సుమనోసామ్రాజ్యముల్ పాలితుల్
     సీమంతంబగుగాక! సృష్టి; సమతా శ్రీసస్యకేదారమై
     హేమంతంబగుగాక శ్రీ జయ శుభశ్రీనామ కాలంబిలన్.            12