Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

14, డిసెంబర్ 2013, శనివారం

మరీచిక

[పింగళి వేంకట శ్రీనివాసరావు]

అలతి దవ్వున కానవచ్చెను | అప్సరాంగన వంటి అంగన
చూపులందున చూపు కలుపుచు | కనులపాత్రల నన్ను ద్రావుచు
కన్ను గీటుచు సైగచేసెను | కౌగిలింతకు నన్ను రమ్మని
లలన చూపుల మేను మరచితి | దరహసించితి పరవశమ్మున
చూపుమరలక నామె వైపే | నన్ను నేనే కోలుపోయితి
పృథివి కదలెను కాలి యడుగున | అడుగు వెంబడి అడుగు వేయుచు
పయన మైతిని యువిద పథమున | ఏగుచుంటిని పయనమాపక
అంతలో నొక మజిలి చెంగట  | అంగనామణి వేరె యొక్కతె
ఆర్తితో దరిచేరి సాగిలె | హృదయపద్మ నివేదనమ్ముగ.
మోము ద్రిప్పితి దారి మార్చితి  |  దవ్వులంగల పడతి జూచుచు.
పయనమాపక పడతి బాటను | ఏగితేగితి అలయుదనుకను
ఎంత యేగిన దవ్వు తరుగదు | అంగనామణి చెంగలించదు
పసిడి ప్రాయము వడలి పోయెను | పశ్చిమాద్రికి చేరె సూర్యుడు.
పయన మాపితి పడతి జూచితి | ఎవరు నీవని గద్దరించితి.
కిలకిలార్భటి చేసి యంగన | వెర్రివాడా! వెంగళప్పా!
మోసపోయితివీవు ననుగని | "మరీచిక" నా నామమనుచును
అదృశించెను అంతలోనే | మెరుపు తీవై గగన వీధిని.
వెనుక జూచితి వెల్లువైచను | వెక్కిరింతగ నన్ను జూచుచు
హృదయపద్మ నివేదనా సతి | "తేజి" కనబడె గగన తలమున
ఆత్మ లోనికి చూచుకొంటిని | అంతర్ముఖావలోకినై
తళుకు కాంచన మృగముగని మది | కాలదన్నితి హృదయరాణిని
కూర్మి లేని యేకాకినై  | కోలుపోయితి బ్రతుకు మాధురి
పండె బ్రతుకిట మోడువలెనే  | స్వప్నమాయెను జీవితమ్మే!