Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

21, ఏప్రిల్ 2013, ఆదివారం

శంకరాభరణాలు

 [శశిధర్ పింగళి]

25/02/2013
రణవిభూతుల బాంబుదాడుల రౌద్రులైచెల రేగుచున్
పణమువెట్టిరి మాదుప్రాణము పాడుమూకల ముష్కరుల్
ఫణివిభూషణ! పార్వతీశ్వర! పాహియంచును, నీకృపే
క్షణమెకోరుదు, నిచ్చునాకదె సర్వదా సుఖశాంతులన్.

26/02/2013
సతిని యెడబాసి రాముండు సఖులగూడి
రావణాసురుసేనపై రణము సలుపు
వేళ తేరుతానుగనిల్చి వేగమె రఘు
పతిని తలదాల్చు స్వామికి వందనమ్ము

27/02/2013
పతియె ప్రత్యక్ష దైవంబు పడతికెపుడు
ననెడు సూక్తిని నెరనమ్మి యాచరించి
ఇహముపరముల నాశించు ఇంతికా ప
తిని భజియింప ముక్తి ప్రాప్తించు ననఘ!

(శంకరాభరణం బ్లాగు సమస్యలకు పూరణలు)

2 కామెంట్‌లు:

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

శశిధర్ గారు!
నిన్న "చైతన్య భారతి" సాహిత్య సంస్థ మోతీనగర్(హైదరాబాద్)లో నిర్వహించిన సభలో మీతో ప్రత్యక్ష పరిచయం కలిగినందుకు సంతోషిస్తున్నాను.
మీకు నా శుభాభినందనలు!

Jaabilliraave చెప్పారు...

ధన్యవాదములు ఫణీంద్రగారూ! మీ లాంటి పెద్దల పరిచయం కలగటం మా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో మరింతసేపు ముచ్చటించివుంటే యింకా బాగుండేది.