Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

29, ఏప్రిల్ 2013, సోమవారం

NTR సీతారామకల్యాణం పై ప్రశంసా పద్యాలు

[సేకరణ: శశిధర్ పింగళి]



[మొన్న యు-ట్యూబ్ లో సీతారామకల్యాణం లోని రావణబ్రహ్మ రుద్రవీణా విన్యాసం చూస్తుంటే, ఎప్పుడో చాలారోజుల క్రితం ఈ సినిమాపై ఒక కవి వ్రాసిన పద్యాలు గుర్తుకొచ్చాయి. అవి మీతో పంచుకుందామని పోస్టు చేస్తున్నాను. చూచి ఆనదించండి.]  ఈ లింకు ద్వారా వీక్షించండి 
http://www.youtube.com/watch?v=fWY1ofBN_3Q

రచన:  భాగవతుల సుబ్బరాయకవి.

ఘన భక్త్యర్థ విచిత్ర చిత్రమున నిర్ఘాంతభ్రమద్భీతి, చే
సిన, మీ నాట్యకళాప్రపూర్ణ పటిమన్ జెల్వొంది నల్దిక్కులన్
దనివోపన్నొనరింప జేసెనని సీతారామకల్యాణ మౌ
సినిమా చిత్రము సాక్ష్యమిచ్చు వినుమా! శ్రీయన్.టి.రామాహ్వయా!

అందురుకాక కొందరు జడాంధులు నా దశకంథరుండు; దు
ర్మంద తమోగుణాత్ముడయి మాధవువైరిగ నెంచు నిందలన్
బొందుగ బాపినట్లుగ నపూర్వ రహస్యము సర్వమానవా
మందిరమందు నందుకొనుమాడ్కి నటించితివయ్య రామయా!

పాయనిశంభు భక్త్యమృత ప్రాయుని ధీర వచప్రమేయ; మా
మ్నాయ విధేయుని ప్రతిభ న్యాయమయ ప్రతిమానధేయ; మా
ప్యాయ కళా చమత్కృతి ప్రపంచము మెచ్చినరీతి జూపితే
నీ యభిమాన పాత్ర గణనీయము పండితగేయ రామయా!

ఒక్కొక దృశ్యమున్ గనిన నూహలు నూగుచు నిండిపోవు; నిం
కక్కట భాష్పపూరములు కండ్లకు కమ్ముచు మానవాళికిన్
నిక్కముగా దశాననుడు నిల్చి నటించెనా యంచు దిగ్బ్రమన్
చక్కని భావదృశ్యమయి చక్కెరపానరసంబునయ్యెడిన్.
-----------------------------------------------------

24, ఏప్రిల్ 2013, బుధవారం

శంకరాభరణాలు

[శశిధర్ పింగళి]

20-03-2013
------------------
తీయని తెనుగున పద్యము
వ్రాయుటనేర్పించినారు వాత్సల్యముతో
శ్రేయము గురువరశ్రేణికి
వేయి సమస్యలు కవులకు వేడుకఁ గూర్చెన్
------------------
01-04-2013
వరబలగర్వితులసురుల
పరిమార్చుముతల్లియంచు ప్రార్ధింపంగా
వరమిచ్చిసురలకు శుభం
కరిసింహమునెక్కి దైత్యగణముల దునిమెన్.
----------------------
09-04-2013   అంశము: మయసభ
ఎంచి చూచినదంతయు మంచికాదు
చెడ్డదనుకొన్న దొకసారి చేయుమేలు
కర్మ ఫలములు మనచేత కలవె చెపుమ!
బ్రతుకు నిత్యంబు మయసభై భ్రమలు గొలుపు!
---------------
 ఏకవస్త్రను కులసతి నీడ్చుకొచ్చి
అతడు చేసిన యవమాన మాత్మ తలచి
భీమసేనుడు, గాంధారి పెద్దకొడుకు
నూరుభంగమ్ము గావించె నుగ్రతముడు

(శంకరాభరణం బ్లాగు సమస్యలకు పూరణలు)


21, ఏప్రిల్ 2013, ఆదివారం

శంకరాభరణాలు

 [శశిధర్ పింగళి]

25/02/2013
రణవిభూతుల బాంబుదాడుల రౌద్రులైచెల రేగుచున్
పణమువెట్టిరి మాదుప్రాణము పాడుమూకల ముష్కరుల్
ఫణివిభూషణ! పార్వతీశ్వర! పాహియంచును, నీకృపే
క్షణమెకోరుదు, నిచ్చునాకదె సర్వదా సుఖశాంతులన్.

26/02/2013
సతిని యెడబాసి రాముండు సఖులగూడి
రావణాసురుసేనపై రణము సలుపు
వేళ తేరుతానుగనిల్చి వేగమె రఘు
పతిని తలదాల్చు స్వామికి వందనమ్ము

27/02/2013
పతియె ప్రత్యక్ష దైవంబు పడతికెపుడు
ననెడు సూక్తిని నెరనమ్మి యాచరించి
ఇహముపరముల నాశించు ఇంతికా ప
తిని భజియింప ముక్తి ప్రాప్తించు ననఘ!

(శంకరాభరణం బ్లాగు సమస్యలకు పూరణలు)

11, ఏప్రిల్ 2013, గురువారం

విజయీభవ

[రచన: పింగళి వేంకట శ్రీనివాస రావు (శ్రీకాశ్యప)]
(040-23838408, 8179140596 కార్యదర్శి, చైతన్యభారతి సాహిత్య సాంస్కృతిక పరిషత్.)

గీ||    నగ్న యోగినులట్లుండి నయములేని
    వృక్షవనితల నెమ్మేన వింతవింత
    చివురుజొంపాల వలువలు సిద్ధపరచి
    మాన సంరక్షణముచేయు మహితఋతువు.

గీ||    శిశిరమును త్రోసిరాజిల్లు చేవగాడు
    కాలపురుషుని తొలుదొల్త కడుపుపంట
    తుంట విలుకాని నెయ్యంపు కంటివెలుగు
    సరస ఋతురాజు వచ్చె వసంతుడిలకు.

గీ||    ఆది ఋతురాజు వైభవమవని చాట
    కోరి సహకార పల్లవకోమలములు
    మెక్కి రెచ్చిన కంఠాన మించిపాడె
    కొమ్మ కొమ్మను జేరి పుంస్కోకిలమ్ము.

గీ||    శ్రీలు కెంగేలధరియించి కాలవిభుడు
    చైత్ర రధమెక్కి ముదమార జైత్రయాత్ర
    సకలహితగామి సఖుడు వసంతుతోడ
    ఇలకు చనుదెంచె విజయుడై ఎలమిమీర

ఉ||    స్వాగతమో సమాగత సువత్సర కాల కుమారయంచు, నీ
    యాగమనమ్ము కోరి హృదయమ్మును కోవెలరీతి జేసి, పు
    న్నాగవరాళిలో వర సునాదవినోద సరాగ రంజికా
    రాగమునూది పల్కె మది రంజిల కోయిల గున్నమావిపై.

చం||    అరుదుగ వచ్చితీవు నిలనర్వది వత్సరముల్ గతించె, నీ
    దరిశన భాగ్యమబ్బకను, ధన్యులమైతిమి నీదురాకచే
    మురిపెముతోడ నీ మృదుల పుణ్యకరమ్మున నాశిషావళుల్
    ధరపయి గ్రుమ్మరించి వసుధన్ విజయుండవుకమ్ము నిమ్మెయిన్!

ఉ||    కాలమనంగ దైవతము కాలము గాయపు నౌషధంబగున్
    కాలమనంతవాహిని సుఖంబును కష్టములారుపాళ్ళుగా
    మేలగు షడ్రసోభరిత మేలిరసాయనమందజేయునో
    కాలస్వరూప! శ్రీవిజయ! కామితదాయక! నీకు మ్రొక్కెదన్.

మ||    ఋతుషట్కంబులనేల వచ్చిన మహోత్కృష్ట ప్రభారాశి! నీ
    యతులైశ్వర్య కృపాకటాక్షముల నత్యంత ప్రమోదమ్ముతో
    క్షితిసంవాసుల మీద జూపి గొనుమా! కీర్తి ప్రశంశోన్నతుల్
    గతగాయంబులు మాన్పగా తగినదీ కాలంబు శేయస్కరా!

ఉ||    మానవతా ప్రవాహముగ మానిసి నిత్యము తోటివారికిన్
    మానిత రీతి సాయపడు మంజుల మానస భవ్యనందనో
    ద్యాన వనాంతరమ్ముల సుధారస పూరిత దివ్యపుష్ప సం
    ధానము గూర్చుమోయి సురధామపు నందన! తోటమాలివై.

ఉ||    చందన చర్చతోడ విరజాజుల వీవనలందు కాలమా!
    వందనమయ్య నీకు సురవందిత క్షాత్రముమీర మేదినీ
    స్యందనవాసివై కుటిల చర్య నియంతవు నౌచు ధర్మ సం
    స్పందన బాదుగొల్పి పరిపాలన చేయుము నీదు బిడ్డలన్

శా||    శ్రీమంతంబయి పండుగాక! పృధివిన్ స్నేహార్ద్రతా భావముల్
    సామంతంబయి నిండుగాక! సుమనోసామ్రాజ్యముల్; పాలితుల్
    సీమంతంబగుగాక! సృష్టి; సమతా శ్రీసస్యకేదారమై
    హేమంతంబగుగాక! నీదు విజయశ్రీనామ కాలంబిలన్! 

        " సర్వేజనాః సుఖినో భవంతు "
        " సమస్త సన్మంగళాని సంతు "
...........అందరికీ ఉగాది శుభాకాంక్షలు..................