Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

10, మార్చి 2013, ఆదివారం

పార్వతీశ్వరా !

[పింగళి శశిధర్]

1.   దోసిలి యొగ్గి వేడెదను దోసము లెంచని స్వామివంచు, నీ
      సేసలు నెల్లవేళల వశీకర శ్రీకర మార్గదర్శులై
      శ్వాసగ నిండినామదిని శాశ్వత సుందర మార్గగామిగా
      చేసెదవంచు, నీ చరణ సేవన చేసెద పార్వతీశ్వరా !

2.    అన్నము లేకనీవిటుల అంజలిసాచి చరించనేల, నీ
      కున్నది గాదె ముందరనె కోమలి మాయమ అన్నపూర్ణ, నీ
      వెన్నిక తోడ కోరినది వెన్కటి మాభవ రాశులేకదా !
      మన్నన చేసివేడెదను మాయని నీకృప పార్వతీశ్వరా!

3.    పెన్నిధి వోలె జీవులకు పెంపగు జీవన ముక్తినిచ్చి, శ్రీ
      పన్నగమున్ గజమ్ముల నపార కృపారసమందుదేల్చి, యా
      పన్నుల గాచినట్లు నెడబాయని, మాయని యాదరంబుతో
      నన్ను కృపామతింగనుము నాగవిభూషణ పార్వతీశ్వరా !

4.   నిన్ను కవుంగలించుకొన నిచ్ఛజనించెను తండ్రి, సుంత నా
      పన్నగభూషణాది జటపాయలనావల సద్దుకొమ్ము, నా
      చిన్ని మొగంబు నీ యెడద జేరిచి చెప్పెద నొక్కమాట, ఓ
      యన్న! దయామయా! శరణు, యాశ్రిత రక్షక! పార్వతీశ్వరా !

5 .  పాహి! దయామయా! పరమ పావన! సజ్జనలోకవందితా!
     దేహియటంచు వేడెదను దేహములోపలనుండు నాత్మ, వి
     ద్రోహుల గెల్వగన్ నిను యధోచిత రీతుల ప్రస్తుతింతు, నం
     దేహము లేకకావుమయ దీనశరణ్యుడ! పార్వతీశ్వరా !

                               శివరాత్రి శుభాకాంక్షలతో...
+

8, మార్చి 2013, శుక్రవారం

ఆమె

[ శశిధర్ పింగళి ]

పతికి సేవలుజేయుచో పడతిదాసి,
మరియు మంత్రాంగవేళల మంత్రి తాను,
కొసరి తినిపించు సమయాన కొమ్మ! అమ్మ!
చేరి సుఖమును పండింప చెలియ రంభ!

లలిత సౌందర్యకలితయౌ లక్ష్మి యామె!
సహన సౌశీల్య సాద్గుణ్య క్షమకు ధాత్రి!
అతివ షాడ్గుణ్య సౌభాగ్య కలిత యగుచు
నిలచు నిత్యంబు సత్యమై నిఖిల జగతి!

తల్లి యిల్లాలు చెల్లెలు తనయ యగుచు
అలరుచుండును నట్టింట నతివ తాను
కలికి మగవాని పాలిటి కల్ప తరువు
మగువ లేకున్న మగవాడు మట్టిబొమ్మె!

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో..