Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

మహాభారతంలో తిక్కన దిద్దిన సుధేష్ణ-1

[ పింగళి వెంకట శ్రీనివాస రావు ]

మహాకావ్య నిర్మాణం ఒక అరుదైన అపురూప కళాసంపద. దీనికి కేవలం భాషా పాండిత్యం ఒక్కటే సరిపోదు. కవికి ఇతివృత్తంలోని పాత్రలహృదయములను తనకనుసన్నల నర్తింపజేయగలనైపుణ్యత అవసరము. వ్రాయునపుడు ఇతివృత్తములోని ప్రతిపాత్రకు తగినంత న్యాయము చేకూరినదా? అనువిచికిత్సకు అవకాశముండదు. తనువ్రాయతలపెట్టిన కావ్యమునందలి ఇతివృత్తమే కనుచూపుమేర మహాసాగరమువలె కన్పట్టుచుండును. అట్టియెడ నిర్మాణకుని దృష్టియావత్తు కావ్యనాయికా నాయకుల పాత్రల చిత్రీకరణ యందే లగ్నమగుచుండును. కాని ప్రతినాయకుని యొక్క, మధ్య మధ్య వచ్చు అల్పపాత్రల యొక్క చిత్రీకరణకు విషయమునకు అంతగా ప్రాధాన్యత ఇచ్చుట అరుదు. ఒకవేళ ఎవ్వరేని ఇట్టివిషయమున జాగరూకత వహించిననూ పూర్తిగా కృతకృత్యులు కాలేకపోవచ్చును. అయిన నిట్టి నిశితపరిశీలన సామాన్య సృష్టికర్త అయిన రచయితకు కేవలం గగనకుసుమ సదృశమేనా?! అవునని చెప్పుటయెంతమాత్రము సమంజసము కాదు. అరుదనిమాత్రమే చెప్పగలము.

అందుకై ప్రయత్నించి కొంతవరకు కృతకృత్యుడైనవాడే "మహాకవి" అని అనిపించుకొనును. ఇది ఒక అలంకారశాస్త్రమునకు సంబంధించిన విషయముగా పరిగణింతురు. మొత్తంమీద ఇట్టి కావ్యరచనా విధానము అసిధారావ్రతము వంటిది అనుటలో అతిశయోక్తిలేదు.

తనరచకు తానే పరవశుడైన కవి అంతవరకు కూలంకషముగా సాగిన కవితాధారకు తానే అడ్డుకట్ట కాగలడు. ఈవిషయమున ఉభయకవిమిత్రుడు కవిబ్రహ్మ అయిన తిక్కన సోమయాజి సాటిలేని మేటికవి అనిపించుకొన్న సుప్రసిద్ధ మహాకవి.


మహాభారతమునకు పంచమవేదమని ప్రతీతి కలదు. అందలి నాల్గవది అయిన విరాటపర్వము "నానా రసాభ్యుదయోల్లాసి" గా వన్నెకెక్కినది. అందు సుధేష్ణ పాత్ర ఒక పరమాణు సదృశము. ఇక సమగ్ర భారతము దృష్ట్యా అసలు దృగ్గోచరమే కాదు. మూలభారతమున వ్యాసుడే తిక్కన పరికించినంత నిశితముగా సుధేష్ణ గుణగణములను గుర్తించలేదు. తనదృష్టిలో సుధేష్ణ ఒక మేధావి ఒక అనుభవశీలి ఒక గుణవతి.   పరిమాణమునచిన్నదైనా సుధేష్ణ చరిత్ర నిత్యశోభాయమానము.

ఇట్టి కధాసంవిధాన చతురతలనుబట్టి సమగ్ర భారతమున కవిబ్రహ్మ దృష్టి యెంత కుశాగ్రసదృశమో మనమూహింపవచ్చును.

ద్యూతక్రీడయందు పరాజితులైన పాండవులు ద్రౌపదీ సహితులై ద్యూతనియమానుసారము పండ్రెండు సంవత్సరములు వనవాసము పూర్తిగావించుకొని అజ్ఞాతవాసమునకై మత్స్యదేశాధీశుడైన విరటుని కొలువును కేంద్రముగా ఎన్నుకొనినారు. ధర్మ భీమార్జున నకుల సహదేవులు ప్రణాళికననుసరించి మారువేషములలో వారివారి వాక్చాతుర్యములను ప్రదర్శించి రాజును మెప్పించి నియుక్తులుగా ఉపవిష్టులైనారు. ద్రౌపది వంతువచ్చినది. ద్రౌపతి అగ్నిసంభవ. మాణిక్యం మసిపాతలో చుట్టినా దానిప్రకాశం దాగదు.ఎట్లో ఒక మాసిన చీరకట్టుకొని సహజసిద్ధమైన ఆభిజాత్యమును ఒకింత మరుగుపరచుకొనుటకు ప్రయత్నముచేయుచు అంతఃపుర ప్రాసాదము ప్రక్కనున్న రాజవీధిలో కార్యార్ధియై అడుగులో అడుగువేసుకొనుచూ నడయాడుచున్నది. అది సాయంసంధ్య. సుధేష్ణ పాత్ర ప్రవేశమునకిది నేపధ్యం. అదే సమయమున రాణీ సుధేష్ణాదేవి ఉబుసుపోకకై ఆంతరంగిక నారీపరిజన పరివేష్టితయై ప్రాసాదపు మిద్దెపైకి వచ్చినది. ఇంచుక పరవశయై ప్రకృతిరామణీయకతనాస్వాదించుచున్నది. చెలికత్తెలతో సరసోక్తులు విసురుచూ మిద్దె అంచుభాగమునకు వచ్చి కాకతాళీయముగా క్రిందకు చూచినది. రాజవీధిలో ఒంటరిగా నడయాడుచూ సంశయాత్మయై తిరుగాడుచున్న సైరంధ్రి వేషధారియగు ద్రౌపది కనిపించినది. మొదటి చూపులోనే ఈమెమానవకాంతయా? లేక దేవకాంతయా అనుసందేహము పొడమినది. నీచకాంతలవేషమున భాసించు అప్సరాంగనవలె కన్పట్టునీమె ఉదంతమేమైయుండనోపు? సుధేష్ణ మనమును కార్య కారణ విచారణ తట్టిలేపినది. అట్టివితర్కము సందేహమునకు తావిచ్చినది. సందేహము కుతూహలమును పెంచినది. ఆమె హృదయమున ఆ వీధికాంతపై గౌరవముతో పాటు ఆదరభావమునూ స్థిరమైనవి. అన్నిటనూ సందేహము ముందునిలచినది. తెలుసుకొని తీరవలయునను తలంపు బలవత్తరమైనది. వాక్చాతుర్యంలో ప్రౌఢలైన ఇరువురు ఆంతరంగికులను పంపినది. సైరంధ్రి పాత్రధారిణియగు ద్రౌపదికి ఆడబోయిన తీర్థమెదురైనది. వివేకవతియైన ఆమె వినమ్రవైభవములు రూపుదాల్చినవా యనునట్లు వారి వెంట వెడలి రాణిని సమీపించి అభివాదము చేసి దంతరుచివెలువడ దరహసిత వదనయై మ్రోల నిలచినది. ఆమెప్రవర్తన తీరుతెన్నులకు రాణిఉక్కిరిబిక్కిరి యైనది. గౌరవాదరములు రాణిముఖమున తొణికిసలాడినవి. ఉచితరీతిని గద్దియజూపి రమ్మని సైగచేసినది. కార్యార్థియు, మర్యాదనెరిగిన మగువయగు సైరంధ్రి ఆమె సైగకు ప్రలోభపడక వినమ్రయై నిలిచినది. సుధేష్ణ పరీక్షా దృష్టి మారలేదు. అంతకంతకు సందేహ కుతూహలములు ఒకదానితో ఒకటి పెనుగొనచున్నవి. తుదకు తెంపుచేసి ఉచితరీతిని ప్రశ్నించినది. తనప్రశ్నకు బదులు వినకయే ఊహాతీతభావములతో మదిని నింపుకొన్నది రాణి. కార్యదీక్షాపరాయణురాలైన సైరంధ్రి యుక్తియుక్తముగా తన వృత్తాంతమంతయు వివరించి ఒక సంవత్సరముపాటు అంతఃపుర పరిచారికగా తన్ను నియమించుకొమ్మని అర్థించినది. ఉచితమగురీతిలో అతిసామాన్యధోరణిలో సాగినది సైరంధ్రి సమాధానము. అంతమాత్రమున సైరంధ్రి పట్ల సుధేష్ణ మనసులోని విచికిత్స చల్లారునా? తొలుతనే ఈమెను దేవ, గంధర్వ, కిన్నెర, కింపురుషాది అప్సరాంగనలలో ఒక్కతెయై యుండనోపునని అంచనావేసుకొన్నది. మనుష్యకాంత కానోపదని దృఢనిశ్చయముననున్నది. అయిన ఈ సందేహ నివృత్తి యగుటయెట్లు? సుధేష్ణ మేధ పరిపరి విధముల పరుగులు తీయుచున్నది. పరేంగితావగాహనధురీణయైన సైరంధ్రి ముందు యోగవశమున రాణిగా చెలామణిఅగుచున్న సుధేష్ణ యేపాటిది? సుధేష్ణ యెత్తు హనుమంతునిముందు కుప్పిగంతైనది. శబల భావపరంపరలచే ఊహాప్రపంచమున బారలుజాపుచున్నది సుధేష్ణ. ఈ యదునుగనిపెట్టి సైరంధ్రి మోమునకు మందహాసమలంకారమైభాసిల్ల కథకు ఉదాత్తసన్నివేశములను జోడించి వన్నెలు చిన్నెలు పొదిగి మరింత పటిష్ఠపరచి సుధేష్ణ యంత్రాంగమును పూర్తిగా భ్రమింపజేసి కథాసంవిధానమునకు ఊఁ..కొట్టునట్లు చేసినది.

కానీ సుధేష్ణకు తనమనసులోని శంకకు పరిష్కారం దొరకలేదు. ఒకవైపు ఉత్కృష్టరూపసంపద, మరియొకవైపు సంభాషణానైపుణ్యం, ప్రవర్తనలోని నాణ్యత వేరొకవైపు ప్రస్తుతము ఆమెధరించిన సైరంధ్రి వేషము. ఒకదానితో నొకటి అన్వయించుకొనుటకు వీలుపడనివిగానున్నవి. పైపెచ్చు సైరంధ్రి సమ్మోహనా వాగ్ఝరిలో సుధేష్ణ వాగ్బంధనము జరుగుచున్నది. ఇవి యన్నియును అట్లుండనిచ్చినను సైరంధ్రి తనయింటనే కొలువుండగోరుట మరింత కలవరపెట్టినది.

సుధేష్ణ మనసులో ఒక భావ పరంపర చక్రమువలె తిరుగనారంభమైనది. తన తమ్ములు నూర్గురు. అయిననూ వారిని గూర్చి చింతలేదు. కానీ అమేయబాహువిక్రముడు, బలగర్వితుడు అగు పెద్దతమ్ముడు కీచకుడు తలంపునకు వచ్చినాడు. అతని గుణగణములు చిన్ననాటినుండియు యెరిగిన అక్క. అతడు రూపవతుల పాలిట రసికపిపాసి. పురుషులమనోనిగ్రహ, స్థైర్యములేపాటివో ఆమె ఎరుగనివికాదు. అనుభవశీలి, కీచకుని మాటయటుండనిచ్చినను ముసలిరాజైన తనమగడే ఈమె పాలబడిన ఇక తనగతి యేమికావలయు? సుధేష్ణ హృదయోద్వేగమెక్కువైనది. గుండె నీరై చెరువైనది. వెంటనే తననుతాను సంభాళించుకొని మానసికవైకల్యమును బయల్పడనీయక గాంభీర్యమును రాజసమును ప్రదర్శించినది. సైరంధ్రితో తిక్కనగారి మత్తేభవృత్తములో ఇట్లన్నది. "...................వినునీరూపముజూచి మానృపతి యువ్విళ్ళూరునే నెమ్మయిన్, బనిగొంచుం దగనింతులుందగిలి నీపై చూడ్కినెక్కొల్పి నెమ్మనముల్ విస్మయమంద జూచెదరు భామా పల్కులింకేటికిన్". అని తన అనుమానమును సుస్పష్టముచేసినది. మరియు తన నిశ్చితాభిప్రాయము నీవిధముగా వెళ్ళగ్రక్కినది.

కం:    దుర్భరమగు నినుగర్కటి
          గర్భముధరియించునట్లు గైకొని నాకై
          నిర్భర విధ్వంస దశా
          విర్భావముదెచ్చుకొనుట వెరవైయున్నే.

ఈమాటలామెనోట వెలువడుటవెనుక ఆమె మనమున ఈఅనుమానమెంతబలముగా నాటుకొన్నదో యూహింపవచ్చు. ఒక సామాన్య స్త్రీ హృదయమామె మాటలలో దర్శనమిచ్చుచున్నది. అనుభవజ్ఞతగల్గిన ఒక సామాన్య సంసారిణి హృదయముతో నాలోచించినప్పుడు అట్టియాలోచన సమర్థనీయమే కదా! అందునా సుధేష్ణ సతీత్వలక్షణములున్న కులీన పతివ్రత కాదు. అతిసామాన్య రాజకుటుంబమునకు చెందినది. ఇట్టి ఈమెలో సామాన్య స్త్రీ గుణములు కాక ఉదాత్త మహానాయికా లక్షణములు ఎటులూహింపనగును?  అనుభవజ్ఞత, కార్య చతురతల వంటిమెరుగులు తిక్కన మహాశయుడు సుధేష్ణకిచ్చిన వరములు.  లోకమున అతిసామాన్యముగా జూచు వనితలవంటిదే కానీ సుధేష్ణ నిరుపమాన మహిళయు, నిరంతరపూజార్హ యెంతమాత్రముకాదు. లోకరీతినెరిగి మసలుకొను ప్రాప్తకాలజ్ఞ. సహజ స్వభావములు అసంకల్పిత ప్రకటితములు కదా! ఉద్వేగ సంభరిత మనస్కయగు సుధేష్ణ హృదయమతిసహజముగా అట్టిసమయమున అట్లావిష్కరణమగుటలో ఆశ్చర్యమేమున్నది? ఆమె కాక మరే యితరసామాన్య గృహిణియైనా ఇంతకంటే వేరువిధముగా మాటాడగలదేమో యోచింపుడు.

సైరంధ్రి సాటిఆడవారికే మతిభ్రమ కలిగించి కనులప్పగించి చూచునట్లు మైమరపింపజేయగల రూపవతి. ఇక ముసలిరాజైన విరటుడేమి ప్రవరాఖ్యుడా?!  ".....హా శ్రీహరీ" యంచున్ ఓరమోమిడి పొమ్మంచున్ తొలగన్ద్రోయుటకంతటి నైష్ఠిక ధీరగుణసంపన్నుడా! ఇక సైరంధ్రి విషయమెవరెరుంగుదురు. ఇంద్రియములు బలవత్తరములు. ఈనేపథ్యమున సుధేష్ణ పక్షమున యోచించిన సైరంధ్రికి ఆశ్రయమిచ్చుట " నిర్భరవిధ్వంస దశావిర్భావము" నాహ్వానించుటకాక మరేమికాగలదు?

సైరంధ్రివేషధారియగు యాజ్ఞసేనికి సుధేష్ణ హృదయము శ్వేతపత్రమైనది. ఆమెకిది పరీక్షాసమయం. సహజసిద్ధమగు ఆత్మశక్తియు, చాతుర్యము ఇప్పుడు ప్రదర్శింపకున్న ఆమె ప్రణాళిక మొత్తము చెడును. సుధేష్ణ నవలోకించి ఒక అర్ధాంతరాన్యాస మందహాసాస్త్రమును సంధించి దానితో "నాచిత్తము తాదృశులకు గోచరమే!" అని ఒక చిక్కు ప్రహేళికను ఆమె హృదయమున నాటినది. అస్మదీయ కుల జనసంశిక్షాచార మహిమ అట్టిదిఅని హెచ్చిరికగా తన కులీనతను చెప్పకనే చెప్పుచూ తన ఆభిజాత్యమును చవిచూపినది.   ఇయ్యది అతిహీనవచనములని సుధేష్ణ భావోక్తులను ఈసడించుకొన్నది. అట్టిమాటలు చెప్పకుమని మందలించినది. అజేయబాహుబలవిక్రములగు ఐదుగురు గంధర్వులు తనకు భర్తలని మర్మగర్భముగా తన ఉదాత్త రక్షణబలసంపదను వెల్లడించినది. సామాన్యలోకరీతినెరింగిన సైరంధ్రి తనను మన్ననజేసి గౌరవించినవారికి తనభర్తలు తోడునీడై బాసటగా నిలిచి సాయపడగలరని ఆశజూపినది. ఒకదానివెంటనొకటిగా సైరంధ్రి చాతుర్యవాగ్ఝరి సుధేష్ణ ను అవాక్కు జేసి ఉక్కిరిబిక్కిరి జేసినది. సుధేష్ణ ప్రతిభ సైరంధ్రి వాగ్ఝరిలో కొట్టుకుపోయినది. సుధేష్ణ మనసొకింత కుదుర్కొన్నది. తలపంకించి పరవాలేదనుకొన్నది. సైరంధ్రి రూపముజూచి భ్రమసినవారిలో తొలిమగువ ఆమెయే. అంతటి రూపకాంతచేత సేవలందుకొను భాగ్యము తనకేదక్కినదను సంతసమున అంతఃపురముననుండ నియమించి బనిచినది.

సుధేష్ణ ఆనందమునకు పదిమాసములకే బాలారిష్టమేర్పడినది. తను తొలుత ఊహించినట్లే "నిర్భర విధ్వంస దశావిర్భావ" మాసన్నమైనది. అక్కగారిపట్ల నొకింతగారవమున మసలుకొను పెద్దతమ్ముడు కీచకుడొకదినమున గౌరవప్రతిపత్తితో అక్కకు మ్రొక్కి ఆశీస్సులందుకొన నంతఃపురమునకు హుటాహుటినరుదెంచినాడు. తనివితీరా మ్రొక్కించుకొని మనసారా దీవించినది అక్క. చిన్ననాటినుండియు తమ్ముని గుణగణములు  సుధేష్ణకు తెలియనివికావు. వానికి బావభయములేదు. భుజబలగర్వి. సుందరనారీజన కామపిపాసి. బావకు వీనిని దండించు భుజబలముగానీ సాహసముగానీ లేవు. బావా బావమరదుల మధ్య ఎప్పుడైనా మనఃస్పర్ధలేర్పడినప్పుడు తానే పెద్దయై ఇరువురిపక్షములను సవరించి ఇరువురిప్రేమానురాగములకూ పాత్రమగుచుండెడిది. కీచకుడు అక్కప్రేమకొకింత లొంగినడుచుకొనువాడు. నిజముచెప్పవలయునన్న వానికీమె పట్లమాత్రమే కొంతలోకొంత భయభక్తులున్నవి. పదినెలలుగా వానిపై ఎంతయనురాగమున్ననూ మనసును చిక్కబట్టుకొని వానినంతఃపురమునకు రానీయక జాగ్రత్త పడినది. కానీ విధి వశమున నాడు చుక్కతెగిపడినవిధముగా వచ్చినాడు. అక్కను సమీపించినప్పుడే అంతఃపురమున కొత్తయంగన యగు సైరంధ్రి వీని కంటపడినది. సుధేష్ణ తమ్ముడనంగు శరాగ్నికీలలజిక్కి నాడని గ్రహించినది. సుధేష్ణ ధర్మశీలయే కానీ అధర్మ ప్రభంజనమునకు యెదురునిలచి పోరాడి గెలువగలుగునంతటి ధర్మ పక్షపాతికాదు. పరిస్థితులను వశీకరించుకొని ధర్మమునే నిర్వహించునంతటి ధార్మికురాలు కాదు. వాడు మన్మథుని చేతికీలుబొమ్మయైనాడు. తాను త్వరపడి మందలించినచో వాడుధిక్కరించి నిలచిన తనపరువేమికావలయు? ఇట్టివి తనపెద్దరికపు దృష్టికి రానీయకుండుటయే తన అక్క పదవికి శ్రేయోదాయకము. అట్లని జరుగబోవు అన్యాయమును చూస్తూ సహించి మిన్నకుండవలసినదేనా?  కిం కర్తవ్యం? సుధేష్ణ పూర్తిగా ధర్మవిచికిత్సలో పడినది. కిమ్మనక తన పెద్దరికమును కాపాడుకొనుటయే ఉచితమని భావించినది. నా మందిరమున నింతమందియెదుట సైరంధ్రిని దాకి అత్యాచారమునకు పాల్పడలేడుకదా! అక్కకు తెలిసిన దండించునేమోయను అనురాగపూరిత భయమొకటి కలదు కదా! సైరంధ్రి పెట్టిన గడువు మూడువంతులకుపైగా అయిపోయినది. ఒకవేళ కీచకుడు మనసుదిటవు చేసుకొని ఏదియేమైననూ సరే కానిమ్మని విజృంభించబోవు సరికి మిగిలిన ఈ కాస్తగడువు కాలము తీరకపోవునా? అప్పుడంత పరిస్థితియే యెదురైన గడువు తీరినది కదా! వెళ్ళిరమ్మని సైరంధ్రిని అనిపివేసి వదిలించుకొనవచ్చును. అపుడుతన మర్యాదయు నిలుచును. మాటదక్కించుకున్నదాన నగుదును. ఇట్లూహించిన సుధేష్ణ భావపరంపరతో విధి ఏకీభవించలేదు. ఆమె విధివంచితయైనది.
                                                                                                                                 ఇంకావుంది...

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బాగుంది