Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

24, అక్టోబర్ 2012, బుధవారం

ఉషోదయం (ఆశామోహానికి మరోరూపం)

      (ఆశామొహం లో ముందు చెప్పినట్లు కొన్ని రోజుల తర్వాత  పద్యాల్లో పెట్టటానికి కొంత ప్రయత్నం అయితే జరిగింది గానీ చందస్సు మీద పూర్తి పట్టు అవగాహన అంతగాలేకపోవటంవల్ల ఇలా మిగిలిపోయింది. ఎప్పటికి పూర్తిస్తాయి చందస్సులో చేరుకుంటుందో చూడాలి)

( శశిధర్ పింగళి )

యే సరసి స్నేహసాంగత్యమందు
          బ్రతుకు సారములెల్ల బయలుపడెనొ
యే మగువ నిర్మలనేత్రకాంతి
          కారుచీకట్ల మదిలోన కాంతినిడెనొ
యే మానినీ మధుర మంజులవాణి
         వెతలునిండిన యెదకునోదార్పునిడెనొ
యే వనితవిపులవక్షఃస్పర్శ
        కల్లోలమనసుకుల్లాసమిడెనొ
ఒకనాడునాలోన ఒదిగియున్న
పాడుభావాల నావల పారద్రోలి
చరమగీతిక పాడిన చెలియ కధను
విన్నవించెద వినుమోయి వీనులలర.

అరెరె! పరచుకున్న వెలుగెల్ల పారిపోయె
చేతజిక్కిన ఫలమేమొ జారిపోయె
అలముకున్నవి చిమ్మచీకట్లు నన్ను
యెటులపోదును నేనిపుడు నాకేది దారి?

అనుచు మూసికొంటిని కన్నులు కలతవలన
కాని - మూతపడలేదు ఆలోచనాలోచనములు
పోవుచున్నవి పరి పరివిధాల పోయి కడకు
చేరుకున్నవి వేదాంత దిశాంతమునకు.

నిస్సారమీ బ్రతుకు నిక్కమరయ
అశాశ్వతంబేగద నంతయు నరసిజూడ
నిసీ! అనుచు నామనసుస్సురనుచు
బుస్సుమనియెడి వేడ్వేడిశ్వాసలొదిలె.

మెట్టవేదాంతమేవంట బట్టెనేమొ
వట్టి వంటరితనంబె నాలోన పల్కెనేమొ
ఎట్టిభావాలు మదిలోన మెట్టినవియొ
యెట్టకేలకు నామనసు గట్టినిట్టూర్పు విడచె.

ఇట్టి నిట్టూర్పులెన్ని విడచినానొ
గట్టిగా నావీపుపై తట్టిరెవరొ
తట్టుకొనలేక తాపము తాళలేక
పట్టుమని వెనుదిరిగి జూడ..
యెట్టయెదురుగ నిల్చెను మగువ యెవరొ..

నిగ్గుదేలిన బుగ్గల మొగ్గవిరియ
సోగదేరిన కన్నుల సోకుమెరయ
కిలకిలల్ మనుమేటి కిన్నెరలు మీటి
పల్కెనిట్టుల మగువ మంద్రస్వరాన..

యేమి? నీలోన నీవె నిట్టూర్చినావు
యేమి? నీమోము నిరాశనీడల తేలిపోవు
కారణంబేమని అడిగినంత - కాదు, లేదని
విషయంబు దాయనెంచి - విఫల
యత్నుండనై చివరకు విన్నవింప -

గల గలమని నవ్వి గంభీరగతిని
తన మృదులహస్తంబుతో నాశిరము
తాకి - ప్రేమధారలు కన్నుల జాలువార
పల్కినదియామె చక్కని సరళశైలి-

వెర్రి ఊహల కాలమ్ము వెళ్ళదీయు
వ్యర్ధజీవులు భువిలోన వేనవేలు
అర్ధరహిత భావాల నల్లుకొనుచు
యేదొ వూహించుకొనినీవు బెదరిపోకు-

అలముకున్న చీకట్లు తొలగిపోవె?
వెలుగు వెచ్చని కిరణాలు ఓడలతాకు-
సంజెవెలుగుల కెంజాయిరంగులోన
పుంజుకొనవోయి సరికొత్త భావసంచయమ్ము-

కదలు కెరటాలు కడలినే కలసిపోవు
తీరని కృషిచేసి తీరమ్ము దాటునెపుడొ
అటులె నీవుకూడ నిరాశనావలకునెట్టి
కృషిని సల్పినపుడు విజయమ్ము నీదగును సుమ్ము-

లెమ్ము - లేచి నాచేతినందుకొమ్ము
యిన్నినాళ్ళుగ నీలోననున్నగాని-తెలుసు
కొనలేదు నా వునికింతదనుక - అసలు
నేనులేకున్న మీరెల్ల మనగలుగువారె?

నేనులేకున్న లోకముల్ నడువగలవె?
రేపుకలదన్న సత్యమ్ము తెలియగలరె?
అట్టిరేపు తమదన్న భావముల్ కలుగగలవె?
కనుక - కదలి-నాతోడ స్నేహంబు కట్టుమోయి-

అనుచు-
తలను వైచిన చేతిని తీయలేదు
తీయతీయని భావనల్ చేతినుండి
ప్రాకుచుండెను లోలోకి చిత్రగతిని
తలకు మించిన వూహలు తరలిరాగ-

ఆ..మృదుకరస్పర్శ మహిమయేమొ గాని
తోచు-హిమబిందుసుందరీ శీతకరంబుబోలి-
అదికాదుకాదంచు తోచంతలోనె -
ఆమె చేస్పర్శ -
ప్రేమమీరిన నెచ్చెలి వెచ్చని కౌగిలినిబోలి-

ఏమి నేనేమి నాకిట్టి భావమేమి?
యింతదనుక ఇన్ని పన్నాలు వల్లించి
యిపుడు శృంగార గీతిక లాలపింప
చిత్రమదియేమొ-చిత్తంబు మారెనాకు-

అయిన-ఎవరీమె? యింతగనాదరించు
అతివ-అందాలరాశె-కాదననుగాని
ముక్కు మొగమెరుగని మగువతో మసలుటెట్లు?
పేరడిగెదమటన్న పేరలుక జెందునేమొ?

అనుచు సందిగ్ధ భావాల దగ్ధమగుచు
చివరికెట్టులొ చిత్తంబు చిక్కబట్టి
ఎవరు నీవెవరు నీదు పేరేమటంచు
అడిగితినొ-లేదొ ఫక్కున నవ్వెనామె-

యిన్ని నాళ్ళుగ నీలోన దాగియున్న-నీదు నె
చ్చెలిని నన్ను జూడలేదొ-చూసి-నారూపు
సరిగ సరిపోల్చుకొనలేదొ-అయిన
వినుమోయి నాపేరు చెప్పుచుంటి-

చీకటి ప్రాకారముల్ ఛేదించుకొనివచ్చు
ఉషఃస్సుందరి సుందర నేత్రద్వయాన
వెలుగు వెచ్చటి అరుణకిరణమ్ము నేను-
చీకటి బ్రదుకుల దివిటీలువెలిగించి
మీదు బంగరుబాటపై రంగులద్దు-
భవిష్యద్వర్తనిని నేను-నాపేరు-ఆశ యండ్రు-

నేనునీదాన నికమీద నీవెనేను
అనుచు-యెదపైన మృదువుగా వాలిపోయి
కనుల చిందిన ఆనందభాష్పాల కరగిపోయి
గుండెలోపలి పొరలలో నిండిపోయె-

ఆశచేకొన్న తర్వాత అంతకంతకు
అధికమయ్యెను నాలోన ఆత్మబలము
సమధికోత్సాహముల్ చింద సాగరాలీదగలను
ఆశనాకేలనుండగ నాకేటి భయము -

అదిగొజూడు మినుకిరణముద్భవించె
వ్యర్ధ నైరాశ్య, నైశ్శ్యబ్ద నిశీధినీ నీడలవిగొ
పోవుచున్నవి యువత హృదయాలనుండి
వచ్చుచున్నది-
క్రొత్త వాసంత ఉషోదయమ్ము-నేడు.
               *****

దసరా శుభాకాంక్షలతో..