స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

25, ఆగస్టు 2012, శనివారం

రామాయణం (మంజరీద్విపద)(సేకరణ : శశిధర్ పింగళి )


దశరరధుడను రాజు | ధరయేలుచుండె
వానికి మువ్వురు | భార్యలు కలరు
నలుగురు కొడుకులు | నాల్గురత్నములు
కౌసల్య శ్రీరాము | కన్నట్టి తల్లి
కనియె సుమిత్ర | లక్ష్మణ, శత్రుఘ్నులను
భరతుండు యాకైక | గర్భమున బుట్టె
ఆ నలుగురును గూడ | అతిబాల్యమందె
అన్ని విద్యలు నేర్చి | రతిశ్రద్ధతోడ

రాజులందరి లోన | రామచంద్రుండు
విలువిద్యలో చాల | పేరుగన్నాడు

ఎట్టివారును బట్టి | యెత్తలేనట్టి
శివునివిల్లెక్కిడి | స్త్రీరత్నమైన
సీతను పెండ్లాడి | శ్రీరామమూర్తి
కడుకీర్తి గన్నాడు | కల్యాణ మూర్తి

తండ్రిమాటను నిలుప | తలచి రాముండు
ఘొల్లు ఘొల్లున ప్రజలు | గోలపెట్టంగ
పయనమై అడవికి | బయలుదేరంగ
అతని వెంటనె బోయి | రతిభక్తితోడ
తమ్ముడు సౌమిత్రి | తరుణి సీతమ్మ
కడుభయంకరమైన | కాననంబులకు

అన్నకు వదినకు | అనువైనయట్లు
లక్ష్మణ పర్ణశాలను కట్టియిచ్చె
(పర్ణశాలను కట్టె | భ్రాత లక్ష్మణుడు)

ఆపర్ణశాలలో | ఆ యాలుమగలు
సుంతలోపము లేక | సుఖముగానుండ
ఘనులైన రామ | లక్ష్మణులు ఇంటలేని
సమయమ్ముజూచి | వేషమెల్లను మార్చి
రాక్షసరాజైన | రావణాసురుడు
ఆదిలక్ష్మిని సీత | నపహరింపంగ
సీతకై దుఃఖించి | శ్రీరామమూర్తి
సుగ్రీవుతోమైత్రి | సొంపుగా జేసి
తనసేననెల్ల యాతడు | సిద్ధపరుప
వావితోడుత | మేటి వారధిందాటి
రావణు కడదేర్చె | రామభద్రుండు

తమ్ముని తోడను | సీతాదేవి తోడ
తనపట్టణంబునకు | తా జేరుకొనియె

మా రామచంద్రుండు | మముగన్న తండ్రి
మా లక్ష్మణ స్వామి | మా తల్లి సీత
మాకంటబడినారు | మా భాగ్యమనుచు
ఉప్పోంగి రప్పుడు | అయోధ్యలోప్రజలు

మనరామ చరితంబు | మనసార మీరు
బాలబాలికలార | పాటపాడండి!!

****