స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

12, జులై 2012, గురువారం

పెళ్ళి మీద పెళ్ళి (కథ)


­[ శశిధర్ పింగళి]
(8th జులై 2012 వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితం)

"ఎలాగైనా నువ్వీ పెళ్ళికి ఒప్పుకోవాలి" సోఫాలోనుండీ ముందుకు జరిగి నా రెండు చేతులూ పట్టుకుని ఆర్ద్రంగా అడిగాడు గిరి.
వాడి అబ్యర్ధననీ అందులోని నిజాయితీని చూసి క్షణకాలం విచలితుణ్ణయ్యాను.
"నాదేముందిరా వాడిష్టం, మనకున్న సెంటిమెంట్లు వాళ్ళకుంటాయా చెప్పు" అన్నాను మెల్లగా.
"వాడి సంగతి నాకొదిలెయ్. నేను చూసుకుంటాను. నువ్వొప్పుకున్నావ్ అది చాలు. ధాంక్స్" అన్నాడు సంతోషంగా. మెల్లగా నవ్వాను అంగీకరిస్తున్నట్లుగా.

గిరికి మొదటి నుండి తనమీద తనకి గొప్ప నమ్మకం. ఎదుటి వారిని ఒప్పించడంలో దిట్ట. వాడి పర్సనాలిటీకి వాడి వ్యవహారశైలికి ఎలా కుదురుతుందా అని ఇప్పటికీ నాకు అనుమానమే. కాలేజీరోజుల్లో ఎక్కడ ఏ గొడవ జరిగినా వీడే తీర్పరి. వీడు వెళ్ళి ఏం మంత్రం వేసేవాడో కానీ ఇరు వర్గాలు గొడవమాని వెళ్ళిపోయేవారు.

కాలేజీ రోజుల్లో నేనూ, గిరీ, సుందరం ఒక జట్టు. ముందు బెంచీ బాచ్. గిరి అందరితో చనువుగా వుంటూ అన్ని పనుల్లోనూ తానే ముందు వుండే వాదు. సోషల్ యక్టివిటీస్ కూడా ఎక్కువే.

నేనూ, సుందరం మితభాషులం. చొరవ తక్కువ మనుషులం. అయినప్పటికీ గిరి మాప్రక్కన వుంటే కొంచెం అల్లరిగానే వుండే వాళ్ళం. సుందరం పేరుకు తగ్గట్టే అందంగా వుండే వాడు. చదువులో కూడా ముందుండే వాడు. క్లాసులో ఎప్పుడూ వాడే ఫష్ట్. వాడికి పోటీగా రాజేశ్వరి. చదువులోనే కాదు అందంలో కూడా సుందరానికి పోటీయే. ఎందుకోగానీ క్షణం పడేది కాదు ఇద్దరికీ. నన్నూ గిరినీ అడ్డం పెట్టుకుని ఒకరిమీద ఒకరు జోకులూ, సెటైర్లూ వేసుకునే వారు.


ఊరందరి తగాదాలూ చక్కబెట్టే గిరికూడా నవ్వుతూ వూరుకునేవాడు కానీ సర్దిచెప్పే వాడు కాదు. అదేమిరా అంటే నవ్వుతూ నా నెత్తిమీద మొట్టి వెళ్ళిపోయేవాడు. డిగ్రీ ఫైనలియర్ లోకి వచ్చేసరికి వాళ్ళసంగతి కొంచెం కొంచెం అర్ధమవ్వసాగింది. పరీక్షలముందు ఫేర్ వెల్ పార్టీలోననుకుంటా వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోకుండా నవ్వుతూ మాట్లాడుకుంది.

పరీక్షలయిపోయింతర్వాత ఎవరి భవిష్యత్ప్రణాళికలు వాళ్ళు వ్రాసుకుంటూ బిజీఅయిపోయాం. సుందరం పోష్ట్ గ్రాడ్యుయేషన్ కోసం యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. నేను వుద్యోగంవేటలో వూరువదలి వచ్చేసాను. గిరి గాడు మాత్రం వూర్లోనే వుంటూ గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతూ వుండే వాడు. వాడే మాకు వూళ్ళో విశేషాలన్నీ తరచుగా తెలియజేస్తూ వుండేవాడు వుత్తరాల్లో.

అందరమ్మాయిల్లానే రాజేశ్వరికి పెద్దలు పెళ్ళి నిశ్చయించారనీ, వాళ్ళ మిలటరీ బావయే పెళ్ళికొడుకనీ నాకూ సుందరానికీ వాడే వ్రాసాడు. ఆ విషయాన్ని నేను మామూలుగానే తీసుకున్నాను. సుందరం సంగతి తెలీదు. దూరంగా వున్నడాయె. వున్నా తొందరగా బయటపడే మనిషీ కాదు. ఇంకా చదువుకూడా పూర్తికాలేదు. ఈ ఆలోచనలన్నీ క్రమంగా మరుగున పడ్డాయి కొన్ని రోజులకి. ఇంతలో రాజేశ్వరికి మిలటరీ బావతో పెళ్ళి అయిపోయిందనీ, కొద్దిరోజుల అనంతరం శలవు ముగించుకుని డ్యూటీలో చేరటాని వెళ్ళిపోయాడని వ్రాసాడు గిరి. సుందరం పి.జి పూర్తిచేసుకుని రీసెర్చి నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయాడు. గిరి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి ఉన్నవూర్లోనే స్తిరపడ్డాడు. నేనూ ఓ ప్రయివేటు కంపెనీలో చేరి సెటిల్ అయిపోయాను. క్రమంగా పెళ్ళిళ్ళు చేసుకొని జీవితంలో స్తిరపడ్డాము. అప్పుడప్పుడు గిరి తన సోషల్ యాక్టివిటీస్ మీద ఈ వూరువచ్చినప్పుడు మాత్రం మాయింట్లోనే దిగేవాడు. అందరి సంగతులూ చెబుతుండే వాడు. ఆ రకంగా మావాళ్ళకీ దగ్గరయ్యాడు.
అలా వచ్చినప్పుడు కబుర్లన్నీ మోసుకొచ్చేవాడు లేదంటే వుత్తరాల్లో తెలిపే వాడు. సుందరం రీసెర్చి పూర్తిచేసుకొని అక్కడే విదేశాల్లో ఫాకల్టీ గా స్తిరపడ్డాడాని కూడా వాడే చెప్పాడు.

రాజేశ్వరి భర్త కూడా ఓ అయిదు సంవత్సరాల తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేసాడనీ, వాళ్ళ వూర్లోనే ఓ ప్రయివేటు వుద్యోగం చేస్తున్నాడని చెప్పాడు.

అలా కాల ప్రవాహంలో ఓ రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. అడపాదడపా గిరి వ్రాసే వుత్తరాలుకూడా పెద్దవిశేషాలేమీ మోసుకురావడంలేదు.

ఉద్యోగ బాధ్యతల్లో ఓ యేడాదిన్నర పాటు ప్రవాసాంధ్రుడనై నిన్ననే తిరిగి వచ్చాను. కొద్ది కాలమేనని కొంత, మా అబ్బాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండటం చేత కొంత కుటుంబాన్ని కదిలించలేదు.  నేను లేని ఈరోజుల్లో నాకోసమే నిరీక్షిస్తూ రెండు వుత్తరాలు వచ్చి వున్నాయి. ఒకటి గిరి నుండీ వచ్చింది. మరోటి సుందరం నుండి వచ్చింది. రెండూ రెండు చేతుల్లో పట్టుకుని అలాగే చూస్తూ ఆలోచిస్తున్నాను. ఇంతలో కాఫీ కప్పు టేబుల్ పై పెట్టి వెళుతూ మా ఆవిడ "ఆ వుత్తరాలు వచ్చి చాలాకాలమైంది. మీ ఫ్రెండు గిరి కూడా ఒకటి రెండు సార్లు ఫోన్ చేసారు మీగురించి వాకబు చేస్తూ. మీ చిరునామా, ఫోను నంబరు ఇస్తానంటే వద్దులేమ్మా ఎందుకు వాడిని డిస్త్రబ్ చేయటం, తర్వాతే కలిసి మాట్లాడతానని నంబరు కూడా తీసుకోలేదు" అని చెప్పి వెళ్ళి పోయింది.

ఈ రెండు ఉత్తరాల్లో ఏది ముందు చదవాలన్న నా సందిగ్ధానికి మా ఆవిడ మాటలే జవాబు నిచ్చాయి. గిరి ఉత్తరమే ఓపెన్ చేశాను.
చదువుతున్న ప్రతి వాక్యానికీ నా గుండె బరువెక్కడం మొదలయ్యింది. అప్రయత్నంగా అలుముకుంటున్న నా కన్నీరు అక్షరాల్ని అలికేస్తోంది. కళ్ళు తుడుచుకుంటూ అతి కష్టంమీద చదవడం పూర్తి చేశాను. ఉత్తరాన్ని వెనక్కి త్రిప్పి అది పోష్ట్ చేసిన తేదీ చూసాను. సరిగ్గా సంవత్సరం కావస్తోంది.

సంవత్సరం క్రితం రాజేశ్వరి భర్త అనారోగ్యంతో పోయాడట. ఈ ఇరవై పాతిక సంవత్సరాల్లో పెద్దవాళ్ళందరూ ఒక్కక్కరుగా రాలిపోగా ఇప్పుడు భర్తను కూడా పోగొట్టుకుని మరీ వంటరిదైపోయింది పాపం. గిరి అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నానని యెంతో బాధగా వ్రాసాడు.

ఆ బాధనుండి తేరుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. మనసు స్తిమిత పరచుకుని రెండో ఉత్తరాన్ని విప్పాను సుందరం వ్రాసింది.

సుందరం విదేశాల్లో వుద్యోగం విరమించుకుని, ఇండియా వచ్చేసి ఇక్కడే యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా చేరానని, ఒకసారి అందరినీ కలవాలనుందనీ వ్రాసాడు. మరోసారైతే ఈ విషయానికి కేరింతలు కొట్టే వాడినే కాని, మొదటి వుత్తరం తాలూకు విషాదం ఈ ఆనందాన్ని మింగేసింది.

సాయంత్రంవరకూ సాగిన నా దినచర్య అంతా యాంత్రికంగానూ అన్యమనస్కంగానూ సాగిపోయింది. సాయంత్రానికి ఒక నిర్ధారణకు వచ్చి గిరికి ఫోన్ చేసి వాళ్ళ వూరికి బయలుదేరాను.
తెల్లవారి వాడింటికి చేరింది మొదలు మధ్యాహ్నం భోజనాలయ్యేదాకా వాడు పేరుపేరునా అందరి గురించి చెప్తూనే వున్నాడు. మధ్య మధ్యలో రాజేశ్వరి గురించి చెప్తూ బాధపడేవాడు. మనమే యేదో ఒకటి చేయాలిరా అంటూ.

వాడి మంచితనాన్ని, నిర్మలత్వాన్ని మనసులోనే అభినందించాను. ఇప్పటికీ మా లెక్చరర్స్, క్లాస్ మేట్స్, జూనియర్స్, సీనియర్స్ అందరితోనూ చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ అందరిచేతా ఆత్మీయుడనిపించుకుంటున్నాడు.

భోజనాలయ్యి విశ్రాంతి తీసుకున్నాక రాజేశ్వరి యింటికి వెళ్ళాం పలకరించడానికి. మమ్మల్ని చూడగానే విప్పారిన మొహంతో ఆప్యాంగా ఆహ్వానించింది. పలకరించి నాలుగు సానుభూతి వాక్యాలు పలికి మౌనంగా వుండిపోయాను తర్వాత ఏం మాట్లాడాలో అర్థంకాక. రాజేశ్వరికూడా మౌనంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఓ అయిదు నిముషాల తర్వాత కాఫీ కప్పులతో వచ్చి తలో కప్పు యిచ్చి తనూ ఓ కప్పు తీసుకుని కూర్చుంది.మెల్లగా తలెత్తి చూసాను. లోపలికి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చినట్లుంది. స్పష్టంగా తెలుస్తోంది.

ముందుగా సంభాషణ తనే మొదలుపెట్టింది. " ఈ మధ్యన ఇంటిదగ్గర లేరటగా గిరి చెప్పాడు".

"అవును, ఉద్యోగరీత్యా ఓ ప్రోజెక్టు పనిమీద బయటకు వెళ్ళవలసి వచ్చింది. వచ్చి రెండు రోజులే అయ్యింది" అన్నాను.

గడచిపోయిన ఈ ఇన్నేళ్ళ జీవితాన్నీ సింహావలోకనం చేసుకుంటూ మధ్య మధ్యలో కాలేజీ రోజుల్లోని కమ్మదనాన్ని తలచుకుంటూ గడిపేశాం. సుందరం గురించి వాడి విదేశీ చదువు, వుద్యోగం, వాడు ఇండియా వచ్చిన సంగతీ మాట్లాడుకున్నాం. సుందరం ప్రస్తావన వచ్చినప్పుడు రాజేశ్వరి మొఖంలో ఒకలాంటి నిర్వేదాన్ని గమనించాను.

ఇంతలో ఓ పిల్ల పుస్తకాలు పట్టుకుని లోపలికి వచ్చి మమ్మల్ని చూసి తటపటాయించి లోనికి వెళ్ళిపోయింది. పదినిమిషాల తర్వాత రాజేశ్వరి లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని వెంటపెట్టుకుని వచ్చి పరిచయం చేసింది.

"మా అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ యియర్" అంటూ. నన్నూ ఆ అమ్మాయికి పరిచయం చేసింది.
"సారీ అంకుల్, ఎవరో అనుకుని ఇందాక పలకరించకుండా వెళ్ళిపోయాను" అంది రెండు చేతులూ జోడిస్తూ. ఆ అమ్మాయి మొఖం చూస్తూ రెండు క్షణాలు అలాగే వుండిపోయాను. డిగ్రీ చదివే రోజుల్లో రాజేశ్వరి కూడా అచ్చం ఇలాగే వుండేది. 

దగ్గరికి పిలిచి కూర్చోపెట్టుకుని తలమీద చేయివేసి నిమురుతూ తన గురించీ, తన చదువు గురించీ మాట్లాది ఓ అయిదు నిమిషాల తర్వాత ఇక చదువుకోమని పంపించి వేశాను.

నేనూ గిరి కూడా లేచి "వెళ్ళోస్తాం" అంటూ రాజేశ్వరి దగ్గర శలవు తీసుకుని బయలుదేరాం.
రాత్రి భోజనాలయ్యక నేను ప్రయాణమవుతుంటే, "పద నేనూ బస్టాండు దాకావస్తా" నంటూ నాతోనే వచ్చాడు గిరి. దారిపొడవునా రాజేశ్వరి కబుర్లే మాట్లాడుకున్నాం.

"మనమే యేదైనా చేయాల్రా" అంటూ నా భుజంపై చేయివేసి నొక్కుతూ చెప్పాడు.
"అలాగే" అంటూ అప్పుడే వచ్చిన బస్సు ఎక్కి కూర్చున్నాను కిటికీ ప్రక్కగా.
"ఓ వారం పదిరోజుల్లో వచ్చి నిన్ను కలుస్తాను వుంటావుగా" అంటూ కిటికీ ప్రక్కగా వచ్చి అన్నాడు.
"ఆ.. వుంటాను తప్పకుండా రా" అంటూ సమాధానం చెబుతుండగానే బస్సు కదిలింది.
వీడ్కోలుగా చేయునూపుతూ సీట్లో కూర్చున్నాను.
***
ఖచ్చితంగా వారం తర్వాత చెప్పిన ప్రకారమే వచ్చాడు గిరి. కాఫీ టిఫిన్లు అయ్యాక మేడమీద గదిలో కూర్చున్నాం ఇద్దరం మాట్లాడుకుందామని.

"సుందరానికి పెళ్ళి కుదిరింది తెలుసా" అన్నాడు సన్నగా నవ్వుతూ.
అర్ధం కానట్లు కనుబొమలు ముడివేసి చూసాను.
"ఓ! సారీ, నీకు తెలీదుకదా, వాడింకా బ్రహ్మచారే" చదువు, రీసెర్చి, ఉద్యోగాలలో పడి బ్రతికేస్తున్నాడుగాని, జీవితం గురించి, జీవించడం గురించి మర్చిపోయాడు" అన్నాడు.
నా చూపులలోని ప్రశ్నని గమనించి, "కారణం నువు ఊహించలేనంత పెద్దదేం కాదులే" అన్నాడు.

మళ్ళీ తానే చెప్పడం మొదలు పెట్టాడు. "సుందరం ఇండియా వచ్చాక నీకువ్రాసినట్లే నాకూ వుత్తరం వ్రాసాడు. అది పట్టుకుని వాణ్ణి కలవడానికి వెళ్ళాను. మాటలలో రాజేశ్వరి గురించీ, తనకి భగవంతుడు చేసిన అన్యాయం గురించి చెప్పాను. చాలా బాధపడ్డాడు. తన చదువు పూర్తయ్యి, జీవితంలో స్తిరపడేలోగానే రాజేశ్వరి పెళ్ళి వాళ్ళ బావతో జరిగిపోవడం, అటు తర్వాత తాను చదువే పరమావధిగా చేసుకుని రీసెర్చి పేరుతో విదేశాలకి వెళ్ళీపోవడం జరిగిందని ఇక పెళ్ళి ఆలోచన కూడా తనకి రాలేదని చెప్పాడు. అందరు తల్లిదండ్రులు లాగానే రాజేశ్వరి అమ్మనాన్నా కూడా అమ్మాయికి చదువు పూర్తిఅయ్యింది కాబట్టి పెళ్ళి చేసి బాధ్యత తీర్చు కుందామనుకున్నారు. తనూ అందరి ఆడపిల్లల్లాగే తలొగ్గి పెళ్ళాడింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టాల్సిన పనిలేదని పాపం తనకు తానే సర్ది చెప్పుకున్నాడు సుందరం"

"మొన్న నువు వచ్చి వెళ్ళాక రాజేశ్వరిని కలిశాను. సుందరం గురించి చెప్పాను. ఎన్నో విధాల నచ్చచెప్పి సుందరాన్ని చేసుకోమని అడిగాను. జీవితంలో ఇద్దరూ ఒంటరిగా మిగిలిపోయారనీ, జీవితంలో ఒకరికొకరు ఆసరా ఎంతో అవసరమనీ నచ్చ చెప్పాను. తను మాత్రం ససేమిరా ఒప్పుకోననే అంది.
"పెళ్ళీడు కొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకొని నేను పెళ్ళి చెసుకుంటే లోకం హర్షించదనీ, కూతురు ఎదుట తనకు మొహం చెల్లదనీ" అంది.

నేనూ ఆలోచించాను, నిజమే ననిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా, వాళ్ళమ్మాయితో మాట్లాడాను. ప్రస్తుత పరిస్తితులూ, పరిష్కార మార్గాలూ అన్నీ వివరంగా చెప్పాను. పిల్ల చాలా చురుకైనది వాళ్ళ నాన్న లాగానే ప్రాక్టికల్ గా ఆలోచించే తత్వం గలది. తను అర్ధం చేసుకుంటానని, తనకు అభ్యంతరం లేదనీ, కానీ రేపు తనకి పెళ్ళి అయ్యాక అత్తవారింటి వారెవరైనా తన తల్లి చర్యను తప్పుపడతారేమోనన్న భయముందనీ చెప్పింది.

ఇదే భయం రాజేశ్వరీ వ్యక్టం చేసింది. నిన్న సుందరాన్ని కలిసి ఒప్పించడానికి వెళ్తే వాడూ ఇదే ప్రశ్నవేశాడు. ఈ ప్రశ్నలన్నింటికీ నీవద్దనే జవాబు దొరుకుతుందని వచ్చాను.

మీ అబ్బాయికి రాజేశ్వరి కూతుర్ని చేసుకుంటే అన్ని సమస్యలూ తీరి అందరం సంతోషంగా ఉంటాం అన్నాడు దీనంగా నాకళ్ళలోకి చూస్తూ.
చమరించిన నా కళ్ళని కళ్ళజోడు క్రిందినుంచి తుడుచుకుంటూ "ఇన్నాళ్ళ మన స్నేహం బంధుత్వంగా మారితే నాకు మాత్రం సంతోషం కాదా" అంటూ గిరిని దగ్గరకు తీసుకుని గట్టిగా భుజం తడుతూ చెప్పాను.

మధ్యాహ్నం భోజనాల దగ్గర ఈ విషయం అంతా నాభార్యకూ, కొడుక్కీ చెప్పి వప్పించాడు. వారి ఆమోదం పొందాక మనసు కుదుటపడింది ఇద్దరికీ.
ఆ సాయంత్రమే గిరి ప్రయాణమై వెళ్ళిపోయాడు పెళ్ళి పనులు చూసుకోవాలి, అసలే పెళ్ళి మీద పెళ్ళి అంటూ.
============

15 వ్యాఖ్యలు:

శివ రామ ప్రసాద్ చెప్పారు...

కళ్ళు చెమర్చాయి శశిధర్ గారూ..

sravan చెప్పారు...

nice story sir thanks

అజ్ఞాత చెప్పారు...

చాలా...బాగుంది,మంచి కథ,షార్ట్ అండ్ స్వీట్

పింగళి శశిధర్ చెప్పారు...

మిత్రులందరికి ధన్యవాదాలు. మీలాంటివారి ప్రోత్సాహమే కొండంతబలం.

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగా వ్రాశారండీ.

Narayanaswamy S. చెప్పారు...

sweet story. కానీ నిజజీవితంలో సమస్యలు పెళ్ళిళ్ళతో తీరవు సరికదా, చాలా సమస్యలు పెళ్ళితోనే పుట్టుకొస్తాయి :)

పింగళి శశిధర్ చెప్పారు...

ధాంక్స్! రసజ్ఞ గారూ.
ధాంక్స్! నారాయణస్వామి గారూ, కొన్ని సమస్యలు పెళ్ళితో తీరుతాయి కూడా మరి.

jp చెప్పారు...

చాలా బాగా వ్రాశారు. గుండె తడారింది.

పింగళి శశిధర్ చెప్పారు...

Thank you mr.jp

ఫోటాన్ చెప్పారు...

చాలా బాగా రాసారు శశిధర్ గారు !

పింగళి శశిధర్ చెప్పారు...

ఫోటాన్ గారికి ధన్యవాదాలు.

రమణ చెప్పారు...

చాల చాల చాల చాల బాగుంది ... మీరు మరిన్ని వ్రాయాలని కోరుకుంటున్నాను ... -రమణ 

పింగళి శశిధర్ చెప్పారు...

మిత్రులు రమణ గారికి ధన్యవాదాలు. మీ అభిలాష, నా ఆశ నెరవేరాలని కోరుకుంటాను.

sathish చెప్పారు...

Literally so nice; actually i read this in office, it was so difficult for me to control my self while trying to stop the tears from my eyes, let my colleagues couldn't see.

Thank you Sasi garu.

Plese go ahead.

పింగళి శశిధర్ చెప్పారు...

Thank you Satish garu for visiting my blog and the compliments you made. I never expected this much response really. My sincere thanks to one and all.