Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

22, అక్టోబర్ 2011, శనివారం

ఈ కధకి పేరు పెట్టండి!

( శశిధర్ ఫింగళి )


ఆ రోజు యిప్పటికీ నాకు గుర్తుంది. మండువేసవికాలం ఆదివారం మధ్యాహ్నం కిటికిలోంచి చూసాను. ఎవడో మాసిన గడ్డం, చింపిరిజుట్టు, చిరిగిన బట్టలతో నిన్ను భుజాన ఎత్తుకుని పోతున్నాడు. ఎండతగులకుండా కామోసు వాడితలపైన కప్పుకున్న గుడ్డని నీపైనా కప్పి తీసుకుపోతూ కనిపించాడు. నేనా మండుటెండలో నీకోసం వాడివెనకే పరుగులాంటి నడకతో ఎంతదూరం వచ్చానో నాకే తెలీదు. ముందు వాడు, వెనుకనేను, మధ్యమధ్యలో కప్పిన గుడ్డ చాటునుండి నువ్వు. ఎలాగోలా వాడిని బ్రతిమిలాడీ, బామాలీ ఒప్పించి నిన్ను నాసొంతం చేసుకున్నక్షణం నాముఖం యెంతలా వెలిగిపోయిందో నన్ను చూచిన నీకూ గుర్తుండేవుంటుంది.

అప్పటికింకా నాకు పెళ్ళికాలేదు. కొత్తగా వుద్యోగంలో చేరి నాకాళ్ళమీదనేను నిలబడే ప్రయత్నం చేస్తున్నానంతే
. అప్పుడే నచ్చినవి, అవసరమైనవి, అందమైనవి అంటూ గుణత్రయవిభాగం చేసుకుని ఒక్కొక్కటీ సొంతం చేసుకుంటున్న నాకు ఈ మూడు గుణాలు కలబోసుకుని నువ్వు దొరికావు. నిన్ను ఎలా వదులుకుంటాను మరి. మొట్టమొదటి సారిగా నిన్ను చేతుల్తో పొదువుకుని గుండెలకు హత్తుకుని యింట్లో అడుగుపెట్టిన క్షణం, నిన్ను అరచేతుల్లోకి తీసుకుని తనివితీరా చూసుకున్న క్షణం మరచిపోదగినవా చెప్పు. ఆ రోజే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏనాటికైనా నీ నిలువెత్తురూపాన్ని సొంతం చేసుకోవాలని.

అయినా నాపిచ్చి గానీ, మన పరిచయం యీ నాటిదా చెప్పు? నా కైతే గుర్తులేదుకానీ మొదటిసారి నన్ను నాకు పరిచయం చేసింది నువ్వేనటగా? అమ్మ చెప్పింది. .

అప్పుడే వస్తున్న నా నూనూగు మీసాల్ని చూసి "నీవూ ఎదుగుతున్నావు సుమా" అంటూ నువు చూసిన చూపు నన్ను సిగ్గుపడేలా చేసింది. కానీ ఆ నాటినుంచే చిత్రంగా నీమీద మక్కువ పెరిగింది.

చిన్నప్పుడు గట్టుమీద ఆంజనేయస్వామి గుళ్ళో ఒళ్ళంతా సింధూరం బొట్లు పెట్టుకుని రావిచెట్టుప్రక్కన దాక్కున్న నిన్ను తలుచుకుంటే యిప్పటికీ నవ్వువస్తుంది నాకు.

నిజం చెప్పొద్దూ! నువ్వేం మాయచేస్తావో కానీ, నీ ముందుకొస్తే చాలు కాలం కర్పూరంలా కరిగిపోతుంది. నన్ను నేను మరచిపోయేలా చేస్తుంది. అలా ఎన్నో సార్లు నీ సమక్షంలో మైమరచి వున్నప్పుడు అమ్మవచ్చి వేసిన మొట్టికాయలు తలుచుని యిప్పటికీ నవ్వుకుంటుంటాను. అలాగని అమ్మకు నీమీద కోపం అనుకునేవు సుమా! నువ్వంటే తనకీ యిష్టమే. నువ్వు చాలా సుకుమారివట. సున్నితంగా చూసుకోవాలట. నీ హృదయం గాజుపలకట. చూసావా అమ్మకి నువ్వంటే ఎంత యిష్టమో.

ఆనాటి నుంచి నిన్ను అక్షరాలా అలానే చూసుకుంటున్నాను తెలుసా! ప్రేమకి యింతకంటే నిదర్శనం కావాలా? చెప్పు.

నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నీ మనసంతా నన్నే నింపుకోలేదూ, నిన్ను చూస్తున్న ప్రతిసారీ నువు నీగుండెల్లో నింపుకున్న నా రూపాన్నే చూసాను గానీ, నీ వునికిని కూడా యేనాడూ గమనించలేదు. ప్రేమకీ, త్యాగానికీ యింతకంటే నిదర్శనం వుంటుందా?

అనుక్షణం నాతోనే వుంటూ నాలోని ప్రతి యెదుగుదలనీ ప్రత్యక్షంగా చూసిన సాక్షివి నువ్వేకదా! నవ్విన క్షణాలే కాదు, దుఃఖపడ్డ క్షణాల్లో సైతం ఒకేలా ఆదరించిన నీ ఆత్మీయత ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. అ(.. యిప్పుడు నీతో చెపుతుంటే యింకో విషయం గుర్తుకు వస్తోంది. ఆ రోజు నేను పెళ్ళి చేసుకుని నా భార్యతో కలిసి యింటికి వచ్చినప్పుడు యేమాత్రం సందేహించకుండా నీ చిన్ని గుండెలో నాతోపాటు నాభార్యకీ చోటిచ్చి ఆదరించిన నీ హృదయవైశాల్యం ఎన్ని మాటల్లో వర్ణించనూ.

నిర్మలంగా కనిపించే నీరూపం చూసిన ప్రతిసారీ నాకు అసూయ కలుగుతూవుంటుంది. నేనేందుకు నీ అంత నిర్మలంగా వుండలేక పోతున్నానా అని. అయినా, రాగద్వేషాల మాలిన్యాలు అంటని మనుషులుంటారా అని సరిపెట్టుకుంటూ వుంటాను. నీ వెనుకా యేదో మాలిన్యపు కధ వుందని ఎవరో చెప్పగా విన్నాను. ఆ తర్వాతే నీవు నిర్మలత్వాన్ని అలవరచుకున్నావంటారు. నిజమేనా? తప్పయితే మన్నించు. నిన్ను బాధపెట్టాలని కాదు గానీ యేదో సందర్భం వచ్చిందని అడుగుతున్నానంతే.

నాకే తెలీకుండా నా వయసుని నెట్టుకుంటూ కాలం ఓ పాతికసంవత్సరాలు ముందుకు వచ్చేసింది. అయినా మళ్ళీ యిక్కడా నువ్వే. అదే పరకరింపు. అదే రూపం. అప్పుడే తెల్లబడ్డ మీసాన్ని చూపుతూ నీవు నన్ను భయపెట్టినప్పుడు యెంత దిగులు పడ్డానో తెలుసా. ఆ తర్వాత రంగుల మాటున సహజత్వాన్ని దాచుకునే వేళ నాకు సహకరించిందీ నువ్వే, మళ్ళీ నీ కొంటె చూపుల్తో నన్ను మరోసారి సిగ్గుపడేలా చేసిందీ నువ్వే.

కాలం తీసుకువచ్చిన యీ ప్రయాణంలో ఆస్తులతో పాటు అహాన్నీ పెంచుకున్నాను. ఆ వెనుకే డబ్బుతో పాటు దర్పమూ వచ్చింది. కొత్తగా కట్టుకున్న యింట్లో నీ నిలువెత్తు రూపాన్నయితే నిలుపుకున్నానుకానీ, నాతో పాటే నీవూ అన్న సత్యాన్ని మరచిపోయాను. యేళ్ళు పైబడ్డ నిన్ను మనుషులు తిరగని మూల గదిలోకి నెట్టేశాను. నేను తలుపు తీసిన ప్రతిసారీ నావైపే ఆశగా చూసే నీ చూపులు గ్రహించలేనంతగా మసక బారిపోయింది నా మనసు. తత్తరబాటుతో కాళ్ళు తడబడి ఆసరాకోసం నీ మీద చేయివేస్తే .. అది ప్రేమతో నిన్ను నిమిరాననుకొని సంతోషంతో మెరిసిన నీముఖం నన్ను ఆలోచింపచేసింది.

ఇంతటి ఆప్యాయతనీ, అనురాగాన్నీ నింపుకున్న నిన్ను యిన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను ...

ఇకనుంచీ నాతో పాటే నువ్వూ. ఈ క్షణమే నిన్ను కొత్త ఫ్రేం తో ముస్తాబు చేయించి నాగదిలోనే, నాతోపాటే వుంచుకుంటా.. మళ్ళీ నాలో మెదిలే అన్ని భావాలు నీతోనే పంచుకుంటా!

    ***       ***     ***

10 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

అద్దం లో జీవితం

Ennela చెప్పారు...

హహహ బాగుంది కథ , ఆత్రేయ గారు వ్రాసిన కథ పేరు కూడా...

Disp Name చెప్పారు...

శశిధరుని శిల్పం

శశిధర్ పింగళి చెప్పారు...

మిత్రులు ఆత్రేయగారికి, ఎన్నెల గారికి ఇంకా జిలేబి గారికి ధన్యవాదాలు. ఇంకో 1,2 టపాలు చూచి నేననుకున్న పేరు పెట్టేస్తాను.

ఆత్రేయ చెప్పారు...

నేనొప్పుకోను , మీరనుకున్న పేరు పెట్టడానికి , టపాకి ఆ శీర్షిక ఎందుకు పెట్టారు ?
మాతో కధ చదివించటానికా..? అయినా కధ బాగుంది !! అభినందనలు !!

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

sir,
అమోఘం,బాగున్నది !
నా ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుని మరీ నా కన్నా ముందు వారు ఏమి comment వ్రాసారో చూడకుండా నేనే Answer చెయ్యాలని ఉబలాటం తో చెప్తున్నా మీ కథ కథనం అద్దానికి అద్దం పట్టేల ఉండి కనుక "దర్పణం" అని కాని "అద్దం" అని కాని పేరిడి Shows ur self అని కాప్షన్ ఇస్తే బావుంటుందని ... మనవి హమ్మయ్య ఇప్పుడు post చేసి answer right ఓ కాదో చూస్తా !!

the following para is touched my heart. "నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నీ మనసంతా నన్నే నింపుకోలేదూ, నిన్ను చూస్తున్న ప్రతిసారీ నువు నీగుండెల్లో నింపుకున్న నా రూపాన్నే చూసాను గానీ, నీ వునికిని కూడా యేనాడూ గమనించలేదు. ప్రేమకీ, త్యాగానికీ యింతకంటే నిదర్శనం వుంటుందా?" because in front of mirror generally we never recognize or feel its existence except a few like Shankara charya.

సుభ/subha చెప్పారు...

ప్రతిబింబం

Jaabilliraave చెప్పారు...

అందరికీ ధన్యవాదాలు. ముందుగా పొస్టుచేసిన వెంటనే స్పందించిన ఆత్రేయగారికే పెద్దపీట వేయాలి. తర్వాత చదివేవారి ఆలోచనలని అది నియంత్రిస్తుంది సహజం.
ఏదో ఉత్కంఠ రెపెట్టక పోతే స్పందన లెలా వస్తాయి ఆత్రేయగారూ. టెంపో మెయింటైన్ చేయడంలో ఎంతవరకు కృతకృత్యుణ్ణి అయ్యానా అని నాకు నేను పెట్టుకున్న చిన్న పరీక్ష అంతే.
నేననుకున్న పేరు కూడా అలాంటిదే. " ముకురం " అంటే అద్దమనే అర్థం.
సుభ గారూ ఇక్కడ కధకుడు మాట్లాడేది అద్దంతోనే కానీ ప్రతిబింబంతో కాదు సుమండీ!

జ్యోతిర్మయి చెప్పారు...

కథ బావుంది. మంచి పేరునే ఎంచుకున్నారు.

శశిధర్ పింగళి చెప్పారు...

ధాంక్యూ జ్యోతిర్మయిగారూ!