స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

24, ఆగస్టు 2011, బుధవారం

అతిథి 3

( శశిధర్ పింగళి )
                   - ౩ -
"జస్ట్ ఎ మినిట్" అంటూ ఆమె లేచి వెళ్ళింది. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఎవరో స్నేహితురాలు పలకరింపుగా నవ్వుతూ లొనికి రాబోయి హాలులోని కొత్త వ్యక్తిని చూసి తటపటాయిస్తున్నట్లుగా ఆగిపోయింది. అక్కడే ఆమెకి తనని గురించి పరిచయంచేయటం, ఇంకా ఏవో చిన్నగా చెప్పడం వింటున్న ఆమె ముఖంలో ఆనందం, ఆశ్చర్యం, ఒక సందర్భంలో చిన్న చిరుకోపం లాంటివెన్నో రంగులు గబగబా మారిపోతున్నాయి. అంతలోనే ఆమె మామూలుగా మరిపోయింది. స్నేహితురాళ్ళిద్దరూ చేతిలోచేయి వేసుకుంటూ లోనికి వచ్చారు.
తను గ్రహించాడు గుమ్మందగ్గరే స్నేహితురాండ్రిద్దరూ ఏంచెప్పుకున్నారో. ఒకింత ఆశ్చర్యం కూడా చెందాడు. క్షణంక్రితం ముఖంలో ఆన్ని రంగులు మార్చి, ఇప్పుడు ఇంత మామూలుగా రావడాన్ని చూసి. మనసులో అనుకున్నాడు "అందుకే అంటారు ఆడవాళ్ళ హృదయాల్లో సాగరాలు నిద్రపోతుంటాయని".

"హలో.. మీట్ మై ఫండ్ చంద్ర" పరిచయం చేసిందామె.

"నమస్తే"

"నమస్తే" అంటూ ప్రతినమస్కారం చేసాడు. తను ఆమెను ఇందాకే చంద్ర గా గుర్తించిన విశయాన్ని కనబడనీయకుండా.

తను గ్రహించాడు. ఇంతదాకా ఎంతో నిదానంగా, నమ్రతగా, హుందాగా తనతో సంభాషించిన ఈమె కళ్ళలో ఏదో కొత్త మెరుపు తళుక్కు మంటొంది. స్నెహితురాళ్ళ ఇద్దరి చూపులు భేటీ వేసుకున్నప్పుడు చిన్నగా పెదవి విరగని నవ్వులు గమనించాడతను.

సాధారణంగా మనుషుల్లో ఒక విధమైన సైకాలజీ ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పనిచేయడానికి ఎంతో వెరుస్తారు. తనకి సపోర్ట్ దొరికిందనగానే రెచ్చిపోతారు. అల్లరిచేస్తారు. మనంచూస్తూ వుంటాం ఎంతో డిగ్నిపైడ్ గా వుండే వాళ్ళుకూడా అల్లర్లు రేగినప్పుడు సిల్లీగా ప్రవర్తిస్తారు. దాన్నే గ్రూప్ సైకాలజీ అంటారు.

"ఈ అల్లరిపిల్ల ఇంతవరకూ ఒక్కతే కనుక డిఫెన్సివ్ గా కూర్చుంది. ఇప్పుడు సపోర్ట్ దొరికింది. కాబట్టి తనుజాగ్రత్త పడాలి" అనుకున్నాడు.

"చాలా సంతోషం. మిమ్మల్ని కూడా చూడగలిగాను. నేను ఈ రోజే వెళ్ళి పోవాలి. అందువల్ల ఈ ట్రిప్ కి మిమ్మల్ని కలుసుకోలేననే అనుకున్నాను. మీరే వచ్చారు. మెనీ మెనీ థాంక్స్."

"లేదు లేదు నిజానికి నేనుమీకు థాంక్స్ చెప్పాలి. నేవచ్చే వరకూ వున్నందుకు. నిజంగా నేను ఆశ్చర్యపోయాను మిమ్మల్ని చూసి. మీరని తెలుసుకొని."

"నో థాంక్స్, నో రెఫ్యూజెస్...ఒకే!" అన్నడతను.

హాయిగా నవ్వుకున్నారు ముగ్గురూ.

తను ఈరోజే వెళ్ళిపోవాలని, ఇంకా సిటీలో పనివుందనీ, మరోసారెప్పుడైనా లీజర్ గా వస్తానని చెప్పి ఎంత బలవంతం చేసినా వుండకుండా వెళ్ళిపోయాడతను. ఆ వెనుకే తనేదో నోట్స్ కోసం వచ్చానని చెప్పి పుస్తం తీసుకుని వెళ్ళిపోయింది చంద్ర. వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ అలాగే గుమ్మనికి తల ఆనించి ఆలోచనలలోకి వెళ్ళిపోయిందామె.

"అమ్మగారూ..అమ్మగారూ" అంటూ పిల్చాడు రామయ్య.

తన అందమైన కలని ఎవరో పాడుచేస్తున్నట్లుగా ఇబ్బందిగా చూసింది ఏమిటన్నట్లు గా.

"భోజనానికి పిలుస్తున్నారమ్మా! అంతా తమకోసమే ఎదురుచూస్తున్నారు. తమరేమో లైటు కూడా వేసుకోకుండా పడుకున్నారు. వంట్లో బాగా లేదా అమ్మా!" అడిగాడు రామయ్య వినయంగా. చిన్నప్పటినుండి పెంచిన ప్రేమతో కొంచెం చనువు తీసుకుని.

అప్పుడు చూసుకుంది తనని తన పరిసరాలని, తను పడుకున్న తీరు తన గుండెల మీదనున్న మల్లాది నవలని.

"అయితే ఇదంతా కలన్న మాట" చిన్నగా నవ్వుకుంది.

ఇంకా అక్కడే చేతులు కట్టుకుని నిలబడ్డ రామయ్యని చూసి "సర్లే వస్తున్నాని చెప్పు" అని పంపేసింది.

ఆ రామయ్య స్తానంలో తన ఫ్రండ్స్ ఎవరన్నా వుండి వుంటే తను ఎంత అల్లరిచేసేదో ఆనందంతో. తనకే నమ్మబుద్ధి కావడంలేదు ఇదంతా కల అంటే. ఎంత థ్రిల్లింగ్ గా, కళ్ళకి కట్టినట్లు గా వుంది అనుకుంటూ మెల్లగా క్రిందికి రాసాగింది. హాల్లోకి అడుగుపెడుతూ, ఎవరో కొత్త వ్యక్తి ఇంట్లోకి వచ్చినట్లు అంతా తేరిపారచూస్తూ నడుస్తూ డైనింగ్ టేబుల్ సమీపించింది.

ఆ చూపులూ, ఆ నడక వారందరికి వింతగా గోచరించాయి.

"ఏమిటే " అలా కొత్తగా బెదురుచూపులు చూస్తూ వస్తున్నావ్" అంది ఆక్క.

"ఊఁ.." ఉలిక్కిపడ్డట్లుగా వచ్చి టేబుల్ ముందు కూర్చుంది.

మళ్ళీ తను ఆలోచనలలోకి వెళ్ళిపోయింది. ఎదురుగా వడ్డించిన పళ్ళెంలో చూపుడు వేలితో గీతలు గీస్తూ తనలో తనే నవ్వుకుంటూ ఉన్న ఆమెని బుజం పట్టుకుని కుదిపి

"ఏమిటే ఆ ఆలోచనలు భోజనం చేయకుండా" అని మందలించిన ఆమ్మని, తననే చూస్తున్న ఇతర కుటుంబ సభ్యులని చూసి చెబుదామా అని ఒక్క క్షణం అనుకుని, అమ్మో చెప్పడమే, ఈ అందమైన కలని తనలోనే దాచుకోవాలి, ఎవరితోనూ పంచుకోకూడదు" అని నిర్ణయించుకుని "ఏ..ఏం...లేదు...ని...నిద్ర వస్తుంటే.." అంది కంగారుగా.

ఆ మాటలకి అంతా నవ్వుకుని "ఏంటో ఈ పిల్ల ఎవ్వరికీ అర్థం కాదు" అనుకున్నారంతా.
 
//  అయిపోయింది //

3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

simply superb

హనుమంత రావు చెప్పారు...

ఊహలు కట్టే మేడలు ఊహకందవు...బాగుంది.

పింగళి శశిధర్ చెప్పారు...

Thank you Hanumantha Rao garu