స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

31, ఆగస్టు 2011, బుధవారం

సత్యం - శివం - సుందరం - 4

[ పింగళి మోహిని ]సీ.    కన కన కమనీయ కనకాంబర ధరుండు
                          విరిసిన చెంగల్వ విధము పదము!
        మల్లికా సౌరభ మహితంబు మహిమంబు
                          తెల్లగులాబీల తేట మాట!
        అళికులముల బోలు తలనీలముల వాడు
                         చిరునవ్వు వెన్నలల్ చెలగు వాడు!
        సారస పద్మాల రహిబోలు వదనంబు
                         కారుణ్య సంపద గనులు కనులు!

తే.గీ. విశ్వభారతి మెడలోన విరులదండ!
        ఆశ్రితులకెల్ల నిండైన అండదండ!
        భక్త మందారుడౌ సాయి ప్రభువరుండు!
        మనకు తోడుగ నిల్వగా మనవి జేతు! ...4

29, ఆగస్టు 2011, సోమవారం

తెలుగు - వెలుగు

[ పింగళి మోహిని ]


కం|| తెలుగునగల సాహిత్యపు
       విలువెరిగి పఠింపవలయు వేవేల కృతుల్
       సులువైనది, మృదువైనది
       తెలుగున మాట్లాడుకొనుడు ధీవరులారా!

కం|| అధికారభాష తెలుగును
       అధికారులు, భుధులు, జనులు వ్యవహారములో
       విధిగా పాటించినచో
       సుధలొలికెడి తెలుగు భాష శొభిల్లుకదా!

సీ|| నన్నపార్యునిచేతి నాణ్యంపు శిల్పమై
                ప్రభవించినది తెల్గు భారతమున
     వాగ్గేయకారుడై పదకవితలనల్లి
               అమరుడైనాడు నాడన్నమయ్య
     ఉభయభాషాప్రౌఢి నుప్పొంగురాయలు
              తెలుగు వల్లభునిగ తెలుపుకొనియె
      సంఘసంస్కరణకై సాహిత్యమందించి
             తెలుగులో గురజాడ తేజరిల్లె
గీ|| ఎందరెందరొ మాన్యులు యేర్చికూర్చి
     తీర్చిదిద్దినమేలైన తెలుగు భాష
     చదువ సంగీతమగును నజంత భాష
     తేనె లొలికెడి కమ్మని తెలుగు భాష!

|| వేమన పద్యపంక్తులకు ప్రేరణనొందిన సీ.పి.బ్రౌను, యా
     సీమను నున్నపండితుల చెంతనుచేరి తెలుంగునేర్చి, భా
     షామణిహారమా! యనగజాలు నిఘంటువు కూర్చి యిచ్చి నా
     డా మహితాత్ము స్వీయమహదాశయ మిమ్మహి వ్యాప్తిచెందగన్

గీ|| విశ్వవిద్యాలయమ్ములు విబుధజనులు
    తెలుగు ప్రాచీనభాషగా తేల్చి చెప్పి
    పూని ప్రకటింపచేసిరి పుష్టినొంద
    తెలుగు సంస్కృతీ విభవమ్ము దీప్తిగాంచ.

గీ|| రాణకెక్కిన చరితంపు ప్రజల భాష
     భాషలందున లెస్సైన ప్రాచ్యభాష
     తెలుగు ప్రాచీనతను గురుతించెగాన
     కీర్తిగాంచదె భారతకేంద్రప్రభుత. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా అశేష తెలుగు మిత్రులకు శుభాభినందనలు.

27, ఆగస్టు 2011, శనివారం

సత్యం - శివం - సుందరం - 3

                        (పింగళి మోహిని)

    సీ.   అజ్ఞాన తిమిరమ్ము హరియించి కిరణాల
                             వెలిగించు వెల్గుల వేల్పు యితడు!
           పరమత సహనంబు ప్రజల సంక్షేమమ్ము
                             లోకాన జాటు యశోకుడితడు
           శిష్యులప్రేమమ్ము స్థిరముగా పొందిన
                            గురుమూర్తి శ్రీరామకృష్ణుడితడు!
            భారత సంస్కృతీ ప్రాభవమ్మును
                            విశ్వవేదిపై చాటు వివేకుడితడు!
 తే.గీ.    సకల జనప్రేమ బోధించు శాంత్యహింస,
            సకల జనసేవ సాధించు సత్ప్రశంస
            సత్య శివ సుందరుండైన సత్యసాయి
            తెలుగు వెలుగైన ఘన విశ్వదీపకుండు! ... 3

24, ఆగస్టు 2011, బుధవారం

అతిథి 3

( శశిధర్ పింగళి )
                   - ౩ -
"జస్ట్ ఎ మినిట్" అంటూ ఆమె లేచి వెళ్ళింది. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఎవరో స్నేహితురాలు పలకరింపుగా నవ్వుతూ లొనికి రాబోయి హాలులోని కొత్త వ్యక్తిని చూసి తటపటాయిస్తున్నట్లుగా ఆగిపోయింది. అక్కడే ఆమెకి తనని గురించి పరిచయంచేయటం, ఇంకా ఏవో చిన్నగా చెప్పడం వింటున్న ఆమె ముఖంలో ఆనందం, ఆశ్చర్యం, ఒక సందర్భంలో చిన్న చిరుకోపం లాంటివెన్నో రంగులు గబగబా మారిపోతున్నాయి. అంతలోనే ఆమె మామూలుగా మరిపోయింది. స్నేహితురాళ్ళిద్దరూ చేతిలోచేయి వేసుకుంటూ లోనికి వచ్చారు.
తను గ్రహించాడు గుమ్మందగ్గరే స్నేహితురాండ్రిద్దరూ ఏంచెప్పుకున్నారో. ఒకింత ఆశ్చర్యం కూడా చెందాడు. క్షణంక్రితం ముఖంలో ఆన్ని రంగులు మార్చి, ఇప్పుడు ఇంత మామూలుగా రావడాన్ని చూసి. మనసులో అనుకున్నాడు "అందుకే అంటారు ఆడవాళ్ళ హృదయాల్లో సాగరాలు నిద్రపోతుంటాయని".

"హలో.. మీట్ మై ఫండ్ చంద్ర" పరిచయం చేసిందామె.

23, ఆగస్టు 2011, మంగళవారం

నీతికి చెరసాలె...

( పింగళి మోహిన )

జాతిపిత అడుగుజాడల
నేతల యవినీతి జాడ్య నిర్మూలనకై
జాతికి హితమును గూర్చెడి
నీతికి, చెరసాలె నేడు నేస్తంబయ్యెన్.

జాతిపిత అడుగుజాడల
జాతికి జన లోకపాలు చట్టము కొరకై
చేతన సాధించిన ఘన
నీతికి, చెరసాలె నేడు నేస్తంబయ్యెన్.

( శంకరాభరణం బ్లాగ్ కంది శంకరయ్య గారి సమస్యాపూరణలలో నా.... )

22, ఆగస్టు 2011, సోమవారం

అతిథి 2

శశిధర్ పింగళి )
                   -  2  -
"వీవ" ఆశ్చర్యంగా చూసిందామె ఎమిటన్నట్లు.

"ఏమీ లేదు, మీరు వీర వనిత కదా, ఎప్పుడొ అతగాడు మీ టీజింగుకి బలి అయ్యుంటాడు అందుకే అంతలా బెదిరిపోయాడు పాపం".

"యూ సిల్లీ" అంటూ కొద్దిగా సిగ్గుపడిందామె ఆ కాంప్లిమెంట్ కి. చైర్ లో వెనక్కివాలి కుడిచేతి బొటనవేలి గోరుని ఎడమచేతి వుంగరంవేలు గోరులోనికి పోనిచ్చి చిటపటలాడిస్తూ, మెల్లగా వెనక్కి వాలి కూర్చుంది.

"నా వుత్తరం అందిందనుకుంటాను. మా చంద్రకూడా వ్రాసింది అందులో. నిజానికి మీ జాబు కోసం ఎదురుచూస్తున్నాం. మీరే వచ్చారు."

"అదిందండి. వెంటనే రిప్లైకూడా యిద్దామనుకున్నాను. ఎటూ ప్రయాణం ఉందికదా అని ఆగాను. అయినా మీ చంద్ర ఉత్తరం చదవటానికే టైం సరిపోలేదు. ఎలాగూ వస్తున్నాను కదా ఆమె చేతనే చదివించి అర్థం చెప్పించు కుందామని కూడా తెచ్చాను."

"ఇది వరలో వుత్తరాల్లో ఒక జోక్ వ్రాసినట్లు గుర్తు, గుర్తుందా?"

"ఏమిటి" అన్నట్లు చిన్నగా తల పంకించింది ఆమె.

20, ఆగస్టు 2011, శనివారం

అతిథి

( శశిధర్ పింగళి )

(80వ దశకంలో శ్రీ మల్లాది, యండమూరి గార్ల కథలు, సీరియల్స్, నవలలు విరివిగా వచ్చే రోజుల్లో.. అవి చదివి వ్రాసినది. అయితే యెక్కడికీ పంపలేదు అసలు పంపాలనే ఆలోచనే రాలేదప్పట్లొ. బ్లాగ్ మొదలు పెట్టాక పాత ఖజానాలు వెతుకుతుంటే బయల్పడిందిది. మీతో పంచుకోవాలని ఇప్పుడిక్కడ పెడుతున్నా..చదివి అభిప్రాయాలు తెల్పండి.)

"అమ్మగారూ! తమరికోసం ఎవరో బాబుగారు వచ్చారండి" అంటూ రామయ్య వినయంగా చేతులు కట్టుకుని చెప్పి వెళ్ళి పోయాడు.

అఁ.. అంటూ తను చదువుతున్న మల్లాది పుస్తకంలోంచి తల త్రిప్పి, ఒక్క క్షణం ఆలోచించింది వచ్చింది యెవరై వుంటారా అని. తను అప్పటివరకూ చదువుకుని బాగా అలసిపోయింది. అందుకే రిలీఫ్ కోసం నిన్న తన ఫ్రండునుండి తీసుకున్న నవల తీసింది చదువుదామని. సాధారణంగా తను బాగా అలసి పోయినప్పుడు మాత్రమే మల్లాది నవలలు చదువుతుంది. అందులోని సునిసిత హాస్యం, ఆ శిల్పం తనకెంతో రెలీఫ్ నిస్తాయి.

మేడమీద తనగదిలో డబుల్ కాట్ పై పడుకుని చదువుకునేది కాస్తా ఒక్కసారి వెల్లికిలా తిరిగి గుండెల మీద తెరచిన పుస్తకాన్ని పెట్టుకుని రెండు నిముషాలు ఆలోచించింది "వచ్చింది ఎవరై వుంటారా అని". తన చిన్న బుర్రకి ఎవరూ తట్టక పోవడంతో "చూద్దాం" అని పుస్తకాన్ని పక్కనపెట్టి లేచింది సన్నగా వళ్ళు విరుచుకుంటూ.

లేచి బాల్కనీ లోకివచ్చి క్రింద సోఫాలో ఒక ప్రక్కకి ఒదిగి కూర్చున్న వ్యక్తిని చూసింది వెనుకనుండి. ఎవరబ్బా! ఎవరో కొత్త వ్యక్తిలా వున్నాడే అనుకుంది. క్రింద సొఫాలో కూర్చుని ఇల్లంతా కలయచూస్తూ వినక్కి తిరిగిన అతన్ని చూసింది. ఒక్కసారిగా అశ్చర్యం, సంభ్రమం మిళితమై విస్ఫారిత నేత్రాలతో చూసింది "కలా నిజమా" అనుకుంటూ.

అతను లేచి నిలబడి పలకరింపుగా చిన్నగా నవ్వుతూ చూస్తున్నాడు.

19, ఆగస్టు 2011, శుక్రవారం

సత్యం - శివం - సుందరం - 2

            (పింగళి మోహిని)

సీ.    మానవ సేవల మహిమంబు జాటిన
                   పుణ్యుండు గౌతమ బుద్ధుడతడు!
        ఆశ్రితావనదీక్ష యాసురగుణ శిక్ష
                 జరిపించు శ్రీరామ చంద్రుడితడు!
        మనుజ కర్తవ్యమ్ము మరుగునబడు వేళ
                కేల్సాచి బోధించు కృష్ణుడితడు!
        స్వార్థమ్ము త్యజియించి పాపుల క్షమియించు
               కీర్తిని గాంచిన క్రీస్తు యితడు!

తే.గీ. సర్వధర్మాల సారమీ సత్యసాయి!
        సకల మార్గాల గమ్యమీ సత్యసాయి!
        సర్వదేవతా రూపమీ సత్యసాయి!
       సకల జనవంద్యుడగు స్వామి సత్యసాయి! ...2

18, ఆగస్టు 2011, గురువారం

పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరియయ్యె..

( పింగళి వేంకట శ్రీనివాస రావు( శ్రీ కాశ్యప) )

క్రన్నన దీక్షబూననిడె కామిత పాశుపతమ్ము మెఛ్చుచున్
మన్ననజేసి పార్థుని సమాహిత మాయ కిరాతమూర్తి యా
పన్నగభూషణుం డరయ పన్నగశాయికి వైరియయ్యె నా
పన్నుని యార్తునిన్ గయుని పార్థుడె కావదలంచి యేర్పడన్

( పింగళి మోహిని )

మున్ను వరాన బాణునకు ముంగిలి కావలి యయ్యె శూలి; యా
సన్న రణాంగనమ్మున ఉషాపతి యయ్యనిరుద్ధు కోసమై
వెన్నుడు బాణునిన్ కదియు వేళ పరస్పర శత్రులట్లు యా
పన్నగ భూషణుండరయ పన్నగశాయికి వైరి యయ్యెడిన్
( శంకరాభరణం బ్లాగ్ కంది శంకరయ్య గారి సమస్యాపూరణలలో నావంతుగా ఇలా.... )

17, ఆగస్టు 2011, బుధవారం

సత్యం - శివం - సుందరం - 1

                (పింగళి మోహిని)


       సీ||    వెలియైన విలువైన వేదాది విద్యల
                               మనకంద జేసిన మత్స్యరూపి
               అమరత్వలబ్ధికి నాదారభూతమై
                               కూర్మి వెన్నందించు కూర్మరూపి
               అసుర గుణావిష్టయైనట్టి పుడమిని
                              రక్షించు నాదివరాహమూర్తి
               దుష్టశిక్షణ కేళి శిష్టరక్షణ కళా
                             శీలతత్పరుడు నృసింహమూర్తి
               దివ్యకార్యార్థమై త్రిపదాల బలిమితో
                             బ్రహ్మాండమలమిన వామనుండు
               పరశువు జేబూని ప్రబలక్షత్రియ గర్వ
                             భంగమ్ము గావించు భార్గవుండు
               ఆశ్రితావనదీక్ష యాదర్శవర్తనల్
                             ధర్మవిగ్రహుడు కోదండపాణి
               అఖిల నిగమ సారమగు గీత బొధించు
                             ఆచార్యవరుడైన యదువిభుండు

   తే.గీ||   ధర్మహితబొధ చేయు సిద్దార్థమౌని
              లీలనవతార కళలన్ని మేళవించి
              ధర్మసంస్థాపనార్థమై ధరకు దిగిన
              పదవయవతారుడే! సాయి ప్రభువరుండు!

16, ఆగస్టు 2011, మంగళవారం

స్స్వాతంత్ర్యము దేశప్రజల చావుకు వచ్చెన్!!!

చూతమటన్నను పల్కదు
నీతిగ మాటొకటినేడు నేతల నోటన్
భీతిని గొల్పెడు 'భావ'
( శంకరాభరణం బ్లాగ్ కంది శంకరయ్య గారి సమస్యాపూరణలలో నావంతుగా ఇలా.... )

15, ఆగస్టు 2011, సోమవారం

ఆహ్వానం


భారత మాతనెన్నుదుట భవ్యపు తిల్కము దిద్దరండి, యో
పౌరవరేణ్య! మీరలు నపార సదాశయ స్ఫూర్తిమంతులై
చేరగరండి దండులయి శీఘ్రమె నీ యవినీతి పోరుపై
ఆరని జ్యోతులైవెలుగ నన్నహజారెకు  మద్దతివ్వగన్

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల తో..

14, ఆగస్టు 2011, ఆదివారం

రక్షాబంధనమునాడు రావలదన్నా


రోజుకో ధర్నా, పూటకో బందు జరిగే ఈరోజుల్లో చెల్లెలు ఇలా....
దీక్షగ చెల్లెలె యన్నకు
రక్షాబంధనము సేయ రావలెనన్నన్
దీక్షలు, బందులునేవియు
( శంకరాభరణం బ్లాగ్ కంది శంకరయ్య గారి సమస్యాపూరణలలో నావంతుగా ఇలా.... )


10, ఆగస్టు 2011, బుధవారం

భాష

[పింగళి శశిధర్]

నన్ను నీవు
నిన్ను నేను
అర్థం చేసుకోవాలనే - ఈ
నిరంతర ప్రయత్నం -
అర్థ నిఘంటువూ - అర
చేతిలోనే వుంది
కానీ - భాషే
తెలియడంలేదు !?

6, ఆగస్టు 2011, శనివారం

నేస్తం !

[పింగళి శశిధర్]

మల్లెకు వాసన నేస్తం
వెన్నెల జాబిలి నేస్తం
భ్రమరానికి పూవులు నేస్తం
నేస్తం !
ఈ రీతినే మన ఇద్దరి హస్తాల్
పెన వేసుకునుం డాలోయ్
ఆనందపు టంబుధి పొంగి
నిండాలోయ్
ఈ జగతి సమస్తం !!!

ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా
మిత్రులందరికి శుభాకాంక్షలతో..