స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

29, జులై 2011, శుక్రవారం

గురుతుల్యులు సరసకవి "కవిశిరోమణి" ఆచార్య రావికంటి వసునందన్ గారి 60వ జన్మదిన మహోత్సవ శుభవేళ సరస సాహిత్య సమయస్ఫూర్తి తో సమర్పించు ప్రశంసా పద్య షట్కము.

[రచన:  పింగళి మోహిని ]

రసనిష్యందము  భావగర్భితమునై రమ్యార్థ కల్ప ప్రసా
ద సమారాధ్యము శేముషీకలిత చందస్సుందరోపేతమై
లసదోదాత్త చమత్కృతుల్ ప్రతిపదాలంకారికా జ్యోత్స్న పెం
పెసలారంగ రచించితే నవకవీ విద్వత్ప్రభా భారవీ!

ప్రాచీనాధునికాంధ్ర సత్కవుల ధారాసుద్ధి పాండిత్యమున్
ఔచిత్యాంచిత దృశ్యవర్ణనలు సద్యస్ఫూర్తివంతమ్ముగా
వాచోవీచి మహోర్మికాభరిత శార్వాణీ యశోవైభవం
బాచార్యోత్తమ మీదు సత్కృతులలో ఆవిష్కృతంబయ్యెడిన్.

23, జులై 2011, శనివారం

మార్పు

[ శశిధర్ పింగళి ]
( ఈ కథే మొన్న జులై 3 ఆదివారం వార్త బుక్ లో వచ్చిందండోయ్.... )


"పాత పేపర్లు కొంటాం..", "పాత పేపర్లు కొంటాం.." దూరంగా వీధిలోంచి కేక వినిపిస్తోంది.
చేతిలో కాఫీ కప్పుతో అప్పుడే గదిలోనికి ప్రవేశిస్తూ

"ఏమండీ పిలవమంటారా" అంటూ కొంటెగా చూసింది కమల.

రోషంతో నాకళ్ళు పెద్దవి చేస్తూ "కంచూ" అంటూ అరిచాను పళ్ళు బిగపట్టి.

"నేనేం కంచు ను కాను. కనకాన్నే. లక్షణంగా కనక మహా లక్ష్మి అని పేరుపెట్టారు మావాళ్ళు. పూర్తిపేరు పిలిచే ఓపిక లేకపోతే కనకం అని పిలవండి. కాదనుకుంటే కమల అని పిలవండి. అంతేగాని ఇలా కంచు, గించు అంటే పలికేదిలేదు. మాట్లాడేది లేదు." అంది కోపాన్ని నటిస్తూ.

లేదులేవోయ్, నువ్వు మాట్లాడితే కంచుగంట మ్రోగినట్లు ఠంగ్ మంటుందనీ" అన్నాను.

18, జులై 2011, సోమవారం

నా తొలి పద్యం .. సమస్యాపూరణం

[ పింగళి శశిధర్ ]

చేరెడు కన్నులందు గురిచేసిన గాలము గ్రుచ్చి, గ్రుచ్చి,
య్యారము తోడ లేనడుము అల్లల నాడగ పాదమందు, శృం
గారము చిందు అందియలు ఘల్లున మ్రోగెడు కన్నె మోహనా
కారము కన్నులంబడగ కల్గదె మోదము మానవాళికిన్.

(ఆకాశవాణి విజయవాడ సమస్యాపూరణం కార్యక్రమంలో ది.23.08.1983 న చదవబడింది)

3, జులై 2011, ఆదివారం

శ్రీ మేడసాని వారి అవధానం పై స్పందన

(పింగళి మోహిని)
(ఒకసారి శ్రీ మేడసాని వారి అవధానం చూసిన ఆనంద పారవశ్యంలో ఇలా...)


1. హృద్యంబై, కమనీయమై, మధురమై, యుత్సాహ సంయుక్తమై
    సద్యోజాత చమత్కృతీ భరితమై, సంపూర్ణ ధారాళమై
    ఉద్యద్దారణ ప్రౌఢిమాసగుణమై, ఓజోగుణోపేతమై
    ఆద్యంతంబలరించె మోహనునిదౌ అష్టావధానమ్మిటన్ !

2. ప్రాచీనాధునికాంధ్ర కావ్యగత సారంబున్ మదింగ్రోలి, త
    ద్రోచోరాజిత ‘ధార’ యాశు కవితా రూపాన తోడుండగా
    వాచాంబోధి సరస్వతీ సుతుడుగా భాస్వంత సత్కీర్తియై
    ఆచార్యోత్తమ పీఠిపై నిలచె తా నష్టావధానమ్ముచే !